ఐపీఎల్ 17 ఏళ్లుగా నాన్ స్టాప్.. ఇంకా మీకు తెలిసిన వారుంటే చెప్పండి?
"తుపాకీ" పరిశీలనలో 17 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు ఎవరో తేలింది. మరి అభిమానులైన మీ పరిశీలనలో ఇంకా ఇలాంటి వారుంటే చెప్పండి.
By: Tupaki Desk | 18 April 2024 2:30 PM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. రూ.వందల కోట్ల మార్కెట్ తో మొదలై.. వేల కోట్లకు చేరి.. అతి త్వరలో రూ.లక్ష కోట్ల విలువను అందుకోనున్న క్యాష్ రిచ్ క్రికెట్ లీగ్. పది జట్లతో పదుల సంఖ్యలో మ్యాచ్ లతో అడగడుగునా అభిమానంతో దూసుకెళ్తూ.. 17వ సీజన్ కూడా దిగ్విజయం అవుతోంది. ఇక వచ్చే సీజన్ కు మరింత మజా వచ్చేలా ఆటగాళ్లంతా వేలంలోకి రానున్నారు. అయితే, ఈ 17 సీజన్లలో వివాదాలు లేవా? అంటే ఉన్నాయి. ఆటగాళ్ల మధ్య వివాదాలు, ఫిక్సింగ్స్ ఆరోపణలు వచ్చినా అవేమీ లీగ్ ను ఆపలేకపోయాయి.
అప్పటినుంచి..
హార్దిక్, బుమ్రా వంటి వందల మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వారివారి జాతీయ జట్లకు అందించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇందులో 17 సీజన్లుగా ఆడుతున్న ఆటగాళ్లు ఎవరంటే వేళ్ల మీద చెప్పవచ్చు. ముఖ్యంగా 16 ఏళ్లగా క్రికెట్ కెరీర్ కొనసాగడం కష్టం కాబట్టి.. ఇలాంటి వారు అతి తక్కువే. ఇందులో విదేశీ క్రికెటర్లు అయితే దాదాపు లేరనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో కెరీర్ మొదట్లో ఉన్నవారు రిటైరపోయారు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న వార్నర్ వంటి వారు 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి రాలేదు. క్రిస్ గేల్.. ఇంకా ఆడుతున్నప్పటికీ ఎవరూ అతడిని తీసుకోవడం లేదు.
అందరూ మనోళ్లే?
భారత మాజీ కెప్టెన్ ధోనీ, టాప్ బ్యాటర్లు కోహ్లి, రోహిత్, స్పిన్ ఆల్ రౌండర్లు జడేజా, అశ్విన్, మాజీ ఓపెనర్ ధావన్, రహనే, ఫినిషర్ దినేశ్ కార్తీక్ 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నారు. గతంలో టీమిండియాకు ఆడిన పీయూష్ చావ్లా, మనీశ్ పాండే సైతం లీగ్ లో మొదటినుంచి కొనసాగుతున్నారు. కాగా, వీరంతా భారత క్రికెటర్లే కావడం గమనార్హం.
వీరే కాక ఇంకెవరున్నా..
"తుపాకీ" పరిశీలనలో 17 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు ఎవరో తేలింది. మరి అభిమానులైన మీ పరిశీలనలో ఇంకా ఇలాంటి వారుంటే చెప్పండి.
కొసమెరుపు: ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే జట్టుకు ఆడిన క్రికెటర్ విరాట్ కోహ్లి మాత్రమే. ధోనీ కూడా ఒకటే జట్టు (చెన్నై సూపర్ కింగ్స్)కు ఆడినా మధ్యలో ఫిక్సింగ్ ఆరోపణలతో అది పుణె సూపర్ జెయింట్స్ గా మారింది. రోహిత్ గతంలో దక్కన్ చార్జర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. జడేజా 2016 సీజన్ లో గుజరాత్ లయన్స్ కు ఆడాడు.