సంచలనం.. దక్షిణాఫ్రికాపై క్రికెట్ లో 21 ఏళ్ల బ్యాన్.. ఎందుకో తెలుసా?
రెండు దశాబ్దాలు బ్యాన్ భారత్ లాగానే దక్షిణాఫ్రికా మూడు ఫార్మాట్లలోనూ బలమైన జట్టు. బోర్డు తీరు కారణంగా ఐదారేళ్ల కిందట సంక్షోభం ఎదుర్కొన్నా.. ఇప్పుడు మళ్లీ గాడిలో పడింది.
By: Tupaki Desk | 28 Jun 2024 11:28 AM GMTప్రపంచ క్రికెట్ లో బలమైన జట్లు ఐదారే. వాటిలో వరుసగా చెప్పుకొంటే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్. వీటిలోనూ న్యూజిలాండ్, పాక్ లది 5, 6 స్థానమే. శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ పెద్దగా బలమైనవి కాదు. అయితే, అఫ్ఘానిస్థాన్ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది.
రెండు దశాబ్దాలు బ్యాన్ భారత్ లాగానే దక్షిణాఫ్రికా మూడు ఫార్మాట్లలోనూ బలమైన జట్టు. బోర్డు తీరు కారణంగా ఐదారేళ్ల కిందట సంక్షోభం ఎదుర్కొన్నా.. ఇప్పుడు మళ్లీ గాడిలో పడింది. మంచి పేసర్లు, మేటి బ్యాట్స్ మెన్ తో బాగా ఆడుతోంది. ఇటీవల భారత్ లో జరిగిన వన్డే ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా ఎంత దూకుడుగా ఆడిందో అందరూ చూశారు. ఇదే ఊపులో ఇప్పుడు టి20 ప్రపంచ కప్ ఫైనల్ కు దూసుకొచ్చింది. అయితే, దక్షిణాఫ్రికాకు ప్రపంచ క్రికెట్ లో ఓ చేదు గుర్తు ఉంది. 1991కు ముందు ఆ జట్టు 21 ఏళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొంది. 1970లో మొదలైన ఆ నిషేధం 1991 వరకు సాగింది. దీనికి కారణం.. వర్ణ వివక్ష లేదా జాతి వివక్ష.
ఏమిటీ వివక్ష?
దక్షిణాఫ్రికా.. ఆఫ్రికా ఖండంలో దక్షిణ భాగంలో ఉంటుంది ఈ దేశం. అందుకే దీనిని దక్షిణాఫ్రికాగా పేర్కొంటారు. నల్ల జాతీయుల దేశం అయిన దక్షిణాఫ్రికాకు యూరప్ నుంచి తెల్లవారు వలస వచ్చి స్థిరపడడిపోయారు. వీరు మైనారిటీ వర్గమే అయినా అవకాశాలు అందిపుచ్చుకుని అన్ని రంగాల్లోనూ, రాజకీయంగానూ బలపడ్డారు. నల్ల జాతీయులపై తీవ్ర వివక్ష చూపసాగారు. దీంతోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీవ్ర చర్యలకు పూనుకుంది. జాతి వివక్ష కారణంగా చూపుతూ 21 ఏళ్ల పాటు నిషేధం విధించింది.
వేస్ట్ గా పోయిన ప్రతిభ 21 ఏళ్లంటే మామూలు సమయం కాదు. ఇంత వ్యవధిలో రెండు తరాల క్రికెటర్లు తమ అంతర్జాతీయ కెరీర్ ను కోల్పోయారు. ఇలాంటివారిలో దక్షిణాఫ్రికా మేటి ఆల్ రౌండర్ అయిన షాన్ పొలాక్ తండ్రి పీటర్ పొలాక్, బాబయ్ గ్రేమ్ పొలాక్ వంటి వారున్నారు. కెప్లెర్ వెస్సెల్స్ వంటి వారు ఆస్ట్రేలియాకు వెళ్లిపోయి అక్కడే జాతీయ క్రికెటర్ గా ఎదిగారు. నిషేధం ముగిశాక దక్షిణాఫ్రికాకు తిరిగొచ్చి కెప్టెన్సీ చేశాడు.
కొసమెరుపు: 1991లో 21 ఏళ్ల నిషేధం అనంతరం అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేసిన దక్షిణాఫ్రికా తొలిసారిగా భారత్ తోనే ఆడింది. అప్పుడు భారత కెప్టెన్ హైదరాబాదీ మొహమ్మద్ అజహరుద్దీన్.