Begin typing your search above and press return to search.

భారత మహిళా క్రికెట్ లో పెను సంచలనం..

కౌర్ ను తప్పించి కర్ణాటక కు చెందిన మంధానకు కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Jan 2025 6:30 PM GMT
భారత మహిళా క్రికెట్ లో పెను సంచలనం..
X

హర్మన్ ప్రీత్ కౌర్.. అప్పుడెప్పుడో మంచి ఇన్నింగ్స్ ఆడింది.. వయసు 35 దాటిన ఈమె కొంతకాలంగా బాగా నిరాశపరుస్తోంది. షెఫాలీ వర్మ.. 16 ఏళ్ల వయసుకే టీమ్ ఇండియాలోకి వచ్చేసిన ఈమె ఇటీవలి కాలంలో సరిగా ఆడిందే లేదు.. దీంతో భారత మహిళల జట్టు అనుకున్నంతగా ఫలితాలు రాబట్టడం లేదు. కౌర్ ను తప్పించి కర్ణాటక కు చెందిన మంధానకు కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. జట్టు బ్యాటింగ్ లోనూ చాలా మెరుగుపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి సమయంలో దూసుకొచ్చిందో యువ కెరటం.

ఆడింది ఆరు మ్యాచ్ లే.. కానీ పరుగులు మాత్రం 444. సగటు 74. ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు.. ఇవి పురుషుల క్రికెట్ గణాంకాలు కాదు.. మహిళల వన్డేల్లో ప్రతీక రావల్‌ స్కోర్లు. మహిళా క్రికెట్ లో తొలి 6 ఇన్నింగ్స్‌ లో ఏ బ్యాటరూ ఇన్ని పరుగులు చేయకపోవడం గమనార్హం. పురుషుల క్రికెట్‌ లో దక్షిణాఫ్రికా క్రికెటర్ జానెమన్ మలాన్ మాత్రమే ఈ స్థాయిలో పరుగులు సాధించాడు.

ప్రతీక డిసెంబరు 22న వెస్టిండీస్‌ తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చింది. ఆ మ్యాచ్ లో 40 పరుగులు చేసింది. తర్వాత 76 కొట్టింది. ఐర్లాండ్‌ తో వన్డే సిరీస్‌ లో వరుసగా 89, 67 పరుగులు చేసింది. బుధవారం 154 కొట్టింది. దీప్తిశర్మ (188), హర్మన్‌ప్రీత్‌ (177 నాటౌట్‌) తర్వాత మహిళల క్రికెట్లో 150 పైగా పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచింది.

సమర్థురాలైన ఓపెనర్

24 ఏళ్ల ప్రతీక కుడిచేతి బ్యాటర్. ఆఫ్ స్పిన్ కూడా వేస్తుంది.

దేశవాళీల్లో ఢిల్లీ, రైల్వేస్‌ తరఫున ఆడుతుంది. షెఫాలీ, హర్మన్ వైఫల్యాలతో ప్రతీకకు అవకాశం దక్కింది. దీనిని ఆమె రెండుచేతులా అందిపుచ్చుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపైనా ఇదే స్థాయి ఇన్నింగ్స్ ఆడితే ప్రతీకను ఆపడం కష్టం.

ప్రతీక తండ్రి ప్రదీప్‌ రావల్‌ ఒకస్థాయి వరకు క్రికెట్ ఆడారు. బీసీసీఐ సర్టిఫైడ్‌ లెవెల్‌-2 అంపైర్‌. దేశవాళీ మ్యాచ్ లలో అంపైరింగ్ చేస్తుంటారు. ప్రతీక సైకాలజీలో డిగ్రీ చదివింది. స్కూల్లో ఆమె బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌. జాతీయ స్కూల్‌ గేమ్స్‌ లో గోల్డ్ గెలిచింది.