మనోళ్ల కంటే వాళ్లకెందుకు రేటు? విశేషాలతో ఐపీఎల్ లో ఓ కొత్త శకం
అప్పుడు ఒక్కో ఫ్రాంచైజీ నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకునే నిబంధన అమలు చేశారు.
By: Tupaki Desk | 29 Sep 2024 12:30 PM GMTమెగా వేలం.. ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు.. అన్ క్యాప్డ్ రూల్.. వేలంలో కొన్నాక అందుబాటులో లేకుంటే రెండేళ్ల బ్యాన్.. 2025 వేసవిలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విశేషాలే విశేషాలు.. మొన్నటివరకు సందిగ్ధత నెలకొన్న ఎందరిని రిటైన్ చేసుకోవాలనే అంశంపైనా తాజాగా స్పష్టత వచ్చింది. ప్రతి ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు (రిటైన్) ఐపీఎల్ పాలకవర్గం ఓకే చెప్పింది. అయితే, ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఉంటుంది. రిటైన్ గా పెట్టుకున్న అయిదుగురి కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక జట్టు దగ్గర ఉండే మొత్తం డబ్బు రూ.120 కోట్లు.
రెండేళ్ల కిందట నలుగురు..
ఐపీఎల్ లో ఈ ఏడాది మెగా వేలం జరగనుంది. చివరిగా 2022లో మెగా వేలం నిర్వహించారు. అప్పుడు ఒక్కో ఫ్రాంచైజీ నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకునే నిబంధన అమలు చేశారు. ఇక చర్చనీయాంశంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను వచ్చే సీజన్ లోనూ కొనసాగించనున్నారు. ముంబై, కోల్ కతా, హైదరాబాద్ వంటి గట్టి ఫ్రాంఛైజీలు ఆరు నుంచి ఎనిమిది మంది రిటైన్ కు పట్టుబట్టాయి. అయితే, బలమైన ఆటగాళ్లు లేని ఫ్రాంఛైజీలు మాత్రం తాము నష్టపోతామనే ఉద్దేశంతో వ్యతిరేకించాయి. ఇక మెగా వేలం నవంబరులో జరగనుంది.
మ్యాచ్ ఫీజు
ఇప్పటివరకు రంజీ మ్యాచ్ లు, అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకే మ్యాచ్ ఫీజులు చెల్లించేవారు. ఇప్పుడు ఐపీఎల్ లో 2025 నుంచి లీగ్ మ్యాచ్ లు ఆడేందుకు ఎంపికైనవారికీ రూ.7.50 లక్షలు రానున్నాయి. కాంట్రాక్ట్ మొత్తంతో పాటు ఒక ఆటగాడు అన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడితే రూ.1.05 కోట్లు దక్కుతాయి. అయితే, ఒక జట్టు ఈ ఫీజుల కోసం మొత్తం రూ.12.60 కోట్లు ఖర్చు చేయాలి. వేలం పర్స్ రూ.120 కోట్లకు ఇది అదనం.
టీమ్ ఇండియా తుది జట్టులో లేకుంటే..
భారత ఆటగాడు ఎవరైనా ఐపీఎల్ సీజన్ కు ముందు అయిదేళ్లు దేశం తరఫున ఏ ఫార్మాట్ లోనూ ఆడకుంటే (తుది జట్టులో లేకుంటే) లేదా, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉండకపోతే అతడు అన్ క్యాప్డ్ అవుతాడు. ఉదాహరణకు అజింక్య రహానే రెండేళ్ల కిందట టెస్టు ఆడాడు. మరో మూడేళ్లు అతడు ఏ మ్యాచ్ కూడా ఆడకుంటే అన్ క్యాప్డ్ అవుతాడు. కాగా, ఈ నిబంధన ప్రకారం మహేంద్ర సింగ్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ అన్ క్యాప్డ్ ఆటగాడిగా సొంతం చేసుకోవచ్చు.
రెండేళ్లు నిషేధం..
వేలంలో కొనుక్కున్నాక కొందరు గాయాల పేరు చెప్పి సీజన్ కు దూరం అవుతున్నారు. ఇలా ఏ ఆటగాడైనా సీజన్ కు ముందు అందుబాటులో ఉండనని చెబితే అతడిని రెండేళ్లు లీగ్ నుంచి నిషేధిస్తారు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ విషయంలో గతంలో ఇలా జరిగింది.
మనోళ్ల కంటే తక్కువ ధరకే..
మినీ వేలంలోనే పాల్గొంటూ అధిక ధర దక్కించుకుంటున్న విదేశీ ఆటగాళ్ల కట్టడికి బీసీసీఐ నిర్ణయించింది. గత ఏడాది మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లకు అమ్ముడయ్యాడు. ఐదారేళ్ల తర్వాత వేలానికి వచ్చిన అతడు ఇంత భారీ ధర పలకడం చర్చనీయాంశమైంది. ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా బీసీసీఐ నిబంధనలను మార్చింది. రిటైన్ అయిన, మెగా వేలంలో అధిక ధరకు కొన్న ఆటగాళ్ల కంటే ఎక్కువ మొత్తం రాకుండా నిబంధనలు మార్చింది. దీని ప్రకారం విదేశీ ఆటగాళ్లు 2026, 2027 సీజన్ లలో పాల్గొనాలంటే 2025 మెగా వేలంలో రిజిస్టర్ అయి ఉండాలి. అయితే, గాయం, అనారోగ్యం వంటి వాటికి సొంత బోర్డు సర్టిఫై చేయాలి. కాగా వచ్చే ఏడాది జరిగే మినీ వేలంలో విదేశీ ఆటగాళ్లు పొందే మొత్తంపై కూడా నియంత్రణ ఉంది. వారి ఫీజును జట్టులో అత్యధిక మొత్తానికి రిటైన ఆటగాడు లేదా మెగా వేలంలో ఆటగాడి ఫీజులో ఏది తక్కువ ఉంటే దానిని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకొని.. ఇషాన్ కిషన్ కు మెగా వేలంలో రూ.15 కోట్లు పెట్టిందనుకుందాం. వచ్చే ఏడాది మినీ వేలం నుంచి విదేశీ ఆటగాడికి రూ.15 కోట్లకు మించి చెల్లించరు.
ఇషాన్ కు మెగా వేలంలోనే రూ.20 కోట్లకు పాడుకుంటే.. మినీ వేలంలో విదేశీ ఆటగాడికి రోహిత్ ఫీజు రూ.18 కోట్ల కంటే ఎక్కువ దక్కదు. ఫ్రాంఛైజీలు వేలంలో ఎంతకైనా బిడ్లు వేయవచ్చు. అదనపు మొత్తం ఆటగాళ్లకు కాకుండా బీసీసీఐ అకౌంట్ లో పడుతుంది.
18 నుంచి 11 కోట్లు
ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని కూడా అట్టిపెట్టుకుంటే వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏ ఫ్రాంఛైజీ అయినా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే రూ.45 కోట్లే మిగులుతాయి. ఆర్‌టీఎం సహా వేలంలో మరో 15 మందిని కొని జట్టును తయారు చేసుకోవడం కోసం ఆ సొమ్ము మాత్రమే ఉంటుంది.