వాళ్లు మళ్లీ తల్లిదండ్రులు కావడం లేదు.. స్టార్ క్రికెటర్ యూటర్న్
విరాట్ కోహ్లి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహమాడిన సంగతి తెలిసిందే. వీరిని విరుష్క (విరాట్+అనుష్క) జోడీగా పిలుస్తుంటారు అభిమానులు.
By: Tupaki Desk | 9 Feb 2024 6:59 AM GMTసహచరుడి వ్యక్తిగత విషయంలో పెద్ద తప్పే చేశానని.. మిస్టర్ 360 బ్యాటర్ పశ్చాత్తాపం చెందుతున్నాడు.. సొంతంగా యూట్యూబ్ చానెళ్లు వచ్చాక మాజీ క్రికెటర్లకు వ్లాగ్ లు చేయడం ఓ వ్యాపకం అయిపోయింది.. ఒకప్పుడు తాము కలిసి ఆడిన ఆటగాళ్ల గురించి, ఇతర జట్లు/ప్లేయర్ల ప్రదర్శన గురించి విశ్లేషించడం వారికి అలవాటు అయింది. ఇలానే చేశాడు ఆ మిస్టర్ 360. అతడు ఆ స్టార్ క్రికెటర్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో అతడు చెప్పింది నిజమేనని నమ్మారు చాలామంది. అయితే, ఇప్పుడు అతడు నాలుక కర్చుకుంటున్నాడు.
అసలే ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్.. అదీ సొంతగడ్డపై.. అందులోనూ ఐదు మ్యాచ్ లు.. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లి జట్టుకు దూరంగా ఉంటాడని ఎవరైనా భావించారా..? కానీ, విరాట్ హైదరాబాద్ లో తొలి టెస్టుకు వచ్చి మళ్లీ అదే రోజు వెళ్లిపోయాడు. దీనికి వ్యక్తిగత కారణాలను చూపాడు. తొలు రెండు టెస్టులకు మాత్రమే అనుకుంటే అతడు మూడు, నాలుగో టెస్టుకూ దూరమయ్యాడు. ఐదో టెస్టుకూ అందుబాటులో ఉండడం కష్టమే. అసలు ఏమిటి కారణం అనేదానిపై కోహ్లి, జట్టు మేనేజ్‌మెంట్ స్పందించలేదు. దీనికితోడు కెప్టెన్ రోహిత్ శర్మతో గతంలో ఉన్న విబేధాలు ఏమైనా ప్రభావం చూపాయా? అన్న అనుమానాలూ తలెత్తాయి.
అమ్మానాన్న కాబోతున్నారంటూ..
విరాట్ కోహ్లి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహమాడిన సంగతి తెలిసిందే. వీరిని విరుష్క (విరాట్+అనుష్క) జోడీగా పిలుస్తుంటారు అభిమానులు. తాజాగా కోహ్లి ఇంగ్లండ్ సిరీస్ కు దూరంగా ఉండడంతో ఈ జోడీ తమ రెండో బిడ్డను స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నారని దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్, ఆర్‌సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ చానెల్ లో వ్యాఖ్యానించాడు. కుటుంబం కోసమే కోహ్లి ఇంగ్లండ్ సిరీస్ కు దూరమైనట్లు పేర్కొన్నాడు. అయితే, ఏబీడీ యూటర్న్ తీసుకుని.. తన యూట్యూబ్ ఛానల్ లో చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడంతో అభిమానుల్లో అయోమయం మొదలైంది. కాగా, 5 రోజుల క్రితం లైవ్‌లో ఏబీ అభిమానులతో మాట్లాడుతుండగా.. కోహ్లీ ప్రస్తావన వచ్చింది. అతడు బాగున్నాడా? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. ‘‘ఇటీవల విరాట్ తో చాటింగ్ చేశా. క్షేమంగా ఉన్నానని చెప్పాడు. కుటుంబంతో గడుపుతున్నాడు. అందుకే రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నా. కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఈ సమయంలో కుటుంబంతో ఉండటం ముఖ్యం’’ అని ఏబీడీ తెలిపాడు. అదే ఏబీడీ తాజా వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నాయి. దీంతో కోహ్లీ జట్టుకు దూరంగా ఉండటానికి కారణాలేంటో తెలియడం లేదు. అతడి తల్లి ఆరోగ్యం సరిగా లేదనే వార్తలూ వచ్చాయి. కానీ, వాటిని కోహ్లీ అన్నయ్య తోసిపుచ్చాడు.
నాలుక్కర్చుకున్నాడు..
‘‘కొన్నిసార్లు కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే గత వీడియోలో పెద్ద పొరపాటు చేశా. నాకు అందిన సమాచారమంతా తప్పే. అందులో ఎలాంటి నిజం లేదు. దీనిపై విరాట్ కుటుంబమే స్పష్టత ఇస్తుందని భావిస్తున్నా. అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అతడు త్వరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నా. విరామం తీసుకోవడానికి కారణమేదైనా సరే.. మరింత దృఢంగా తిరిగి రావాలి’’ అని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. కాగా, కోహ్లి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆటగాడు, కెప్టెన్ గా ఉన్నప్పటి నుంచి డివిలియర్స్ తో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఏబీ చెప్పినవి నిజం అని అభిమానులు నమ్మారు. విరాట్ రెండోసారి తండ్రి కాబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.