అభిషేక్ వీర బాదుడు..నితీశ్ ఊర మాస్ కామెంట్..ఇన్ స్టా స్టోరీ వైరల్
17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్.. తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డుకు (12 బంతుల్లో) దగ్గరగా వచ్చాడు. అయితే, భారత్ తరఫున ఇదే రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.
By: Tupaki Desk | 3 Feb 2025 8:12 AM GMTఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సగటు పెద్దగా ఏమీ లేదు.. ఐపీఎల్ ప్రదర్శనతోనే టీమ్ ఇండియాలోకి.. ఆపై దూకుడైన ఆటతో దుమ్మురేపుతున్నాడు.. భారత క్రికెట్ లో సంచలనంగా మారాడు.. అతడే యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. ముఖ్యంగా ఐదో టి20లో ఆదివారం ముంబైలో ఇంగ్లండ్ పై అభిషేక్ చెలరేగిన తీరు మరో రోహిత్ శర్మను చూసిన ఫీలింగ్ కలిగించింది. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. వాస్తవానికి అభిషేక్ దూకుడు చూస్తే అత్యంత వేగవంతమైన టి20 సెంచరీ (35 బంతుల్లో) రికార్డును బద్దలుకొడతాడు అనిపించింది. కానీ, ఇంగ్లండ్ స్పిన్నర్ రషీద్ బౌలింగ్ లో నెమ్మదించాడు. అయినప్పటికీ 37 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్.. తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డుకు (12 బంతుల్లో) దగ్గరగా వచ్చాడు. అయితే, భారత్ తరఫున ఇదే రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.
ఈ క్రమంలో టి20లో అత్యధిక సిక్సులు (13) కొట్టిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. 10 సిక్సులతో రోహిత్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. బౌలింగ్ లోనూ రెండు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. అభిషేక్ కు తనలాగే ఎడమచేతి బ్యాటింగ్, బౌలింగ్ చేసే టీమ్ ఇండియా మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మెంటార్. యువీని స్ఫూర్తిగా తీసుకునే అభిషేక్ క్రికెట్లోకి వచ్చాడు. కాగా, మరో ఎడమచేతి బ్యాటర్ అయిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూ అభిషేక్ పై ప్రత్యేక శ్రద్ధ ఉంది. వీరిద్దరి ఆకాంక్షను నెరవేర్చినందుకు తాను ప్రయత్నించినట్లు మ్యాచ్ అనంతరం అతడు తెలిపాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్ గా అభిషేక్ శర్మ (135: 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్‌లు) నిలిచాడు. శుబ్ మన్ గిల్ 125 పరుగుల రికార్డును అధిగమించాడు. దీంతో ఇప్పుడు దేశాన్నే అభి‘షేక్’ చేస్తున్నాడు.
కాగా, టి20ల్లో అభిషేక్ కు టీమ్ ఇండియా సహచరుడైన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అతడి తాజా ప్రదర్శనపై వెరైటీగా ప్రశంసించాడు. అభిషేక్ శర్మపై ఇన్ స్టా గ్రామ్ లో ఊర మాస్ కామెంట్ పెట్టాడు. “మెంటల్ నా కొడుకు” అంటూ పోస్టు చేశాడు.
సలార్’ మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ కత్తితో ఉన్న ఫొటోతో పాటు కింద అభిషేక్ ఫొటోను జత చేశాడు. అంతే.. క్షణాల్లోనే ఇన్ స్టా స్టోరీ వైరల్ అయింది. కొందరు నెటిజన్స్ ఏంటీ బ్రో అంత మాటన్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అభిషేక్ నిజంగానే మెంటలోడు అంటూ ఆదివారం నాటి అతడి ఊచకోత ఇన్నింగ్స్ ను తలచుకుంటున్నారు.