సన్ రైజర్స్ కుర్రాడు అభి‘‘షేక్ చేసేశాడు’’.. ఒక్క సెంచరీతో అనేక రికార్డులు
రెండో టి20లో అభిషేక్ 46 బంతుల్లోనే సెంచరీ చేసేశాడు. ఇది అతడికి రెండో అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే.
By: Tupaki Desk | 8 July 2024 7:22 AM GMTఆడుతున్న రెండో అంతర్జాతీయ టి20 మ్యాచ్ లోనే సెంచరీతో.. అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో సెంచరీ కొట్టిన భారతీయుడు.. వరుసగా మూడు సిక్స్ లతో సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు.. ఒకే టి20లో స్పిన్నర్ల బౌలింగ్ లో అత్యధిక పరుగులు బాదిన భారతీయుడు.. ఇవన్నీ సన్ రైజర్స్ కుర్రాడు అభిషేక్ శర్మ సాధించిన రికార్డులు. తొలి మ్యాచ్ లో శనివారం డకౌట్ అయి నిరాశపరిచినప్పటికీ రెండో మ్యాచ్ లో జింబాబ్వేను అభి‘‘షేక్ చేసేశాడు’’. ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున చెలరేగిన అభిషేక్.. అందరూ ఊహించినట్లే జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ లో షాట్ కు ప్రయత్నించి డకౌట్ అయిన అతడు ఆదివారం మాత్రం విరుచుకుపడ్డాడు. తొలుత నెమ్మదిగా ఆడినప్పటికీ.. తర్వాత సిక్సర్లతో దుమ్మురేపాడు.
46 బంతుల్లోనే సెంచరీ..
రెండో టి20లో అభిషేక్ 46 బంతుల్లోనే సెంచరీ చేసేశాడు. ఇది అతడికి రెండో అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే. అంతేకాదు.. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్న భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. మరోవైపు మ్యాచ్ లో అభిషేక్ సరిగ్గా 100 పరుగులు కొట్టాడు. ఇందులో స్పిన్నర్ల నుంచి పిండుకున్నవే 65. ఇది ఓ రికార్డు. 2012లో మేటి ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పాకిస్థాన్ స్పిన్నర్లపై అహ్మదాబాద్ లో 57 పరుగులు చేశాడు. దీనిని అభిషేక్ బద్దలు కొట్టాడు. ఇక జింబాబ్వే స్పిన్నర్ వెల్లింగ్టన్ మసకద్జ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లతో అభిషేక్ సెంచరీని అందుకున్నాడు. ఇలా వరుసగా మూడు సిక్సులతో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ ఇతడే. అంతేకాదు.. యువరాజ్ సింగ్ తరహాలోనే ఎడమచేతి వాటం బ్యాటర్, బౌలర్ అయిన అభిషేక్ .. అదే యువరాజ్ సింగ్ ను విపరీతంగా ఆరాధిస్తాడు.
బ్యాట్ అతడిది కాదు..
ఇన్ని రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ వాడిన బ్యాట్ మాత్రం అతడి కాదు. ఈ మ్యాచ్ లో అతడు వాడింది కెప్టెన్ శుభ్ మన్ గిల్ బ్యాట్. పంజాబ్ కే చెందిన ఈ ఇద్దరూ అండర్-12 నుంచి కలిసి ఆడుతున్నారు. ఆదివారం నాటి మ్యాచ్ లో గిల్ బ్యాట్‌తోనే అభిషేక్ ఆడాడు. తాను భారత జట్టుకు ఎంపికైనప్పుడు ఫస్ట్ కాల్ గిల్ నుంచి వచ్చిందని అభిషేక్ చెప్పాడు. ఒత్తిడి ఉన్న మ్యాచ్ లలో గిల్ ను బ్యాట్ అడిగి తీసుకుంటానని అభిషేక్ చెప్పాడు. తొలి మ్యాచ్ లో డకౌట్ కావడంతో.. ఆదివారం గిల్ బ్యాట్ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కాగా, ఐపీఎల్ లో కూడా గిల్ బ్యాట్ తోనే అభిషేక్ ఆడాడు.