టాప్-3 వికెట్ కీపర్లు వీరే.. అందులో ధోనీ ఉన్నాడా? మరి మిగతా ఇద్దరు?
క్రికెట్ లో అత్యంత కీలకమైనది వికెట్ కీపింగ్. ఆ మాటకొస్తే ప్రతి విభాగమూ కీలకమే.
By: Tupaki Desk | 21 Aug 2024 2:30 PM GMTక్రికెట్ లో అత్యంత కీలకమైనది వికెట్ కీపింగ్. ఆ మాటకొస్తే ప్రతి విభాగమూ కీలకమే. కానీ, కీపింగ్ ఇంకా ఎక్కువ అనుకోవాలి. వికెట్ల వెనుక చురుకైన కీపర్ గా ఉంటే ఒకప్పుడు చాలనుకునేవారు. ఇప్పుడు గ్లోవ్స్ తో వికెట్ల వెనుకనే కాదు.. బ్యాట్ తో వికెట్ల ముందు కూడా దంచికొట్టేవాడే అసలైన కీపర్ అనే అభిప్రాయం నెలకొంది. ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్, భారత వికెట్ కీపర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వెస్టిండీస్ కు చెందిన పూరన్, దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్.. ఇలా ప్రతి జట్టులోనూ వికెట్ కీపర్ కీలక బ్యాటర్ గానూ ఉంటున్నాడు. అయితే, వీరికి ముందు ఆడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా), మహేంద్ర సింగ్ ధోనీ (భారత్) వంటి వారు వికెట్ కీపర్ బ్యాటర్లుగా చెరగని ముద్ర వేశారు. ఆధునిక క్రికెట్ పై వీరిది బలమైన ప్రభావం. 2004 ముందువరకు భారత్ కు గిల్ క్రిస్ట్ లాంటి వికెట్ కీపర్ బ్యాటర్ దొరుకుతాడా? అనే ఆశ ఉండేది. ఆ ఆశను పూర్తిగా తీర్చాడు ధోనీ. భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. కీపింగ్ లో అతడి నైపుణ్యం అద్భుతం అయితే.. బ్యాటింగ్ లో దూకుడు మరో రేంజ్. ఇక గిల్లీగా పిలుచుకునే గిల్ క్రిస్ట్ ఎడమచేతివాటం వికెట్ కీపర్ బ్యాటర్. తాజాగా గిల్లీ ‘టాప్-3’ కీపర్లను ఎంపిక చేశాడు.
నంబర్ 1 అతడే..
గిల్లీ జాబితాలో మొదటి స్థానం ఆస్ట్రేలియాకే చెందిన దివంగత వికెట్ కీపర్ రాడ్నీ మార్ష్ కు దక్కింది. ఇతడు గిల్లీకి ఆదర్శం కూడా. 1947లో పుట్టిన రాడ్నీ.. 2022 మార్చిలో చనిపోయాడు. ఆస్ట్రేలియాకు 96 టెస్టులు (3233 పరుగులు, 92 వన్డేలు (1,225 పరుగులు) ఆడాడు. 1970 నుంచి 1984 వరకు వికెట్ల వెనుక ఆస్ట్రేలియాకు పెట్టని గోడ. కాగా, గిల్లీ జాబితాలో ఉన్న మరో వికెప్ కీపర్ శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర. వికెట్ కీపర్ గా జట్టులోకి వచ్చి సంగా.. వన్డేలు, టెస్టుల్లో 10 వేల పరుగులపైగా సాధించాడు. పూర్తిస్థాయి బ్యాటర్ గా రిటైరయ్యాడు.
మరి ధోనీకి చోటిచ్చాడా?
గిల్ క్రిస్ట్ జాబితాలో ధోనీకి చోటుంటుందా? అంటే.. దానికి సమాధానం ఉంది. ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్ గా మాత్రమే కాదు.. ఫినిషర్ కూడా అయిన ధోనీని ఎంపిక చేయకుంటే అది అసంపూర్తి జాబితానే అవుతుంది. కాగా.. కెప్టెన్ గా కూడా ధోనీ సాధించిన రికార్డులు సాధారణమైనవి కాదు. అందుకే గిల్ క్రిస్ట్ భారత మాజీ కెప్టెన్ కు రెండో స్థానం ఇచ్చాడు. మొత్తమ్మీద తాను ఆదర్శంగా తీసుకున్న రాడ్నీ మార్ష్ కు నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చాడు. సంగక్కరకు మూడో స్థానం కేటాయించాడు. మరోవైపు నవంబరు నుంచి జరిగి ఆస్ట్రేలియా-భారత్ ఐదు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియాదే విజయం అని గిల్ క్రిస్ట్ చెబుతున్నాడు. 2018, 2020 సీజన్లలో భారత్ ఆస్ట్రేలియాను వారి దేశంలో ఓడించి హ్యాట్రిక్ కోసం చూస్తోంది.