భారత్ లో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్.. భారత్ తో కాదు మరే జట్టుతో?
అఫ్ఘానిస్థాన్.. నిత్యం అశాంతితో రగిలే దేశం. అలాంటిచోట క్రికెట్ కు అవకాశం ఉంటుందని భావించలేం.
By: Tupaki Desk | 9 Sep 2024 9:30 AM GMTభారత్ లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. కేన్ విలియమ్సన్ ఉన్నాడు.. భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర వచ్చాడు.. టెస్టుల్లో పదికి పది వికెట్లు తీసిన ఎజాజ్ పటేల్ కూడా ఉన్నాడు.. కానీ, టెస్టు మ్యాచ్ మాత్రం భారత్ కాదు.. వినడానికి ఇది కాస్తంత ఆశ్చర్యకరమే. న్యూజిలాండ్ వంటి పెద్ద జట్టు.. అది కూడా భారత్ వంటి దేశానికి పర్యటనకు రావడం పెద్ద వార్తే. కానీ, భారత్ తో టెస్టు ఆడకపోవడమే విచిత్రం.
వారికిది రెండో సొంతగడ్డ
అఫ్ఘానిస్థాన్.. నిత్యం అశాంతితో రగిలే దేశం. అలాంటిచోట క్రికెట్ కు అవకాశం ఉంటుందని భావించలేం. కానీ.. ఆ దేశంలో క్రికెట్ పుట్టడమే కాదు.. వారి జట్టు ప్రపంచ స్థాయికి ఎదిగింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించేంతటి పరిస్థితులు మాత్రం లేవు. అందుకే అఫ్థానిస్థాన్ మ్యాచ్ లకు భారత్ వేదిక అవుతుంటుంది. టి20ల్లో మంచి జట్టుగా ఎదిగిన అఫ్ఘాన్ వన్డేల్లోనూ తన ప్రదర్శన మెరుగుపరుచుకుంటోంది. ఆ దేశ క్రికెట్ కు ఉపయోగపడే ఉద్దేశంలోనే భారత్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తోంది. మరోవైపు అఫ్ఘానిస్థాన్ తమ దేశంలోని జలాలాబాద్ లో తొలి స్టేడియాన్ని నిర్మించింది. రాజధాని కాబూల్ తో పాటు కాందహార్, ఖోస్త్ లోనూ స్టేడియాల నిర్మాణానికి భారత్ సాయం చేసింది. అయితే, వీటిలో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహణ మాత్రం భద్రతా, ఇతర కారణాలు రీత్యా సాధ్యం కావడం లేదు.
గ్రేటర్ నోయిడా మైదానం వారిదే..
ఓవైపు స్టేడియాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో అఫ్ఘానిస్థాన్ కు సాయం చేస్తున భారత్.. ఆ దేశం ఆడే మ్యాచ్ లకు గ్రేటర్ నోయిడా గ్రౌండ్ ను కేటాయించింది. ఇదిగో ఇప్పుడు అక్కడే అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ఏకైక టెస్టు సోమవారం నుంచి జరుగుతోంది. గతలోంనూ ఇక్కడ అఫ్ఘాన్ టెస్టులు ఆడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా ఉపఖండంలో వరుసగా ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది న్యూజిలాండ్. అయితే, దాదాపు 15 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్న అఫ్గానిస్థాన్ తో న్యూజిలాండ్ కు మాత్రం ఇదే తొలి టెస్టు కావడం గమనార్హం.