Begin typing your search above and press return to search.

పాక్ పై ఆఫ్గాన్ పంజా... హ్యాట్రిక్ ఓటమి పరిచయం చేశారుగా!

అయితే... డిఫెండింగ్‌ ఛాంపియన్, ఈ ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ ను ఓడించి పెను సంచలనం సృష్టించింది అఫ్గానిస్థాన్‌.

By:  Tupaki Desk   |   24 Oct 2023 3:47 AM GMT
పాక్  పై ఆఫ్గాన్  పంజా... హ్యాట్రిక్  ఓటమి పరిచయం చేశారుగా!
X

రెండేళ్ల కిందట తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాక అఫ్గానిస్థాన్‌ పరిస్థితి దయనీయంగా మారిన సంగతి తెలిసిందే. అమెరికా సహా అన్ని దేశాల నుంచి అఫ్గాన్‌ కు ఆర్థిక సాయం ఆగిపోయింది. దీంతో ఆర్ధికంగానే కాకుండా అన్ని రకాలుగానూ ఆ దేశం చితికిపోయింది. అప్పటినుంచి అఫ్గాన్‌ క్రికెటర్లు ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. జాతీయ జట్టు తరఫున ఏదైనా సిరీస్, టోర్నీ ఆడాల్సినపుడు మాత్రమే ఒక చోటికి చేరుతున్నారు.

వారికి నెట్ ప్రాక్టీస్ ఏమైనా ఉందంటే అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో జరిగే టీ20, టీ20 లీగ్స్‌ ఆడటమే! ఇలాంటి ఆటగాళ్లలో, అలాంటి పరిస్థితుల్లో వారిమధ్య టీం స్పిరిట్ తీసుకురావడం చిన్న విషయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్ లో ఆడేందుకు భారత్ లో అడుగుపెట్టింది ఆఫ్గాన్ జట్టు. అయితే ఆఫ్గాన్ ఈ టోర్నీ లో కనీసం ఒకటి రెండు మ్యాచుల్లో అయినా గెలిచే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారి దృష్టిలో వారితో సమానమైనవిగా చెప్పుకునే చిన్న చిన్న దేశాలు కావొచ్చు!!

అయితే... డిఫెండింగ్‌ ఛాంపియన్, ఈ ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ ను ఓడించి పెను సంచలనం సృష్టించింది అఫ్గానిస్థాన్‌. అదే పోరాట పఠిమ కంటిన్యూ చేస్తూ తాజాగా మరో సంచలనం సృష్టించింది. అందులో భాగంగా పాకిస్థాన్ ను పసికూనను చేసి విరుచుకుపడింది. ఫలితంగా... అఫ్గాన్‌ వీరుల దెబ్బకు పాకిస్థాన్‌ కుదేలైంది. తమను తక్కువ అంచనా వేస్తే... సూర్యుడు ఉండగానే ఆకాశంలో చుక్కలు చూపిస్తామని చెప్పకనే చెప్పింది.

ఇకపై ఎవరైన ఆఫ్గనిస్తాన్ ను పసికూన అనడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కల్పించింది ఆ జట్టు. ఛేజింగ్ లో వారు చూపించిన ధైర్యం, తెగువతో కూడిన షాట్లు చూసినవారికి... ఆ మ్యాచ్ లో ఎవరు ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగారనే విషయంలో రివర్స్ అభిప్రాయాలు వచ్చేశాయి. 40 ఓవర్లు దాటాక కన్ ఫాం అయిపోయాయి! నెక్స్ట్ ఆడబోయే జట్లకు గట్టి సందేశాలే వెళ్లాయి!!

అవును... ప్రపంచకప్‌ లో అఫ్గాన్‌ మరో సంచలన విజయం సాధించింది. నిన్న ఇంగ్లాండ్‌ కు షాకిచ్చిన ఆ జట్టు.. ఇప్పుడు పాక్‌ పై పంజా విసిరింది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ పై ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ పిచ్ పై భారీస్కోర్ కిందే లెక్క!

పాకిస్థాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ (92 బంతుల్లో 74: 4 ఫోర్లు, 1 సిక్స్‌), అబ్దుల్లా షఫీక్‌ (75 బంతుల్లో 58: 4 ఫోర్లు, 2 సిస్కర్లు) రాణించగా... సాద్ షకీల్ (25), ఇమామ్ ఉల్ హక్ (17), మహ్మద్ రిజ్వాన్ (8) నిరాశపరిచారు! అయినప్పటికీ చివర్లో షాదాబ్‌ ఖాన్‌ (38 బంతుల్లో 40: 1 ఫోర్, 1 సిక్స్‌).. ఇఫ్తికార్ అహ్మద్‌ (27 బంతుల్లో 40: 2 ఫోర్లు, 4 సికర్లు) మెరుపులు మెరిపించారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్‌ కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ (53 బంతుల్లో 65: 9 ఫోర్లు, 1 సిక్స్‌), ఇబ్రహీం జాద్రాన్‌ (87 బంతుల్లో 74: 9 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించి మొదటి వికెట్‌ కు 130 పరుగులతో బలమైన పునాది వేశారు. అనంతరం వచ్చిన రహ్మత్‌ షా (84 బంతుల్లో 77*: 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హష్మాతుల్లా షాహిది (45 బంతుల్లో 48*: 4 ఫోర్లు) నిలకడగా ఆడి అఫ్గాన్‌ కు విజయాన్ని అందించారు.

ఇక అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్‌ 3, నవీనుల్ హక్ 2, అజ్మతుల్లా, మహ్మద్‌ నబీకి ఒక్కో వికెట్ దక్కింది. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో పాకిస్థాన్ కు హ్యాట్రిక్ దక్కింది! మరోపక్క ఆడిన ఐదు మ్యాచ్‌ ల్లో మూడు ఓటములతో ఉన్న సెమీస్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ ల్లో నెగ్గితేనే టాప్‌-4లోకి వచ్చే అవకాశం ఉంది.