భళా అఫ్ఘాన్.. ఆసీస్ కు డబుల్ షాక్.. టి20 ప్రపంచ కప్ సెమీస్ కు!
ఆసీస్ కు డబుల్ దెబ్బ ఈ ప్రపంచ కప్ నకు ముందు భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఈసారి సెమీస్ కు కూడా చేరలేకపోయింది.
By: Tupaki Desk | 25 Jun 2024 6:53 AM GMTఅఫ్ఘానిస్థాన్ అద్భుతం చేసింది.. టి20 ప్రపంచ కప్ సెమీస్ చేరింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్థాన్ వంటి మాజీ చాంపియన్లకు సాధ్యం కానిదానిని చేసి చూపింది. న్యూజిలాండ్ లాంటి గట్టి జట్టు విఫలమైన చోట తన సత్తా చాటింది. అత్యంత ఉత్కంఠభరితంగా, వర్షం దోబూచులాటల మధ్య సాగిన సూపర్-8 చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను అఫ్ఘాన్ 8 పరుగుల తేడాతో ఓడించింది.
ఆసీస్ కు డబుల్ దెబ్బ ఈ ప్రపంచ కప్ నకు ముందు భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఈసారి సెమీస్ కు కూడా చేరలేకపోయింది. దీనికి కారణం.. కేవలం అఫ్ఘానిస్థాన్ అంటే ఆశ్చర్యం లేదు. సూపర్ -8లో కంగారూలను అఫ్ఘాన్ మట్టికరిపించింది. దీంతో వారి సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇక భారత్ చేతిలో ఓటమితో కంగారూలు నాకౌట్ కు చేరలేకపోయారు.
దూకుడైన ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉండడంతో టి20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా ఫేవరెట్ గా బరిలో దిగింది. అయితే, సూపర్-8లో అఫ్ఘాన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోయింది. మరోవైపు మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించిన అఫ్ఘాన్ నేరుగా సెమీస్ కు వెళ్లారు. సూపర్ 8లో మూడు మ్యాచ్ లకు గాను ఒకదాంట్లోనే నెగ్గిన ఆస్ట్రేలియా ఇంటి ముఖం పట్టింది. ఇక గురువారం ఉదయం 6 గంటలకు దక్షిణాఫ్రికాతో తొలి సెమీస్ లో అఫ్గానిస్థాన్ తలపడనుంది. గురువారం రాత్రి 8 గంటలకు భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీస్ జరగనుంది.
స్వల్ప స్కోరును కాపాడుకుని..
సూపర్-8 చివరి మ్యాచ్ లో బంగ్లాను ఓడిస్తే అఫ్ఘాన్ నేరుగా సెమీస్ చేరే వీలుంది. ఓడిపోతే మాత్రం రన్ రేట్ మెరుగ్గా ఉన్న ఆస్ట్రేలియా సెమీస్ చేరుతుంది. ఈ నేపథ్యంలో.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 115/5 స్కోరు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (43) టాప్ స్కోరర్. ఇబ్రహీం జద్రాన్ (18), కెప్టెన్ రషీద్ ఖాన్ (19*) ఫర్వాలేదనిపించారు. అయితే, టార్గెట్ ఛేజింగ్ కు దిగిన బంగ్లా 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. అయితే, పలుసార్లు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించారు. బంగ్లా లక్ష్యాన్ని 114 పరుగులుగా నిర్ణయించారు. దీనికి 8 పరుగుల ముందే ఆ జట్టు ఆలౌటైంది. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ (54 నాటౌట్) ఒంటరి పోరాటం ఫలితం ఇవ్వలేదు.
అప్పుడు న్యూజిలాండ్ ను..
టి20 ప్రపంచ కప్ లో అఫ్ఘానిస్థాన్.. లీగ్ దశలో న్యూజిలాండ్ ను, సూపర్ -8లో ఆస్ట్రేలియాను ఓడించింది. చివరిగా బంగ్లానూ మట్టి కరిపించి సెమీస్ చేరింది. తద్వారా ఆస్ట్రేలియాకు వరుసగా రెండోసారి షాకిచ్చింది. అంతేకాదు.. తొలిసారి టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరిన రికార్డును అందుకుంది.