Begin typing your search above and press return to search.

ఆసీస్ కు అఫ్ఘాన్ షాక్.. వరల్డ్ కప్ 'సెమీస్ రేసు'వత్తరం

దీంతో 127 పరుగులకే ఆలౌటైంది. అఫ్ఘాన్ పేసర్ గుల్బదిన్ నయిబ్ (4/20) గట్టి దెబ్బకొట్టాడు. మరో పేసర్ నవీనుల్ హక్ (3/20), స్పిన్నర్లు నబీ (1/1), రషీద్ ఖాన్ (1/23) కట్టడి చేశారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 8:34 AM GMT
ఆసీస్ కు అఫ్ఘాన్ షాక్.. వరల్డ్ కప్ సెమీస్ రేసువత్తరం
X

న్యూజిలాండ్ ను లీగ్ దశలో దెబ్బకొడితే ఏమో అనుకున్నారు.. సూపర్ 8లో భారత్ చేతిలో ఓడిపోయాక ఇక కష్టమే అనుకున్నారు.. సెమీస్ కు చేరడం సాధ్యం కాదనీ అనుకున్నారు.. అయితే, ఆ జట్టు సంచలనమే చేసింది. వన్డే ప్రపంచ కప్ లో తమ నుంచి త్రుటిలో విజయాన్ని లాగేసుకున్న జట్టును టి20 ప్రపంచ కప్ లో ఓడించి గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. దీంతోపాటే సెమీఫైనల్ రేసును రసవత్తరంగా మార్చింది.

'సూపర్-8' సూపర్

టి20 ప్రపంచ కప్ లో గ్రూప్-1లో ఉన్నాయి భారత్, ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్. వీటిలో అఫ్ఘాన్ గురువారం జరిగిన మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయింది. అయితే, ఆ పరాజయం నుంచి వెంటనే తేరుకుని ఆదివారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చింది. వన్డే ప్రపంచ చాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గనుక గెలిచి ఉంటే సెమీస్ కు చేరడం ఖాయమయ్యేది. అయితే, అఫ్ఘాన్ ఆ ఆశలు లేకుండా చేసింది.

ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాను అఫ్ఘాన్ 21 పరుగుల తేడాతో ఓడించింది. అంతర్జాతీయ క్రికెట్‌ లో ఆసీస్‌ పై అఫ్గాన్‌ కిదే తొలి విజయం. ఈ రెండు జట్లు ఇప్పటిదాక ఆరుసార్లు తలపడగా.. ఐదుసార్లు కంగారూలే గెలిచారు. ఇక తాజా మ్యాచ్‌ లో అఫ్గాన్ ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్‌ (51) అర్ధ సెంచరీలు సాధించినా మిగతా వారు విఫలమయ్యారు. ఆసీస్ పేసర్ కమిన్స్‌ (3/28) వరుసగా రెండో హ్యాట్రిక్‌ నమోదు చేయడం విశేషం.

149 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ బౌలర్ల ధాటికి కంగారూలు బెంబేలెత్తారు. వన్డే ప్రపంచ కప్ లో అజేయ డబుల్ సెంచరీ చేసిన ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌ వెల్ (59) మాత్రమే రాణించాడు. దీంతో 127 పరుగులకే ఆలౌటైంది. అఫ్ఘాన్ పేసర్ గుల్బదిన్ నయిబ్ (4/20) గట్టి దెబ్బకొట్టాడు. మరో పేసర్ నవీనుల్ హక్ (3/20), స్పిన్నర్లు నబీ (1/1), రషీద్ ఖాన్ (1/23) కట్టడి చేశారు.

సెమీస్ కు ఎవరో?

గ్రూప్ -1లో ఆస్ట్రేలియా తర్వాతి మ్యాచ్ లో గట్టి జట్టయిన భారత్ తో ఆడాల్సి ఉంది. టీమిండియా ఇప్పటికే రెండు విజయాలతో సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియా-భారత్ మ్యాచ్ సోమవారం జరగనుంది. ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ పై గెలిచింది. ఆస్ట్రేలియాను అఫ్గాన్‌ ఓడించింది. అఫ్ఘానిస్థాన్.. బంగ్లాదేశ్ పై గెలిచి, భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడితే... అప్పుడు భారత్, అఫ్గాన్ సెమీస్ కు వెళ్తాయి.