Begin typing your search above and press return to search.

9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కు.. రూ.24.75 కోట్ల రికార్డు ధర.. ఎవరికంటే..?

కానీ, ఇదేమీ కాకుండా.. ఇద్దరు పేసర్లు.. అదీ ఒకే దేశానికి చెందినవారికి రూ.20 కోట్ల పైన ధర పెట్టడం విశేషమే.

By:  Tupaki Desk   |   19 Dec 2023 11:52 AM GMT
9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కు.. రూ.24.75 కోట్ల రికార్డు ధర.. ఎవరికంటే..?
X

పేరుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం అనే మాటనే కానీ.. ఆటగాళ్లపై నోట్ల కట్టల వర్షం కురుస్తోంది. ఒకరిని మించి ఒకరికి ధర పలుకుతోంది. రూ.20 కోట్లు దాటడం తొలిసారి అనుకుంటే.. దాదాపు రూ.25 కోట్లకు రేటు పలికింది. అది కూడా ఓ పేసర్ కు కావడం విశేషం. టి20 క్రికెట్ అంటే ఆల్ రౌండర్లకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. లేదంటే హార్డ్ హిట్టింగ్ బ్యాటర్లకు మంచి ధర దక్కుతుంది. కానీ, ఇదేమీ కాకుండా.. ఇద్దరు పేసర్లు.. అదీ ఒకే దేశానికి చెందినవారికి రూ.20 కోట్ల పైన ధర పెట్టడం విశేషమే.

దుబాయ్ లో దుమ్మురేపేలా వేలం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ మినీ వేలం దుబాయ్‌ వేదికగా జరుగుతోంది. దేశ, విదేశీ ఆటగాళ్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌లు కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. కాగా, ముందుగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కు రూ.20.50 కోట్ల ధర దక్కింది. ఈ మొత్తానికి అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ లెక్కన వేలంలో రూ.20 కోట్ల మార్క్ దాటిన తొలి ఆటగాడిగా కమ్మిన్స్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఇదే గొప్ప అనుకుంటే.. దీనికిమించిన ధర ఆస్ట్రేలియాకే చెందిన మరో పేసర్ మిచెల్ స్టార్క్ కు దక్కింది.

అమ్మో అంతనా...?

ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ అయిన మిచెల్ స్టార్క్‌ కు ఐపీఎల్ లో ఆల్‌ టైమ్‌ రికార్డు ధర దక్కింది. అసలు అతడి ప్రాథమిక ధర రూ.2 కోట్లే. కానీ.. దానికి 25 రెట్లు ధర దక్కింది. స్టార్క్‌ కోసం అంతగా పోటీపడ్డాయి ఫ్రాంచైజీలు. గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ మాకంటే మాకంటూ వెంటపడ్డాయి. చివరికి కోల్ కతా రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో కమిన్స్‌ రూ. 20.5 కోట్ల రికార్డును స్టార్క్‌ అధిగమించాడు.

ఇది తగినదేనా?

స్టార్క్ 2015లో చివరిసారిగా ఐపీఎల్ ఆడాడు. 2014లో అతడు లీగ్ లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఏడాది బెంగళూరుకు ఆడాడు. మళ్లీ లీగ్ లో అడుగుపెట్టలేదు. టెస్టు క్రికెట్, జాతీయ జట్టుకే ప్రాధాన్యం అంటూ కొన్నాళ్లు, మరికొన్నాళ్లు గాయాలతో దూరంగా ఉన్నాడు. అలాంటివాడికి 9 ఏళ్ల తర్వాత 25 కోట్లు పెట్టడం తగినదేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. 2015లో 13 మ్యాచ్ లు ఆడిన స్టార్క్ 20 వికెట్లు పడగొట్టాడు. ఇక కమ్మిన్స్ విషయానికి వస్తే 2022 లో అతడిని కోల్ కతా నైట్ రైడర్స్ వేలంలో తీసుకుంది. 2023లో మాత్రం అతడు స్వచ్ఛందంగా తప్పుకొన్నాడు. మళ్లీ ఇప్పుడు వేలంలోకి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.20కోట్లు వెచ్చించింది.

ఇద్దరూ.. గాయాల బాధితులు

సహజంగానే పేస్ బౌలర్లు గాయాల బాధితులు. దీనికి స్టార్క్, కమ్మిన్స్ అతీతులేమీ కాదు. స్టార్క్ కు మరీ గాయాలు ఎక్కువ. అయినా అతడిపై రికార్డు ధర పెట్టడం గమనార్హం. కమ్మిన్స్ కూడా గాయాలను ఎదుర్కొన్నప్పటికీ.. ప్రస్తుతం ఫిట్ నెస్ తో ఉన్నాడు. కానీ, పేసర్ కాబట్టి మున్ముందు గాయానికి గురికాడని చెప్పలేం. మరి.. వీరిపై అంతంత డబ్బులు పెట్టిన ఫ్రాంచైజీలు ఏం చేస్తాయో?