రంజీల్లో సెంచరీల 'అగ్ని' వర్షం.. 12th ఫెయిల్ డైరక్టర్ కొడుకతడు!
అగ్ని చోప్రా వయసు 25. ఈ ఏడాదే రంజీల్లోకి అడుగుపెట్టాడు. కానీ, ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్ మన్ లా బౌలర్లను ఉతికి అరేస్తున్నాడు.
By: Tupaki Desk | 1 Feb 2024 8:12 AM GMTతొలి రంజీ సీజన్ లో ఒక సెంచరీ చేస్తేనే అద్భుతం.. అందులోనూ తొలి మ్యాచ్ లో సెంచరీ చేస్తే మహాద్భుతం.. రెండు వరుస సెంచరీలు కొడితే గొప్పనే.. కానీ, ఆ కుర్రాడు సెంచరీల మీద సెంచరీలు కొడుతూ పోతున్నాడు.. ప్రపంచ రికార్డు బద్దలు కొడుతున్నాడు. అతడి జోరు చూస్తుంటే టీమిండియాలోకి వచ్చేస్తాడా? అని అంచనాలు పెరుగుతున్నాయి. విశేషం ఏమంటే.. ఆయన తండ్రి సినిమా అవార్డులు కొల్లగొడుతుంటే.. కొడుకేమో బౌలర్లను చితక్కొడుతున్నాడు.
ముంబైకి కాకుండా
ఆడింది నాలుగు మ్యాచ్ లు.. అందులో ఐదు సెంచరీలు, ఒకదాంట్లో సెంచరీ మిస్... ఇంతకూ అతడేమీ దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ కాదు.. ఈ ఏడాదే అరంగేట్రం చేసిన కుర్రాడు.. ఇదంతా అగ్ని చోప్రా గురించి. ఇతడి తండ్రి బాలీవుడ్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా కావడం గమనార్హం. వాస్తవానికి అగ్ని.. పుట్టి పెరిగింది ముంబై కాబట్టి.. అతడి ముంబై రంజీ జట్టుకు ఆడాలి. అయితే, ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ముంబైకి ఎంపికవడం కష్టం. ఆ పోటీని తట్టుకుని నిలిచేసరికి సమయం అయిపోతుంది. దీంతో అగ్ని.. మిజోరం జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పశ్చిమాన ఉన్న ముంబై నుంచి ఈశాన్య రాష్ట్రమైన మిజోరం జట్టుకు ఆడడం అంటే విచిత్రమే కదా..?
అడుగుపెట్టడంతోనే సెంచరీ మోత
అగ్ని చోప్రా వయసు 25. ఈ ఏడాదే రంజీల్లోకి అడుగుపెట్టాడు. కానీ, ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్ మన్ లా బౌలర్లను ఉతికి అరేస్తున్నాడు. వరుసగా ఐదు సెంచరీలు కొట్టాడతడు. ఈ సీజన్ లో అగ్ని స్థాయిలో ఎవరూ సెంచరీలు చేయలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే. మేఘాలయాతో మంగళవారం ముగిసిన మ్యాచ్ లో అగ్ని రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలతో మెరిశాడు. సిక్కింతో తొలి మ్యాచ్ ఆడిన అతడు అప్పుడే ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 166, రెండో ఇన్నింగ్స్ లో 92 పరుగులు చేశాడు. ఇక రెండో మ్యాచ్ లో నాగాలాండ్ పై 164, 15 రన్స్ కొట్టాడు. మూడో మ్యాచ్ లో అరుణాచల్ ప్రదేశ్ పై 114, 10 పరుగులు సాధించాడు. మేఘాలయాతో 105, 101 పరుగులతో మెరిశాడు.
ప్రపంచ రికార్డు సొంతం
సచిన్ టెండూల్కర్, ప్రథ్వీషా వంటి వారు దేశవాళీ క్రికెట్ తొలి మ్యాచ్ లోనే సెంచరీలు కొట్టి ఉండవచ్చు. కానీ, అగ్ని చోప్రా తరహాలో మాత్రం వరుసగా ఎవరూ ఐదు సెంచరీలు కొట్టలేదు. దీంతో అతడు ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రంజీల్లో చోప్రా పేరు మార్మోగుతోంది. ఇదే జోరు సీజన్ ఆసాంతం కొనసాగిస్తే అగ్ని చోప్రా రాబోయే రెండు మూడేండ్లలో భారత జట్టులో పోటీ పడే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, 4 మ్యాచ్‌లలోనే చోప్రా.. 767 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.
తండ్రి అవార్డులు.. కొడుకు రివార్డులు..
అగ్ని చోప్రా.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమారుడు. విధు దర్శకత్వం వహించిన 12th ఫెయిల్ మూవీతో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిల్మ్‌ఫెయిర్ అవార్డు ల్లో ఉత్తమ చిత్రంతో పాటు నాలుగు అవార్డులను గెలుచుకుంది. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. కాగా, ఇప్పుడు పుత్రోత్సాహంతో ఆయన సంతోషం డబుల్ అయింది. అయితే, అగ్ని ఆడుతున్నది మిజోరం తరఫున. ఈ జట్టు ప్లేట్ గ్రూప్ లో ఉంది. అంటే.. తక్కువ స్థాయి జట్టు అన్నమాట. ఈ గ్రూప్ నకు ద్వితీయ శ్రేణిగా పేరుంది. ఇక రంజీల్లో మరో గ్రూప్ ఎలైట్. ఇందులో నాలుగు ఎలైట్ గ్రూప్ లుంటాయి. వీటిలో ముంబై, సౌరాష్ట్ర, ఢిల్లీ వంటి పెద్ద జట్లు పోటీ పడతాయి. వీటిపై రాణిస్తేనే అగ్ని చోప్రా ఇన్నింగ్స్ లకు విలువ. ప్లేట్ గ్రూప్ జట్లపై ఎంత ఆడినా జాతీయ జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోవడం కష్టమే. వచ్చే సీజన్ కు అగ్ని దశ మారుతుందేమో? ఐపీఎల్ ద్వారా అతడు మరింత వెలుగులోకి వస్తాడేమో?