ఆఫ్గాన్ టీంకు జడేజా ఉచిత సేవ... ఏసీబీ కీలక వ్యాఖ్యలు!
గత ఏడాది భారత్ లో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ టీం ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా
By: Tupaki Desk | 15 Jun 2024 11:45 AM GMTగత ఏడాది భారత్ లో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ టీం ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.. ఆఫ్గనిస్తాన్ క్రికెట్ టీం మెంటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఆఫ్గనిస్థాన్ జట్టు అద్భుతంగా అలరించింది.. తనదైన పెర్ఫార్మెన్స్ తో క్రికెట్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. దీని వెనుక అజయ్ జడేజా ఉచిత సేవ ఉందని ఆఫ్గాన్ క్రికెట్ బోర్డ్ తాజాగా వెల్లడించింది.
అవును... గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ క్రికెట్ లో భారీ టీం లపై పసికూన ఆఫ్గనిస్తాన్ అద్భుత విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... నెథర్లాండ్ తో పాటు ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్ లను ఓడించింది. అయితే ఈ విజయాల్లో అజయ్ జడేజా పాత్ర కీలకం అని ఆఫ్గాన్ క్రికెట్ బాడీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నసీబ్ ఖాన్ తెలిపారు!
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ అద్భుత విజయాలు సాధించినప్పటికీ అజయ్ జడేజా మాత్రం తమ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని.. ఎలాంటి చెల్లింపులను అతడు అంగీకరించలేదని అన్నారు. ఈ విషయంలో తాము పలుమార్లు పట్టుబట్టినా.. జడేజా మాత్రం ప్రతీసారి తిరస్కరించారని తెలిపారు. టీం బాగా ఆడితే అదే తనకు డబ్బు, బహుమతి అనేవాడని తెలిపారు!
గత ఏడాది వరల్డ్ కప్ మ్యాచ్ లలో పాకిస్థాన్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించిన తర్వాత అందరిదృష్టినీ అజయ్ జడేజా ఆకర్షించాడని చెప్పిన పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్... ఆ మ్యాచ్ తర్వాత ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ లకంటే పాకిస్థాన్ – ఆఫ్గనిస్తాన్ మధ్య మ్యచ్ లపై చర్చ పెరిగిందని అన్నారని అంటున్నారు!
ఇదే విషయంపై స్పందించిన అజయ్ జడేజా... వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై విజయం సాధించిన తర్వాత ఆఫ్ఘన్ డ్రెస్సింగ్ రూం మొత్తం.. మద్యం సేవించకుండానే సెలబ్రేషన్ మూడ్ లో ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో... ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ లలో 10రెట్లు పోటీ ఉంటే... పాక్ – ఆఫ్గాన్ మ్యాచ్ లలో 100 రెట్లు ఎక్కువగా ఉందని పలువురితో చెప్పినట్లు వెల్లడించారు.
కాగా... భారత్ తరుపున 196 వన్డేలు ఆడిన అజయ్ జడేజా... 37.47 సగటుతో 5359 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు 30 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇదే సమయంలో... 1992 - 2000 మధ్యకాలంలో అతడు భారత్ తరుపున 15 టెస్టులు ఆడాడు. ఇందులో 26.18 సగటుతో 576 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు అర్ధసెంచరీలు ఉండగా... 96 అత్యధిక స్కోరు!