Begin typing your search above and press return to search.

రోజూ 8 కిలోల మటన్... పాక్ క్రికెటర్లపై అక్రం ఆగ్రహం!

అనంతరం మరింత సీరియస్ అయిన అక్రం... పాక్ ఆటగాళ్లెవరికీ గత రెండేళ్లుగా ఎలాంటి ఫిట్‌ నెస్ టెస్టులను చేయలేదని ఆరోపించారు.

By:  Tupaki Desk   |   24 Oct 2023 9:38 AM GMT
రోజూ 8 కిలోల మటన్...  పాక్  క్రికెటర్లపై అక్రం ఆగ్రహం!
X

ఇండియాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్థాన్ ఆ దెబ్బ నుంచి తేరుకోలేకపోతున్నట్లుంది! ఇందులో భాగంగా... పాకిస్థాన్ పై ఇండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా 62 పరుగులతో గెలిచించి. సరే... ఇండియా, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయారంటే కాస్త సర్ధుకోవచ్చు అని సరిపెట్టుకున్నారు పాక్ అభిమానులు. అయితే... ఎవరూ ఊహించని విధంగా ఆఫ్గన్ చేతిలో మట్టికరవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.

అవును... 282 పరుగులు చేసిన పాకిస్థాన్ పై కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆఫ్గన్ బౌలర్లు విజయం సాధించడంపై పాక్ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పాక్ ప్లేయర్లపై ఆన్ లైన్ వేదికగా విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో ఆఫ్గన్ పై పాకిస్థాన్ ప్లేయర్స్ ఫెర్మార్మెన్స్ పై ఆ దేశ మాజీ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం స్పందించారు.. కాదు కాదు విరుచుకుపడ్డారు!

ఇందులో భాగంగా ఓ పాకిస్థాన్ టీవీ షోలో మాట్లాడిన అక్రం... "ఇవాళ ఎంతో ఇబ్బందిగా ఉంది. ఆఫ్గన్ బ్యాటర్స్ 280 కి పైగా పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేధించడం అనేది చాలా పెద్ద విషయం. పిచ్ తడిగా ఉందా లేదా అనేది విషయం కాసేపు పక్కనబెడితే.. మనోళ్ల ఫీల్డింగ్ చూడండి.. ఫిట్‌ నెస్ స్థాయిలు ఎలా ఉన్నాయో చూడండి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అనంతరం మరింత సీరియస్ అయిన అక్రం... పాక్ ఆటగాళ్లెవరికీ గత రెండేళ్లుగా ఎలాంటి ఫిట్‌ నెస్ టెస్టులను చేయలేదని ఆరోపించారు. ఇదే విషయాన్ని గత గత మూడు వారాలుగా మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడితే.. ముఖాలు వాడిపోతాయని ఎద్దేవా చేశారు. దేశం తరఫున ఆడుతున్నప్పుడు ప్రొఫెషనల్‌ గా ఫిట్‌ గా ఉండాలని సూచించాడు.

ఇంకా గట్టిగా చెప్పాలంటే... "వీళ్లను చూస్తుంటే ప్రతి రోజూ 8 కిలోల మటన్ తింటున్నట్టు కనిపిస్తున్నారు.. వీళ్లకు ఫిట్‌ నెస్ టెస్టులు నిర్వహించొద్దా..?" అని అక్రం ప్రశ్నించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అక్రం వ్యాఖ్యలకు సంబంధించిన ఈ వీడియోని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు.

కాగా... ఆఫ్గన్ మ్యాచ్ అనంతరం పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ స్పందించాడు. బౌలింగ్‌ విభాగంలో.. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు అనుకున్నంత మేర రాణించలేకపోయారని.. దీంతో ఓటమి తప్పలేదని తెలిపారు. ఈ మ్యాచ్‌ లో బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో పూర్తిగా నిరాశపరిచాం అని అన్నారు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని తదుపరి మ్యాచుల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.