Begin typing your search above and press return to search.

అమెరికా అండర్ -19 జట్టులో అందరూ ఇండియన్లే.. మరి తెలుగోళ్లు?

ప్రస్తుతం దక్షిణాఫ్రికా లో జరుగుతున్న టోర్నీలో మన జట్టు ఇప్పటికే రెండు మ్యాచ్ లు నెగ్గింది.

By:  Tupaki Desk   |   28 Jan 2024 11:30 AM GMT
అమెరికా అండర్ -19 జట్టులో అందరూ ఇండియన్లే.. మరి తెలుగోళ్లు?
X

ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా అండర్ 19 ప్రపంచ కప్ జరుగుతోంది. ప్రతి రెండేళ్లకోసారి ఈ టోర్నీని నిర్వహిస్తారు. ఇది ఏజ్ గ్రూప్ టోర్నీ. అంటే.. నిర్దేశిత వయసు వారే పాల్గొంటారు. వచ్చే ప్రపంచ కప్ నాటికి వీరిలో చాలామంది 19 ఏళ్లు దాటుతారు కాబట్టి. కాగా, చాలామంది యువ క్రికెటర్లకు జీవితంలో ఒకసారే అండర్ 19 టోర్నీలో పాల్గొనే చాన్స్ దక్కుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా లో జరుగుతున్న టోర్నీలో మన జట్టు ఇప్పటికే రెండు మ్యాచ్ లు నెగ్గింది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తుచేసింది.. రెండో మ్యాచ్ లో ఐర్లాండ్ ను పడగొట్టింది.

అగ్ర రాజ్యంలో మనోళ్ల పెత్తనం

అమెరికా అంటే అందరికీ భూతల స్వర్గం. అవకాశాల రాజ్యం. విద్య, ఉపాధి, ఉద్యోగ రీత్యా ప్రపంచం నలుమూలల నుంచి ఆ దేశానికి వెళ్లిన వేలాది మంది అక్కడే స్థిరపడిపోయారు. దీంతో అమెరికాల ఓ నానాజాతి సమితిలా కనిపిస్తుంది. ఇక అగ్ర రాజ్యంలో స్థిరపడిన వారిలో మరీ ముఖ్యంగా భారతీయులు అధికం అనే సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాలుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అమెరికా సాధించిన ప్రగతిలో భారతీయుల పాత్ర అత్యంత కీలకం. ఇప్పుడు క్రికెట్ లోనూ భారతీయులు అమెరికాను ముందుకు తీసుకెళ్తున్నారు. అగ్ర రాజ్య జాతీయ జట్టులో భారతీయ క్రికెటర్ల సంఖ్య సగానికిపైగా ఉంటుందనడంలో సందేహం లేదు.

యువ అమెరికా జట్టులో అంతా భారతీయులే..

అండర్ 19 ప్రపంచ కప్ లో ఆదివారం అమెరికా-భారత్ జట్లు ఎదురుపడ్డాయి. మిగతా జట్లతోలాగానే అమెరికాతోనూ మ్యాచ్ కదా? ఇందులో విశేషం ఏముంది? అంటారా...? అమెరికా జట్టులో అందరూ భారతీయ సంతతి ఆటగాళ్లే. మైదానంలో దిగిన 11 మంది మాత్రమే కాదు.. బెంచ్ పై ఉన్న నలుగురు మొత్తం 15 మంది కూడా భారతీయు సంతతి వారే. ఎక్కడైనా ఒక జట్టులో ఒకరిద్దరు భారతీయ సంతతి వారు ఉంటారు. ఇంకా ఎక్కువనుకుంటే నలుగురైదుగురు ఉంటారు. కానీ, ఇలా జట్టు జట్టంతా భారత సంతతి ఆటగాళ్లే ఉండడం విశేషం అనే చెప్పాలి.

ఇదీ అమెరికా అండర్ 19 ప్రపంచ కప్ జట్టు

ప్రణవ్ చెట్టిపాళ్యం, భవ్య మెహతా, సిద్ధార్థ్ కప్పా, రిషి రమేష్ (కెప్టెన్), ఉత్కర్ష్ శ్రీవాత్సవ, మానవ్ నాయక్, అమోఘ్ ఆరేపల్లి (వికెట్ కీపర్), పార్థ్ పటేల్, ఆరిన్ నాదకర్ణి, అతీంద్ర సుబ్రమణియన్, ఆర్య గార్గ్, ఆర్యన్ బత్రా, రాయన్ భగానీ, ఖుష్ బలాలా, ఆర్యమాన్ సూరి.

కొసమెరుపు: అమెరికా అండర్ 19 జట్టులో అందరూ భారత సంతతి ఆటగాళ్లే ఉన్నప్పటికీ.. వీరిలో తెలుగువారు ఎవరైనా ఉన్నారా? అన్నది స్పష్టత రాలేదు. క్రికెటర్ల పేర్లను పరిశీలించగా.. అందరివీ ఇతర రాష్ట్రాల వారివే. ఒకరిద్దరు తెలుగు పేర్లతో ఉన్నప్పటికీ.. వారు పూర్తిగా అమెరికాలోనే పుట్టడంతో మూల నేపథ్యం

ఎక్కడిది? అనేది తెలియరాలేదు. ఇక అమెరికా వికెట్ కీపర్ పేరు అమోఘ్ ఆరేపల్లి. భారత జట్టు వికెట్ కీపర్ పేరు ఆరవెల్లి అవనీష్. ఇతడు తెలంగాణలోని సిరిసిల్లకు చెందినవాడు. ఇద్దరు వికెట్ కీపర్ల పేర్లు దాదాపు ఒకేలా ఉండడం గమనార్హం.