ఆర్సీబీపై పెద్ద రాయేసిన రాయుడు.. తీవ్ర విమర్శ ఎవరిని ఉద్దేశించో?
బుధవారం జరిగిన ఎలిమినేటర్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు టార్గెట్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 24 May 2024 11:26 AM GMTలీగ్ దశలో ఏమాత్రం అవకాశాలు లేని స్థితి నుంచి వరుసగా ఆరు మ్యాచ్ లలో గెలిచి ప్లేఆఫ్స్ చేరిన జట్టు.. ఎలిమినేటర్ లో సాధారణ ప్రదర్శనతో ఓటమిపాలైంది. ఒకరిద్దరు ఆటగాళ్లపైనే అతిగా ఆధారపడితే ఏం జరుగుతుందో చెప్పేలా ఆ జట్టు పరాజయాన్ని ఎదుర్కొంది. దీంతో ఆ జట్టు ఆటతీరుపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, తెలుగు క్రికెటర్ చేసిన ఓ కామెంట్ మాత్రం నెట్టింట తెగ దుమారం రేపుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు కావడం, బెంగళూరు చెన్నైపైనే గెలిచి ప్లేఆఫ్స్ చేరడం తదితర కారణాలతో ఈ విమర్శకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
మైలురాళ్లకే ప్రాధాన్యమే..
బుధవారం జరిగిన ఎలిమినేటర్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు టార్గెట్ చేసుకున్నాడు. ఆ జట్టు మేనేజ్‌మెంట్, సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిని విమర్శించాడు. అయితే, ఆర్సీబీ అభిమానులపై మాత్రం ప్రశంసలు కురిపించాడు. ‘బెంగళూరునుఅభిమానించే ప్రతి అభిమానికి నా అభినందనలు. ఒక్కసారి కూడా కప్ గెలవకపోయినా టోర్నీ ఆరంభం నుంచి ఆర్సీబీని ప్రేమిస్తున్నారు. ఇది ఎంతో గర్వకారణం’’ అని కొనియాడాడు. అయితే.. మేనేజ్ మెంట్, ఆర్సీబీ సారథులు వ్యక్తిగత మైలురాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని విరమ్శలు చేశాడు. ఇదే గనుక లేకపోతే ఇప్పటికే ఆర్సీబీ టైటిళ్లను గెలిచేదని వ్యాఖ్యానించాడు.
అద్భుతమైన క్రికెటర్లు ఉన్నా..
రాయల్ చాలెంజర్స బెంగళూరులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని కొనియాడిన రాయుడు.. జట్టు ఆశలను ముందుకు తీసుకెళ్లేలా వారిని వాడుకోవాల్సిన అవసరం మేనేజ్ మెంట్ దేనంటూ పరోక్షంగా మేనేజ్ మెంట్ ను తప్పుబట్టాడు. అయితే, ఇదే సమయంలో ఓ సలహా కూడా చేశాడు. వచ్చే ఏడాది మెగా వేలం నుంచి ఆర్సీబీ కొత్త అధ్యాయం ఘనంగా మొదలవుతుంది అంటూ ట్వీట్ చేశాడు. కాగా, చివరి లీగ్ మ్యాచ్ లో బెంగళూరు చేతిలో చెన్నై ఓటమి అనంతరం రాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాడు. ఇప్పుడు కోహ్లి, డుప్లెసిస్ ల కెప్టెన్సీని విమర్శస్తూనా? అన్నట్లు అతడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆర్సీబీకి మూడేళ్ల కిందటి వరకు కోహ్లినే కెప్టెన్ కావడం గమనార్హం. ఇప్పుడు అతడే పరుగుల పరంగా టాప్ లో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ కోహ్లికే దక్కే చాన్సుంది.