Begin typing your search above and press return to search.

''టైమ్డ్ ఔట్‌'' చిచ్చు.. శ్రీలంక వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌.. !!

వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక త‌ల‌ప‌డింది. ఈ క్ర‌మంలో క్రీజ్‌లోకి వచ్చిన శ్రీలంక క్రికెట‌ర్ ఏంజెలో గార్డ్‌ తీసుకోకుండానే మళ్లీ హెల్మెట్‌ కోసం వేచి చూశాడు

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:47 PM GMT
టైమ్డ్ ఔట్‌ చిచ్చు.. శ్రీలంక వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌.. !!
X

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడతారు? అనే విష‌యం ఎలా ఉన్నా.. ఇప్పుడు శ్రీలంక‌-బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య చోటు చేసుకున్న ''టైమ్డ్ ఔట్‌'' వివాదం ప్ర‌పంచ క్రికెట్‌ను కుదిపేస్తోంది. ఈ రెండు జ‌ట్లు కూడా ఇప్ప‌టికే సెమీస్ రేస్ నుంచి త‌ప్పుకొన్నాయి. అయితే.. ఛాంపియ‌న్స్ ట్రోఫీపై మాత్రం క‌న్నేశాయి. దీనికి అర్హ‌త సాధించేందుకు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌లో ఈ రెండు జ‌ట్లు కూడా టాప్‌-8లో ఉండాలి. అయితే.. ఇక్క‌డే ఓ చిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమై.. ఇరు జ‌ట్ల మ‌ధ్య సెగ‌లు క‌క్కుతోంది.

శ్రీలంక జ‌ట్టు సీనియ‌ర్ క్రికెట‌ర్ ఏంజెలో మాథ్యూస్ తొలిసారి 'టైమ్డ్ ఔట్‌' పేరుతో పెవిలియ‌న్ బాట‌ప‌ట్టడం.. దీనికి బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కిబ్ కార‌ణ‌మ‌ని మాథ్యూస్ ఆరోపించ‌డం, అదేంలేదు.. నిబంధ‌న‌ల మేర‌కు మాత్ర‌మే నేను అత‌నిని త‌ప్పించమ‌ని కోరాన‌ని ష‌కీబ్ చెప్ప‌డం వంటివి చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. దీంతో ఇరు జ‌ట్ల మ‌ధ్య క్రికెట్ పోరు క‌న్నా.. ఇది ప్ర‌ముఖంగా తెర‌మీదికి వ‌చ్చింది.

అస‌లు ఏం జ‌రిగింది?

వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక త‌ల‌ప‌డింది. ఈ క్ర‌మంలో క్రీజ్‌లోకి వచ్చిన శ్రీలంక క్రికెట‌ర్ ఏంజెలో గార్డ్‌ తీసుకోకుండానే మళ్లీ హెల్మెట్‌ కోసం వేచి చూశాడు. దీంతో బంగ్లా కెప్టెన్‌ షకిబ్ అత‌న‌ని ఔట్ చేయాల‌ని అప్పీలు చేశాడు. దీనికి అంపైర్లు ఓకే చెప్పి.. ఏంజెలోను ఔట్‌గా ప్రకటించారు. ఈ ప‌రిణామం శ్రీలంక జ‌ట్టును డిపెన్స్‌లో ప‌డేసింది. అయితే.. అంపైర్ల నిర్ణ‌యాన్ని మాథ్యూస్ అంగీక‌రించి డ‌కౌట్‌కు వెళ్లిపోయాడు. అయితే.. మ్యాచ్ మాత్రం ముగిసింది. కానీ, ఈ వ్య‌వ‌హారం ఇరు జ‌ట్ల మ‌ధ్య వివాదాన్ని రేపింది. దీంతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేసుకునే సంప్ర‌దాయానికి దూర‌మ‌య్యారు.

మాట‌ల మంట‌లు!

అయితే.. త‌న‌ను ఉద్దేశ పూర్వ‌కంగా ఆడ‌కుండా చేశార‌ని ఏంజెలో విమ‌ర్శ‌లు గుప్పించాడు. క్రీజ్‌లోకి వ‌చ్చినా.. గార్డ్ తీసుకునేందుకు తనకు ఇంకా సమయం ఉంద‌ని.. అయిన‌ప్ప‌టికీ ఔట్‌గా ప్రకటించారని అన్నాడు. అంతేకాదు.. దీనికి సంబంధించి త‌న ద‌గ్గ‌ర‌ వీడియో ఆధారాలు ఉన్నట్లు తెలిపాడు.

''నేనేమీ తప్పు చేయలేదు. బ్యాటింగ్‌ కోసం రెండు నిమిషాల్లోపే సిద్ధమయ్యా. అయితే, హెల్మెట్ సరిగా లేదని గుర్తించా. ఇదే విషయం ఆటగాళ్లకు, అంపైర్లకు చెప్పా. ఇదేస‌మ‌యంలో షకిబ్ స‌హా బంగ్లా జట్టు నుంచి అవమానకర రీతిలో ప్రతిస్పందన వచ్చింది. న‌న్ను టైమ్డ్ ఔట్ కింద ప్ర‌క‌టించాల‌ని కోర‌డం చాలా తప్పు. నేను రెండు నిమిషాల్లోపు సిద్ధంగా ఉండకపోతే ఔటని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, అప్పటికీ ఐదు సెకన్ల సమయం మిగిలే ఉంది. నా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి'' అని ఏంజెలో వివ‌రించాడు.

ష‌కీబ్ ఏమ‌న్నాడంటే..

ఏంజెలో వ్య‌వ‌హారంపై బంగ్లా కెప్టెన్ ష‌కీబ్ కూడా రియాక్ట్ అయ్యాడు. 'మాథ్యూస్‌ మరో హెల్మెట్‌ కోసం అడిగాడు. అప్పుడు ఓ ఫీల్డర్‌ నా దగ్గరకు వచ్చి మనం అప్పీల్‌ చేస్తే అంపైర్‌ అతణ్ని ఔట్‌గా ప్రకటిస్తాడని చెప్పాడు. అది నిబంధనల్లో ఉందని పేర్కొన్నాడు. అప్పుడే నేను అప్పీల్‌ చేశా. అది తప్పోఒప్పో తెలీదు. కానీ నేను యుద్ధంలో ఉన్నాననిపించింది. గెలుపు కోసం ఏమైనా చేయాలనిపించింది. అందుకే అలా చేశా'' అని పేర్కొనడం గ‌మ‌నార్హం.