Begin typing your search above and press return to search.

మాజీ క్రికెటర్ కు బ్లడ్ క్యాన్సర్.. చికిత్సకు రూ.కోటి.. బీసీసీఐ పెద్ద మనసు

మిగతావారంతా ఆర్థికంగా బాగున్నారని చెప్పలేం కానీ.. ఈ మాజీ క్రికెటర్ మాత్రం అనారోగ్యంతో ఆర్థికంగానూ చితికిపోయినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 July 2024 12:14 PM GMT
మాజీ క్రికెటర్ కు బ్లడ్ క్యాన్సర్.. చికిత్సకు రూ.కోటి.. బీసీసీఐ పెద్ద మనసు
X

జాతీయ జట్టుకు పుష్కర కాలం పాటు ఆడి.. సెలక్టర్ గా.. కోచ్ గానూ భారత క్రికెట్ కు సేవలందించిన ఆయన.. జీవిత చరమాంకంలో భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ బారినపడ్డారు. తాను దేశానికి ఆడిన కాలంలో భీకరమైన ఫాస్ట్‌ బౌలర్లను కాచుకుంటూ ముఖం, ఛాతీ మీద అనేక దెబ్బలు తిన్న ఆయన.. ఇప్పుడు మంచంపై ఉంటూ ఏడాది నుంచి పోరాడుతున్నారు. అంతేకాదు.. అత్యంత ఖరీదైనప్పటికీ లండన్ లో చికిత్స పొందుతున్నారు. ఆ క్రికెటర్ సహచరులు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, వెంగ్ సర్కార్ వంటి దిగ్గజాలు. మిగతావారంతా ఆర్థికంగా బాగున్నారని చెప్పలేం కానీ.. ఈ మాజీ క్రికెటర్ మాత్రం అనారోగ్యంతో ఆర్థికంగానూ చితికిపోయినట్లు తెలుస్తోంది.

అప్పట్లో భీకర బౌన్సర్ బారినపడి..

'ది వాల్' ఇప్పుడు మనం రాహుల్ ద్రవిడ్ కు ఇచ్చిన బిరుదు. కానీ, 50 ఏళ్ల కిందటనే అన్షుమన్ గైక్వాడ్ కు ఈ పేరు పెట్టారు. అత్యంత సహనంతో క్రీజులో పాతుకుపోయేవాడు. 1975-76 సీజన్ లో అయితే.. వెస్టిండీస్ భీకర పేసర్ మైకేల్ హోల్డింగ్ సంధించిన రాకాసి బౌన్సర్ బారినపడి రెండు రోజులు ఆస్పత్రి ఐసీయూలో ఉన్నాడు. ఈ బౌన్సర్ దెబ్బకు కుడి చెవి వినికిడి సమస్యకూ గురయ్యాడు. 1970లలో భారతదేశపు అత్యంత సాహసోపేతమైన ఆటగాళ్లలో ఒకడైన గైక్వాడ్.. దేశానికి 40 టెస్ట్ మ్యాచ్‌ లు ఆడాడు. 30.07 సగటుతో 1985 పరుగులు చేశాడు. రెండు సెంచరీలతో పాటు 10 అర్థ సెంచరీలు కొట్టాడు. ఇక 15 వన్డేల్లోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు గైక్వాడ్ టీమ్ ఇండియాకు రెండుసార్లు (1997-99, 2000) కోచ్ గా పనిచేయడం విశేషం. జాతీయ సెలక్టర్ వంటి కీలక బాధ్యతలూ నిర్వర్తించాడు.

ప్రస్తుతం 31 ఏళ్లున్న గైక్వాడ్.. బ్లడ్‌ క్యాన్సర్‌ బారినపడ్డాడు. దీంతో అతడిని ఆదుకోవాలంటూ బీసీసీఐకి దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ కోరాడు. గైక్వాడ్ సహచరులైన కపిల్, గావస్కర్, అమర్‌ నాథ్, వెంగ్‌ సర్కార్, మదన్‌ లాల్, కీర్తి ఆజాద్‌ కూడా నిధులు సమీకరించారు. బీసీసీఐ కూడా సాయం చేయాలని కపిల్‌ అభ్యర్థించాడు. గైక్వాడ్ తో కలిసి ఆడిన తాను.. అతడి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నానని, తనలా ఎవరూ బాధపడకూడదని కపిల్ పేర్కొన్నాడు. గైక్వాడ్ ఇప్పుడు మనం అండగా నిలవాలని.. పరిస్థితి మెరుగుపడకుంటే తన పింఛను డబ్బులను ఇచ్చేందుకూ సిద్ధం అని కపిల్ వివరించాడు.

స్పందించిన బీసీసీఐ

కపిల్ ప్రకటన కదిలించిందో ఏమో కానీ.. గైక్వాడ్ విషయమై బీసీసీఐ తక్షణమే స్పందించింది. బోర్డు కార్యదర్శి జై షా రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నిర్ణయంపై క్రికెట్ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కాగా, గైక్వాడ్ ది పూర్తిగా క్రికెటింగ్ ఫ్యామిలీ. ఇతడి తండ్రి దత్తారావు, కుమారుడు శత్రుంజయ్ గైక్వాడ్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెటర్లే. ఈ మూడు తరాల వారూ ఒకే రంజీ జట్టుకు ఆడడం చరిత్రనే.

కొసమెరుపు: 2000 సంవత్సరం తర్వాత భారత క్రికెట్ కోచ్ గా కపిల్ దేవ్ తప్పుకొన్నాడు. దీంతో అప్పటికప్పుడు గైక్వాడ్ ను రెండోసారి కోచ్ గా ప్రకటించారు. అదే కపిల్ దేవ్ ఇప్పుడు గైక్వాడ్ కు సాయం అందేలా చేశాడు.