Begin typing your search above and press return to search.

24 ఏళ్లకే రిటైరైన భారత ఒలింపిక్ స్టార్.. చదువు కోసం సంచలన నిర్ణయం

క్రికెట్ వంటి క్రీడల్లో 35 ఏళ్లకు కూడా ఇంకా కెరీర్ ఉందనుకుంటారు.. మన రోహిత్ శర్మ 37వ ఏట టి20 ప్రపంచ కప్ సాధించి పెట్టాడు.

By:  Tupaki Desk   |   22 Aug 2024 10:55 AM GMT
24 ఏళ్లకే రిటైరైన భారత ఒలింపిక్ స్టార్.. చదువు కోసం సంచలన నిర్ణయం
X

క్రికెట్ వంటి క్రీడల్లో 35 ఏళ్లకు కూడా ఇంకా కెరీర్ ఉందనుకుంటారు.. మన రోహిత్ శర్మ 37వ ఏట టి20 ప్రపంచ కప్ సాధించి పెట్టాడు. ఫుట్ బాల్ లో మెస్సీ, రొనాల్డో 38 ఏళ్లు వచ్చినా ఆడుతున్నారు. టెన్నిస్ లో జకోవిచ్ 37వ ఏట మొన్న ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచాడు. ఇవన్నీ ఔట్ డోర్ (మైదానంలో ఆడేవి) గేమ్ లు. కానీ.. ఇండోర్ గేమ్ లో ఓ క్రీడాకారిణి కేవలం 24 ఏళ్లకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది. అందులోనూ ఆమె భారత్ కు చెందినవారు కావడం గమనార్హం.

టీటీలో ఎదుగుతూ..

మనిషి సునిశిత పరిశీలన, చురుకుదనానికి ప్రతీక టేబుల్ టెన్నిస్ (టీటీ). చిన్న టేబుల్ పై బంతితో ఆడే టీటీలో మేటి చైనా. భవిష్యత్ లో అలాంటి చైనా క్రీడాకారుల సరసన నిలిస్తుందని అనుకున్నారు అర్చనా కామత్. కానీ.. ఆమె 24 ఏళ్లకే వీడ్కోలు పలికారు. పారిస్ ఒలింపిక్స్ లో అర్చనా ప్రాతినిధ్యం వహించిన మహిళల జట్టు క్వార్టర్స్ కు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారత జట్టుగా చరిత్రలో నిలిచింది. ఇందులో కామత్ ది కీలక పాత్ర. అలాంటి అర్చన టీటీ నుంచి వైదొలగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సోదరుడు నాసాలో ఉద్యోగి

ఒలింపిక్స్ క్వార్టర్స్ లో అర్చనా జట్టు క్వార్టర్స్ లో వెనుదిరిగింది. అక్కడినుంచి వచ్చిన వెంటనే ఆమె తన కెరీర్ గురించి కోచ్ అన్షుల్ గార్గ్ తో మాట్లాడి కెరీర్ పై నిర్ణయం ప్రకటించింది. కేవలం చదువుల కోసమే ఆటను వీడినట్లు తాజాగా తెలిపింది. కాగా, 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో అర్చనా జట్టుకు పతకం గెలిచే అవకాశాలు తక్కువగా ఉండడం, ఆర్థికంగానూ ఆలోచించి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, అర్చనా విదేశాలకు వెళ్లి చదివే అవకాశాలున్నాయి. అది కూడా అమెరికానే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె సోదరుడు నాసాలో పనిచేస్తున్నాడు. అతడు ఎప్పుడూ అర్చనను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహిస్తుంటాడు. దీంతోనే ఆమె రిటైర్మెంట్ ప్రకటించిందని భావిస్తున్నారు.

విమర్శలకు చెక్ పెట్టి..

అర్చనా కామత్ ను పారిస్ ఒలింపిక్స్ కు ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. కానీ, ఆమె వాటికి అడ్డుకట్ట వేస్తూ రాణించింది. వాస్తవానికి క్వార్టర్ ఫైనల్లో భారత్ 1-3తేడాతో జర్మనీ చేతిలో ఓడింది. గెలిచిన ఒక్క మ్యాచ్ కూడా అర్చన గెలిచినదే కావడం గమనార్హం.