Begin typing your search above and press return to search.

చందాలతో చాంపియన్.. ప్రత్యర్థైనా పాక్ జావెలిన్ త్రోయర్ కథ పెద్దదే

ఇదీ పాకిస్థాన్ జావెల్రిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ సాధించిన ఘనత.

By:  Tupaki Desk   |   9 Aug 2024 3:30 PM GMT
చందాలతో చాంపియన్.. ప్రత్యర్థైనా పాక్ జావెలిన్ త్రోయర్ కథ పెద్దదే
X

పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్.. గురువారం అర్థరాత్రి.. డిఫెండింగ్ చాంపియన్ గా భారత్ కు చెందిన నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం తెచ్చిన అతడు ఈసారీ గోల్డ్ కొట్టేస్తాడని ధీమా.. మంచి ఫామ్ లో ఉన్న నీరజ్ అంచనాలను అందుకోవడం ఖాయమని అభిమానుల ఆనందం.. కానీ, అంతలోనే దూసుకొచ్చిందో ‘‘బల్లెం..’’. మన దేశం ఆశలను చిదిమేస్తూ, 90 మీటర్లు దాటి దూసుకెళ్తూ.. భారత అభిమానుల మనసును గుచ్చేస్తూ.. రికార్డులను బద్దలు కొడుతూ ఒలింపిక్ స్వర్ణాన్ని ఎగరేసుకుపోయింది. ఇదీ పాకిస్థాన్ జావెల్రిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ సాధించిన ఘనత. ఇంతకూ ఇతడి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

నాడు 4.. నేడు 1

నీరజ్ స్వర్ణం గెలిచిన గత ఒలింపిక్స్ లో అర్షద్ నదీమ్ నాలుగో స్థానంలో నిలిచాడు. అప్పుడు చివర్లో నదీమ్ కు బల్లెం అవసరం అయితే.. నీరజ్ ఇచ్చి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. ఇప్పుడు అదే నదీమ్ స్వర్ణం కొల్లగొట్టాడు. కాగా, ఇతడి వయసు 27. పాకిస్థాన్ ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచి 40 ఏళ్లు అవుతోంది. అంటే.. నదీమ్ పుట్టాక ఆ దేశానికి బంగారు పతకం దక్కలేదు. ఆ కొరతను ఇప్పుడు తీర్చాడు. కాగా, నదీమ్‌ పాకిస్థాన్ లోని మియా చాను సమీపంలోని ఖనేవాల్‌ గ్రామంలో పేద కుటుంబంలో 1997 జనవరి 2న పుట్టాడు. తండ్రి మహమ్మద్‌ అష్రాఫ్‌ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ లో కూలీ. ఈయనకు ఏడుగురు పిల్లలు కాగా.. వారిలో నదీమ్‌ మూడోవాడు. నదీమ్ స్కూల్ లో క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌ లో రాణించాడు. పొడగరి అయిన అతడు క్రికెట్‌ లో జిల్లా స్థాయిలో ఆడాడు. మంచి బౌలర్‌. అథ్లెటిక్స్‌ లో బాగా రాణిస్తున్నట్లు గుర్తించిన కోచ్‌ రషీద్‌ అహ్మద్‌ సాకీ గుర్తించి తీర్చిదిద్దాడు. కాగా, నదీమ్ ది ఎంత పేద కుటంబం అంటే.. ఏడాదిలో ఈద్‌ అల్‌ అదా నాడు మాత్రమే మాంసాహారం తినేంత..

షాట్ పుట్.. డిస్కస్ త్రో లోనూ..

నదీమ్ స్కూల్ స్థాయిలో పలు క్రీడల్లో పాల్గొన్నట్లు చెప్పుకొన్నాం కదా..? అయితే, అతడు జావెలిన్‌ త్రో కంటే ముందు.. షాట్‌ పుట్‌, డిస్కస్‌ త్రో కూడా ప్రయత్నించాడు. జావెలిన్‌ త్రోలో పంజాబ్‌ యూత్‌ ఫెస్టివల్స్‌, ఇంటర్‌ బోర్డ్‌ మీట్‌ లో స్వర్ణాలు నెగ్గడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, డబ్ల్యూపీడీఏ ఆఫర్లు వచ్చాయి. 2015లో ప్రొఫెషనల్ గా మారిన నదీమ్.. చాలాసార్లు గాయపడ్డాడు. పాక్ లో అతడికి స్కాలర్‌ షిప్‌ కూడా లభించలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే గ్రామస్థులు చందాలు వేసుకుని పంపేవారు. అథ్లెట్ కు కావాల్సిన బలమైన డైట్‌ కోసం సమీప బంధువు సాయం చేశాడు.

చిరకాల ప్రత్యర్థులు.. 90 మీటర్లు దాటి..

గత ఒలింపిక్స్ లోనే కాదు.. 2016 నుంచే నదీమ్-నీరజ్ మధ్య పోటీ మొదలైంది. గువాహటీలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో వీరు తొలిసారి తలపడ్డారు. అప్పుడు నీరజ్‌ స్వర్ణం నెగ్గగా, నదీమ్‌ కాంస్యం గెలిచాడు. కాగా, నీరజ్ చోప్రా ఇప్పటివరకు 90 మీటర్ల దూరం విసరలేకపోయాడు. కానీ, నదీమ్ 2022లోనే ఈ రికార్డును అందుకున్నాడు. కామన్‌ వెల్త్‌ లో స్వర్ణం గెలిచాడు. ఈసారి ఒలింపిక్స్ లో స్వర్ణం అతడిదేనని అంచనాలు వచ్చాయి. కానీ పోటీలు దగ్గరపడే కొద్దీ కష్టాలు పెరిగాయి. నిరుడు ఆసియా క్రీడల్లో పాల్గొనలేదు. ఫిబ్రవరిలో ఒలింపిక్‌ శిక్షణను మొదలుపెట్టాడు. మోకాలి గాయానికి సర్జరీతో రెండు నెలలు రెస్ట్ తీసుకున్నాడు. మళ్లీ గాయంతో బరిలో దిగలేదు. అయితే, ఆ సమయాన్ని జావెలిన్‌ టెక్నిక్స్‌ అధ్యయనానికి వాడుకున్నాడు.

కొసమెరుపు:

భారత్ 117.. పాక్ 7..

పారిస్‌ ఒలింపిక్స్ లో భారత్ 117 మందితో టీమ్ ను పంపింది. కానీ, పాక్‌ నుంచి పాల్గొంటోంది ఏడుగురు మాత్రమే. మనకు ఇంతవరకు స్వర్ణం దక్కలేదు. పాక్ కు నదీమ్ గోల్డ్ తెచ్చాడు. అంటే.. పాయింట్ల పట్టికలో పాక్ మనను మించిపోనుంది. ఇక ఒకప్పుడు చందాలతో పోటీలకు వెళ్లిన నదీమ్ కు ఒలింపిక్ గోల్డ్ తో పంట పండింది. అతడికి సింధ్‌ ప్రావిన్స్‌ రూ.5 కోట్లు నజరానా ప్రకటించింది. పంజాబ్‌ వర్సిటీలో పాత పద్ధతిలోని జిమ్‌ లో, తాను పుట్టినప్పటి పరికరాలతో ప్రాక్టీస్ చేసిన నదీమ్ దశ తిరిగింది.