Begin typing your search above and press return to search.

మూడో స్పిన్నర్ ఎవరో తేలిపోయింది

By:  Tupaki Desk   |   23 July 2015 9:16 AM GMT
మూడో స్పిన్నర్ ఎవరో తేలిపోయింది
X
శ్రీలంకతో వచ్చే నెల 12 నుంచి ఆరంభమయ్యే మూడు టెస్టుల సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు సెలక్టర్లు. గురవారం సందీప్ పాటిల్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టు విషయంలో ఆసక్తి రేపింది ప్రధానంగా మూడో స్పిన్నర్ ఎంపిక అంశమే. ఈ అవకాశం సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకే దక్కింది. ఆస్ట్రేలియా పర్యటనలో అవకాశం దక్కించుకున్న కర్ణ్ శర్మకు ఈసారి సెలక్టర్లు మొండి చేయి చూపించారు. అక్షర్ పటేల్ కూడా పోటీలో నిలిచినా.. మిశ్రాకే సెలక్టర్లు ఓటేశారు. దేశంలో బెస్ట్ లెగ్ స్పిన్నర్ మిశ్రానే అయినా అతడికి జాతీయ జట్టులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. అతను చివరగా టెస్టు మ్యాచ్ ఆడి నాలుగేళ్లవుతుండటం విశేషం. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న మిశ్రాపై ఎట్టకేలకు సెలక్టర్లు కరుణ చూపారు.

ధోని ఖాళీ చేసిన వికెట్ కీపర్ స్థానాన్ని సాహా నిలబెట్టకున్నాడు. రెండో వికెట్ కీపర్ గా నమన్ ఓజాకు అవకాశం ఇస్తారన్న ప్రచారం నిజం కాలేదు. బంగ్లాదేశ్ పర్యటనతో రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన హర్భజన్ సింగ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో స్పిన్నర్ అశ్విన్ కూడా జట్టులో ఉన్నాడు. కోహ్లి సారథ్యంలోని ఈ జట్టులోని మిగతా సభ్యులు.. మురళీ విజయ్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, వరుణ్ ఆరోన్. ప్రపంచ కప్ సందర్భంగా గాయపడ్డ బెంగాల్ పేసర్ మహ్మద్ షమి ఇంకా కోలుకోకపోవడంతో అతడి పేరు పరిగణనలోకి తీసుకోలేదు. ఆగస్టు మొదటి వారంలో భారత జట్టు శ్రీలంకకు బయల్దేరుతుంది. 12న తొలి టెస్టు మొదలవుతుంది.