Begin typing your search above and press return to search.

యాషెస్ పోయింది...క్రికెట్‌ కు క్లార్క్ బై బై

By:  Tupaki Desk   |   8 Aug 2015 4:31 PM GMT
యాషెస్ పోయింది...క్రికెట్‌ కు క్లార్క్  బై బై
X
అంత‌ర్జాతీయ‌ క్రికెట్ నుంచి మ‌రో దిగ్గ‌జం వైదొల‌గుతోంది. ఆస్ర్టేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ యాషెస్ సీరీస్‌ లో చివ‌రి టెస్టు త‌ర్వాత టెస్టు క్రికెట్ నుంచి వైదొల‌గుతున్న‌ట్టు ఆస్ర్టేలియా ప‌త్రిక‌కు రాసిన వ్యాసం లో పేర్కొన్నాడు. దీన్ని ఆసీస్ మీడియా కూడా ధృవీక‌రించింది. ఆగస్టు 20 నుంచి 24 వరకు ట్రెంట్‌ రిడ్జిలో జ‌రిగే ఐదో టెస్ట్ మ్యాచ్ త‌ర్వాత క్లార్క్ క్రికెట్‌ కు వీడ్కోలు పలుకుతారని క్రికెట్ ఆస్టేలియా అధికారికంగా ప్రకటించింది. 2004లో భార‌త్‌ తో బెంగ‌ళూరులో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ టెస్ట్ క్రికెట్‌ లోకి అడుగుపెట్టిన క్లార్క్ ఆస్ర్టేలియాకు చెందిన ఆణిముత్య క్రికెట‌ర్ల‌ లో ఒక‌డుగా నిలిచాడు.

ఈ సంవ‌త్స‌రం సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ గెలుచుకున్న ఆసీస్ బృందానికి క్లార్క్ నాయ‌క‌త్వం వ‌హించారు. ఈ అరుదైన ఘ‌న‌త ద‌క్కించుకున్న కొద్దిమంది క్రికెట‌ర్ల‌ లో క్లార్క్ ఒక‌డు. 11 సంవ‌త్స‌రాలుగా క్రికెట్ ఆడుతున్న క్లార్క్ వ‌య‌స్సు 34 సంవ‌త్స‌రాలు. అయితే వెన్నునొప్పి కార‌ణంగా ఇటీవ‌ల ఫామ్‌ ను కోల్పోయి స‌రిగా రాణించ‌లేకోవ‌డంతో పాటు యాషెస్ సీరీస్‌ లో ఘోరంగా ఓడిపోవ‌డం కూడా క్లార్క్ తొంద‌ర‌గా రిటైర‌వ్వ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి.

245 వ‌న్డేలు, 34 20-20 మ్యాచ్‌లు ఆడిన క్లార్క్ ప్రపంచ‌క‌ప్ త‌ర్వాత వ‌న్డేల నుంచి త‌ప్పుకున్నాడు. ఇక త‌న పూర్తి స‌మ‌యాన్ని కుటుంబంతో గ‌డుపుతాన‌ని ప్ర‌క‌టించాడు.

క్లార్క్ అంత‌ర్జాతీయ టెస్ట్ కేరీర్ డీటైల్స్ :
ఫ‌స్ట్ మ్యాచ్ - 2004లో భార‌త్‌తో ( బెంగ‌ళూరు )
మ్యాచ్‌లు - 114
సెంచ‌రీలు - 28
అర్థ సెంచ‌రీలు - 27
ప‌రుగులు - 8605
హ‌య్య‌స్ట్ స్కోర్ - 329 నాటౌట్‌