Begin typing your search above and press return to search.

ఐపీఎల్-9, 10లో ఎన్ని జట్లు ఆడబోతున్నాయ్?

By:  Tupaki Desk   |   15 July 2015 9:31 AM GMT
ఐపీఎల్-9, 10లో ఎన్ని జట్లు ఆడబోతున్నాయ్?
X
రెండేళ్ల కిందటి ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణానికి సంబంధించి సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ నిన్న సంచలన తీర్పు వెలువరించింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలను రెండేళ్ల పాటు ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేసింది. గురునాథ్ మయప్పన్, రాజ్ కుంద్రా క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. గురునాథ్, కుంద్రా ఏమైతే మనకేంటి కానీ.. ఐపీఎల్‌లో అత్యంత ఆదరణ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రాజస్థాన్ టీమ్ మీద రెండేళ్లు నిషేధం పడటమే ఐపీఎల్ అభిమానులకు పెద్ద షాక్. చెన్నై లేని ఐపీఎల్‌ను ఊహించడం చాలా కష్టం. పసుపు జట్టు ఐపీఎల్‌లో చేసే సందడి అంతా ఇంతా కాదు.

ఐతే ఈ రెండు జట్లపై నిషేధం పడిన నేపథ్యంలో వచ్చే రెండేళ్లు ఐపీఎల్‌ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ మొదలైంది. ఆరు జట్లతోనే ఐపీఎల్ నిర్వహించే సాహసానికి బీసీసీఐ రెడీ అవుతుందని అనుకోలేం. అదే జరిగితే ఐపీఎల్ కళ తప్పడం ఖాయం. ఆ రెండు జట్ల ఆటగాళ్లు కూడా అన్యాయమైపోతారు. కాబట్టి ఎనిమిది జట్లతోనే ఐపీఎల్ నిర్వహించడానికి ఉన్న మార్గాలపై ఇప్పటికే దృష్టిపెట్టింది బీసీసీఐ. చెన్నై, రాజస్థాన్ జట్లపై రెండేళ్లు నిషేధం పడింది కాబట్టి.. ఈ రెండేళ్ల వరకు ఆయా నగరాల్లో రెండు కొత్త ఫ్రాంఛైజీల కోసం బిడ్డింగ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చే ఫ్రాంఛైజీలు ప్రస్తుత ఆటగాళ్లనే తమ జట్లలోకి తీసుకోవచ్చు. లేదా ఈ రెండు జట్ల ఆటగాళ్లను మిగతా ఆటగాళ్లతో కలిసి రెగ్యులర్ వేలం ఏర్పాటు చేసి.. అందులోంచి ఫ్రాంఛైజీలు జట్లను తయారు చేసుకునే అవకాశం కల్పించవచ్చు.

ఆ పరిస్థితుల్లో ఒకవేళ జైపూర్ ఫ్రాంఛైజీ ధోనిని ఎంచుకుంటే పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరం. ధోని లాంటి ఆటగాళ్లతో లోకల్ అభిమానులు బాగా అనుబంధం పెంచుకున్న నేపథ్యంలో బ్రాండ్ వాల్యూ దెబ్బతినవచ్చు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా కొత్తగా బిడ్డింగ్ నిర్వహించకుండా.. గతంలో బహిష్కరణకు గురైన కోచి, పుణె ఫ్రాంఛైజీలకు మళ్లీ అవకాశం అవకాశం కల్పించవచ్చన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది ఈ నెల 19న జరిగే బీసీసీఐ సమావేశంలో తేలుతుంది.