Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియా కెప్టెన్ బతుకుతాడా?

By:  Tupaki Desk   |   6 Aug 2015 10:56 AM GMT
ఆస్ట్రేలియా కెప్టెన్ బతుకుతాడా?
X
నా ఆటనేమైనా అనండి.. కానీ నాకు కమిట్మెంట్ లేదని.. ఆడాలన్న ఉత్సాహం లేదని మాత్రం అనకండి. అలాంటి మాటలు మాట్లాడితే నేను చచ్చినట్లే అంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైకేల్ క్లార్క్. ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ కు అందించిన అద్భుతమైన క్రికెటర్లలో ఒకడైన క్లార్క్ కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మిగతా సిరీసుల్లో అయితే చెల్లిపోయేది కానీ.. ఆస్ట్రేలియన్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ లో క్లార్క్ ఘోరంగా విఫలమవుతుండటంతో విమర్శకులు అతణ్ని టార్గెట్ చేశారు. తొలి మూడు టెస్టుల్లో క్లార్క్ కేవలం 94 పరుగులే చేశాడు. మూడో టెస్టులో బాధ్యతాయుతంగా ఆడాల్సిన స్థితిలో రెండు ఇన్నింగ్సు ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో కేవలం రెండున్నర రోజుల్లోనే ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. సిరీస్ లో 1-2తో వెనుకబడి గురువారం నాలుగో టెస్టును ఆరంభించనుంది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. క్లార్క్ పనైపోయిందని.. అతడిలో ఇంకెంత మాత్రం క్రికెట్లో కొనసాగే ఉత్సాహం కనిపించడం లేదని.. ఈ సిరీస్ తో అతడు రిటైరవడం ఖాయమని విమర్శకులు అతడిపై ధ్వజమెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్లార్క్ విమర్శకులపై ఎదురు దాడికి దిగాడు. తాను ఫామ్ లో లేను కాబట్టి ఆట గురించి తిట్టే హక్కు వారికుందని.. కానీ తనలో ఉత్సాహం లేదని, సిరీస్ తర్వాత రిటైర్మెంటే అని అనడానికి వాళ్లకు అధికారం లేదు. నా వయసింకా 34 ఏళ్లే. నేనింకా క్రికెట్లో కొనసాగాలనుకుంటున్నా. సవాళ్లు స్వీకరించడం నాకు కొత్తేమీ కాదు. నేనేంటో నాలుగో టెస్టులో నిరూపిస్తా అంటున్నాడు క్లార్క్. ఐతే ఈ మ్యాచ్ లోనూ క్లార్క్ విఫలమై, ఆస్ట్రేలియా ఓటమి పాలైతే అతడి పనైపోతుందడంలో ఎవరికీ సందేహాల్లేవు. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఇంగ్లాండ్ సొంతమవుతుంది. చివరి టెస్టు నామమాత్రమవుతుంది. కాబట్టి క్లార్క్ కు ఈ మ్యాచ్ అగ్ని పరీక్షే అని చెప్పాలి. ఐతే ప్రధాన బౌలర్ అండర్సన్ గాయంతో ఈ మ్యాచ్ కు దూరమవడం ఇంగ్లాండ్ ను కలవరపెడుతోంది. ఈ బలహీనత మీద దెబ్బ కొట్టి నాలుగో టెస్టును గెలుచుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది.