అశ్విన్ పోయి అశ్వని వచ్చె.. ముంబై నుంచి మరో వండర్
సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబైని గెలిపించాడు కొత్త కుర్రాడు అశ్వనికుమార్.
By: Tupaki Desk | 1 April 2025 4:30 PMస్పిన్ బౌలింగ్ లో 15 ఏళ్లపాటు టీమ్ ఇండియాకు సేవలందించిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత ఏడాది చివరలో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టెస్టుల్లో 500 పైగా వికెట్లు తీసిన అశ్విన్ మరొక ఏడాది, రెండేళ్లయినా ఆడతాడని అనుకుంటే ముందై రిటైరయ్యాడు. ఎలాగూ టి20లు, వన్డేలకు అతడు పరిగణనలో లేడు కాబట్టి ఇప్పుడు తీరికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడుకుంటున్నాడు. కాగా, ఇప్పుడు ఇదే లీగ్ లో అతడి పేరునే పోలిన కుర్రాడు దూసుకొచ్చాడు.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అంటేనే టాలెంట్ ను పరిచయం చేసే ఫ్యాక్టరీ. అంబటి రాయుడు, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, వంటివారిని టీమ్ ఇండియాకు అందించింది. మొన్నటికి మొన్న విఘ్నేష్ పుత్తూర్ వంటి టాలెంటెడ్ లెగ్ స్పిన్నర్ ను పరిచయం చేసింది. ఇప్పుడు మరో యువ కెరటం ముంబై తరఫున మెరిశాడు.
సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబైని గెలిపించాడు కొత్త కుర్రాడు అశ్వనికుమార్. తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే 4 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్ గా, తొలి బంతికే వికెట్ తీసిన బౌలర్, తొలి మ్యాచ్ లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన వాడిగా రికార్డులు సృష్టించాడు అశ్వనికుమార్.
ఎంతకీ ఎవరీ కుర్రాడు అంటే.. పంజాబ్ లోని మొహాలికి చెందినవాడు. కోల్ కతాతో మ్యాచ్ లో మూడు ఓవర్లు వేసి.. 24 పరుగులకు 4 వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ గత ఏడాది వేలంలో ఇతడిని రూ.30 లక్షలకు తీసుకుంది.
నిరుడు షేర్-ఎ-పంజాబ్ టి20 టోర్నీలో అశ్వని రాణించడంతో ముంబై ఇండియన్స్ దృష్టిలో పడ్డాడు.
ఎడమచేతి వాటం పేసర్ అయిన 23 ఏళ్ల అశ్వని కుమార్.. డెత్ ఓవర్ల బౌలింగ్ లో స్పెషలిస్ట్. వాస్తవానికి నిరుడు ఇతడు పంజాబ్ కింగ్స్ జట్టుతో ఉన్నాడు. అయితే మ్యాచ్ ఆడే చాన్స్ రాలేదు. 2022 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ కు నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు నేరగా ముంబై ఇండియన్స్ కు ఆడుతూ తొలి మ్యాచ్ లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. కాగా, ఇంతచేసి అశ్వని కుమార్ అనుభవం రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లే కావడం గమనార్హం.
ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా (గాయం నుంచి తిరిగొస్తే) వంటి మేటి పేస్ బౌలర్లతో బంతిని పంచుకోవడం అశ్వనికి ఎంతో మేలు చేయనుంది. ఇదే నిలకడ కొనసాగిస్తే అశ్వనికి మంచి భవిష్యత్ ఉంటుంది.