Begin typing your search above and press return to search.

20 కోట్లు.. ఐపీఎల్ వేలంలో టీమిండియా సూపర్ స్టార్ రేటు ఇది!

ఇప్పటివరకు టైటిల్ కొట్టని రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) సహా ఏ జట్టూ రోహిత్ ను విడిచిపెట్టదు. లక్నో, ఢిల్లీ కూడా రోహిత్ పై గట్టిగా కన్నేశాయట. దీంతో అతడికి రూ.20 కోట్ల రేటు దక్కుతుందని అంటున్నాడు అశ్విన్.

By:  Tupaki Desk   |   15 Oct 2024 11:30 PM GMT
20 కోట్లు.. ఐపీఎల్ వేలంలో టీమిండియా సూపర్ స్టార్ రేటు ఇది!
X

గత సీజన్ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ ఆటగాడికి రూ.20 కోట్లు పెడతారా...? అనే సందేహాలుండేవి. కానీ, నిరుడు జరిగిన మినీ వేలంలో అవన్నీ పటాపంచలయ్యాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కు రూ.20 కోట్లు ఇచ్చి కెప్టెన్ ను చేయగా.. తానేమీ తక్కువ తినలేదంటూ కోల్ కతా నైట్ రైడర్స్ రూ.25 కోట్ల వరకు పెట్టి ఆస్ట్రేలియాకే చెందిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ను సొంతం చేసుకుంది. మరి భారతీయ ఆటగాళ్లలో ఎవరికీ ఇంత ధర దక్కదా?..

అతడికే ఆ రేటు..

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లోనూ కెరీర్ చివరకు వచ్చేశాడు. విరాట్ కోహ్లి టి20 ఫార్మాట్ జోష్ తగ్గింది.. యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ ఇంకా రూ.20 కోట్ల స్థాయికి రాలేదు. మరి భారత క్రికెటర్లలో రూ.20 కోట్లు ఐపీఎల్ రేటు పొందగలది ఎవరు..? ఈ ప్రశ్నకు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సమాధానం చెప్పాడు. కాగా, ఐపీఎల్‌ 2025 మెగా వేలం వచ్చే నెలలో జరగనుంది. ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు బీసీసీఐ అనుమతిచ్చింది. ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఆప్షన్ కూడా ఇందులో ఉంది. అయితే, ఏ ప్రాంచైజీ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని మెగా వేలానికి వదిలేస్తుంది? అనేది తేలాల్సి ఉంది. ముంబైకి అత్యధికంగా ఐదు టైటిళ్లు అందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను గత సీజన్ లో అవమానకరంగా తప్పించారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో అందరి చూపూ ఇప్పుడు రోహిత్ వైపే ఉంది.

టి20 ప్రపంచ కప్ చాంపియన్ రోహిత్ సారథ్యంలో నిరుడు వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓడినా ఈ ఏడాది టి20 ప్రపంచ కప్ గెలుచుకుంది టీమ్ ఇండియా. ఇప్పటికీ రోహిత్ లో దూకుడు ఏమాత్రం తగ్గలేదు. టెస్టుల్లోనూ టి20 తరహాలో ఆడుతున్నాడు. పైగా ముంబై ఈ ఏడాది అతడిని వేలానికి వదిలేస్తుందనే టాక్ నడుస్తోంది. అదే జరిగితే వేలంలో హిట్‌ మ్యాన్ పేరు నమోదు చేసుకుంటాడు. 13 ఏళ్ల అనుబంధాన్ని వీడి ముంబైకి బైబై చెప్పడం ఖాయం.

రోహిత్ ఆడేది ఆ జట్టుకే..?

రోహిత్ శర్మను వేలంలో వెర్రిగా వెంటపడి కొంటారనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు టైటిల్ కొట్టని రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) సహా ఏ జట్టూ రోహిత్ ను విడిచిపెట్టదు. లక్నో, ఢిల్లీ కూడా రోహిత్ పై గట్టిగా కన్నేశాయట. దీంతో అతడికి రూ.20 కోట్ల రేటు దక్కుతుందని అంటున్నాడు అశ్విన్. వాస్తవానికి రోహిత్ కు ఇంతకుమించి దక్కినా ఆశ్చర్యం లేదు. రూ.25 కోట్లు పైగా వెచ్చించినా ఆశ్చర్యం లేదు.