Begin typing your search above and press return to search.

జాతీయ భాష హిందీ కాదు.. దుమారం రేపిన 'తమిళ' అశ్విన్!

బలవంతంగా హిందీని తమ మీద రుద్దొద్దంటూ వీధుల్లోకి వచ్చి మరీ ఆందోళనలకు దిగుతుంటారు.

By:  Tupaki Desk   |   10 Jan 2025 8:38 AM GMT
జాతీయ భాష హిందీ కాదు.. దుమారం రేపిన తమిళ అశ్విన్!
X

'హిందీ వ్యతిరేక ఉద్యమం'.. దీని గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా తమిళుల పాత్రనే గుర్తుకొస్తుంది. సొంత భాష తమిళం అంటే ప్రాణం పెట్టే తమిళులు.. హిందీని జాతీయ భాష అంటే అస్సలు ఒప్పుకోరు. బలవంతంగా హిందీని తమ మీద రుద్దొద్దంటూ వీధుల్లోకి వచ్చి మరీ ఆందోళనలకు దిగుతుంటారు. ఇప్పుడు మరోసారి హిందీ వ్యతిరేకత అంశం బయటపడింది. అయితే, ఈసారి దానికి కారణమైంది టీమ్ ఇండియాకు 15 ఏళ్లు ఆడిన దిగ్గజ క్రికెటర్ కావడం గమనార్హం.

ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) మూడో టెస్టు అనంతరం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి వార్తల్లో నిలిచారు అశ్విన్. ఆ వెంటనే జట్టు గురించి కాస్త వివాదాస్పద ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ భార్య రితిక ఫేక్ ఖాతాకు రెస్పాండ్ అయి నాలుక కర్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి హిందీ జాతీయ భాష కాదు అంటూ వివాదంలో చిక్కాడు. హిందీ కేవలం అధికారిక భాష మాత్రమే అంటూ అశ్విన్‌ అభివర్ణించాడు. ఈ మేరకు అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అశ్విన్ వ్యాఖ్యలు చేసింది కూడా సాధారణ ట్వీట్ ద్వారానో.. మీడియా ఎదుటనో కాదు.. కళాశాల ప్రోగ్రాంకు వెళ్లిన అతడు హిందీ భాష గురించి మాట్లాడడం గమనార్హం. అదికూడా తన సొంత నగరం చెన్నైలో.

ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీ యానివర్సరీకి అశ్విన్‌ ముఖ్య అతిథిగా వెళ్లాడు. కొంతసేపు విద్యార్థులతో ముచ్చటించాడు. ఇంగ్లిష్‌, తమిళం, హిందీ మీలో ఎంతమందికి అర్థమవుతాయని అడగడం గమనార్హం. హిందీపై కొందరినుంచే సమాధానం వచ్చింది. దీనిపై స్పందిస్తూ.. మీకో విషయం చెప్పాలి. హిందీ అధికారిక భాష మాత్రమే. జాతీయ భాష కాదు అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

హిందీ అంటేనే నిలువెల్లా వ్యతిరేకత కనబరిచే తమిళనాడు గడ్డపై నుంచే అశ్విన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మున్ముందు చర్చనీయంగా మారడం ఖాయం. పైగా హిందీని మాపై రుద్దొద్దు అనేది తమిళుల నినాదం. అందుకే నీట్ ను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు దీనికి మరింత నిప్పు రాజేశాడు అశ్విన్.