Begin typing your search above and press return to search.

అశ్విన్ రిటైర్మెంట్ సరే.. అతడిని భర్తీ చేసే వారసుడు ఎవరు..?

ఈ విషయంలో సత్తా ఉన్నవాడిగా కనిపిస్తున్నాడు కుర్రాడు వాషింగ్టన్ సుందర్.

By:  Tupaki Desk   |   18 Dec 2024 8:30 PM GMT
అశ్విన్ రిటైర్మెంట్ సరే.. అతడిని భర్తీ చేసే వారసుడు ఎవరు..?
X

15 ఏళ్ల కెరీర్.. 106 టెస్టులు.. 500 పైగా వికెట్లు.. అన్నిటికీ మించి తెలివైన క్రికెటర్.. బ్యాటింగ్ లోనూ రాణిస్తూ తన ప్రత్యేకత చాటాడు.. ఆరు సెంచరీల సాయంతో టెస్టుల్లో 3,503 పరుగులు, వన్డేల్లో 707 పరుగులు.. ఇవీ టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఘనతలు. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ తో సిరీస్ లో బ్యాటింగ్ కుప్పకూలగా అశ్విన్ సెంచరీతో జట్టును నిలబెట్టాడు. అలాంటి ఆల్ రౌండర్ ఇప్పుడు రిటైరయ్యాడు. ఆస్ట్రేలియాతో గులాబీ (రెండో) టెస్టులో ఆడిన అతడు.. మూడో టెస్టుకు జట్టులో లేడు. అయితే, ఉన్నట్లుండి రిటైర్మెంట్ ప్రకటించి.. భారత్ కు వచ్చేస్తున్నాడు.

ఇకమీదట ఎవరిదో భారం..?

2010 నుంచి అశ్విన్ భారత టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడు. 106 టెస్టులు ఆడిన అతడు.. కష్ట కాలంలో ఎలాంటి బంతులు వేయాలో తెలిసినవాడు. ముఖ్యంగా స్వదేశంలో అశ్విన్ ను ఎదుర్కొనడం ఎంతటి జట్టుకైనా కష్టమే. మరిప్పుడు అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు..? అంతేకాదు.. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా కెరీర్ చరమాంకానికి వచ్చేశాడు. అతడు ఇప్పటికే టి20ల నుంచి తప్పుకొన్నాడు. వన్డేలకు సెలక్ట్ చేయడం కష్టమే అన్నట్లుంది.

వారసుడు అతడేనా?

అశ్విన్ వారసత్వం అందుకోవడం మామూలు మాటలు కాదు. అటు బ్యాట్ తోనూ రాణించగలిగితేనే అతడి స్థానాన్ని భర్తీ చేయగలరు. ఈ విషయంలో సత్తా ఉన్నవాడిగా కనిపిస్తున్నాడు కుర్రాడు వాషింగ్టన్ సుందర్. ఇప్పటికే టి20లు, వన్డేల్లో తన సత్తా నిరూపించుకున్న సుందర్.. అశ్విన్ సొంత రాష్ట్రం తమిళనాడుకు చెందినవాడు. 17 ఏళ్ల వయసుకే టీమ్ ఇండియాలో సభ్యుడైన సుందర్ కొన్ని కారణాల వల్ల రెగ్యులర్ సభ్యుడు కాలేదు. అయితే, అశ్విన్ లానే ఆఫ్ స్పిన్నర్ కావడంతో ఇప్పుడు సుందర్ ను రెగ్యులర్ గా తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ కు సుందర్ ను కూడా తీసుకెళ్లారు. తొలి టెస్టులో అశ్విన్ స్థానంలో అతడినే ఆడించారు కూడా. సుందర్ ను పక్కనపెట్టి రెండో టెస్టులో అశ్విన్ ను ఆడించారు. వీరిద్దరినీ కాదని మూడో టెస్టులో జడేజాను తీసుకున్నారు.

సుందర్ ఇక రెగ్యులర్ ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసేందుకు జట్టులో ఆఫ్ స్పిన్నర్ ఉండాలి. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి జట్టుపై. అందుకని సుందర్ ను రెగ్యులర్ గా ఆడించే చాన్సుంది. ఇతడికంటే ప్రస్తుతం మెరుగైన ఆఫ్ స్పిన్నర్ దేశంలో ఎవరూ లేరు. అందుకని సుందర్ కు మంచి భవిష్యత్ ఉందని చెప్పొచ్చు.