ఆసియా ఫైనల్.. 20 ఏళ్ల ఆ మిస్టరీ ప్లేయర్ తోనే భారత్ కు ముప్పు
కానీ, టీమిండియాకు అసలు ముప్పు ఓ 20 ఏళ్ల కుర్రాడి నుంచి పొంచి ఉంది. సూపర్ 4 దశలో మన జట్టను దాదాపు ఓడించినంత పని చేశాడా ప్లేయర్.
By: Tupaki Desk | 15 Sep 2023 12:30 PM GMTఅభిమానుల అంచనానో.. ఆటగాళ్ల గాయాలో పాకిస్థాన్ ను దెబ్బతీశాయి. అందరూ అనుకున్నట్లే శ్రీలంక ఆసియా కప్ ఫైనల్ కు చేరింది. ఇక ఆదివారం భారత్ తో అమీతుమీ తేల్చుకోనుంది. కానీ, టీమిండియాకు అసలు ముప్పు ఓ 20 ఏళ్ల కుర్రాడి నుంచి పొంచి ఉంది. సూపర్ 4 దశలో మన జట్టను దాదాపు ఓడించినంత పని చేశాడా ప్లేయర్. అందుకే టీమిండియా బ్యాట్స్ మన్ అతడిపై ఓ కన్నేసి ఉండడం ఉత్తమం.
అప్పట్లో అజంతా
దశాబ్దాలుగా టీమిండియా బ్యాట్స్ మన్ స్పిన్ ను ఆడడంలో తలపండినవారు. అలాంటివారిని చుట్టచుట్టేశాడు అజంతా మెండిస్ అనే కుర్రాడు. ఇదంతా 2008లో జరిగింది. అయితే, అతడి మిస్టరీని త్వరగానే ఛేదించిన టీమిండియా ఇక ఎప్పటికీ పైచేయి సాధించనీయలేదు. కాగా, ఆసియా కప్ సూపర్-4 దశలోనూ ఓ లంక స్పిన్నర్ భారత్ ను వణికించాడు. దాదాపు ఒంటిచేత్తో ఓడించినంత పనిచేశాడు. ఇదంతా దునిత్ వెల్లలాగే గురించే.
20 ఏళ్లకే ఎంతో పరిణతి
వెల్లలాగే వయసు 20 ఏళ్లే. ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న అతడు మున్ముందు సుదీర్ఘ కాలం లంకకు ప్రాతినిధ్యం వహిస్తాడనే అంచనాలున్నాయి. వాస్తవానికి ఆసియా కప్ ప్రాథమిక జట్టులో వెల్లలాగే లేడు. ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపికైన అతడు ఇప్పుడు మ్యాచ్ విన్నరయ్యాడు. దీనికిముందు అతడు ఆడింది తొమ్మిది వన్డేలు, ఒక టెస్టు. వాటిలో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ, అండర్-19 స్థాయిలో సంచలన ప్రదర్శన చేశాడు. ఆసియా కప్ నకు ముందు స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ గాయపడడం వెల్లలాగేకు కలిసొచ్చింది. చివరకు తుది జట్టులోనూ అవకాశం దక్కించుకున్నాడు.
భారత టాపార్డర్ ను కూల్చి..
ఆసియా కప్ లీగ్ దశలో అఫ్గానిస్థాన్ పై వెల్లలాగే 33 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతోనే లంక సూపర్ 4 దశకు చేరగలిగింది. ఇక సూపర్ 4లో భారత టాపార్డర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్ మన్ గిల్ తో పాటు కేఎల్ రాహుల్ నూ ఔట్ చేశాడు. పిచ్ నుంచి అందుతున్న సహకారానికి మించి రాణించాడు. అనంతరం బ్యాటింగ్ లోనూ విలువైన పరుగులు చేసి భారత్ ను ఓడించినంత పనిచేశాడు. వస్తూనే స్లాగ్ స్వీప్ తో సిక్స్ కొట్టిన అతడు టీమిండియాను కంగారుపెట్టాడు. అయితే, మరో ఎండ్ లో ఆటగాళ్లు ఔటవడంతో జట్టును గెలిపించలేకపోయాడు. కాగా, వెల్లలాగె నిరుడు జనవరి-ఫిబ్రవరి నెలల్లో జరిగిన టీ20 ప్రపంచకప్‌తో బయటి ప్రపంచానికి తెలిశాడు. అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసి ప్రపంచ కప్‌లో ఆడాడు. 17 వికెట్లు తీయడమే కాక.. 264 పరుగులు చేసి ఉత్తమ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు.