Begin typing your search above and press return to search.

ఔరా.. ఒక్క మ్యాచూ ఆడకుండానే ఆసియా జట్టు కెప్టెన్

ప్రపంచ స్థాయిలో వీటికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. కామన్వెల్త్ క్రీడలు ఒకప్పటి బ్రిటీష్ పాలనలో ఉన్న దేశాలకు ప్రత్యేకించినవి

By:  Tupaki Desk   |   25 Aug 2023 7:40 AM GMT
ఔరా.. ఒక్క మ్యాచూ ఆడకుండానే ఆసియా జట్టు కెప్టెన్
X

ఒలింపిక్స్.. కామన్వెల్త్.. ఆసియా క్రీడలు.. ఇవీ అంతర్జాతీయ క్రీడా టోర్నీలు. టీం ప్రదర్శనలతో పాటు వ్యక్తిగత ప్రతిభకూ చోటుండే టోర్నీలివి. ప్రపంచ స్థాయిలో వీటికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. కామన్వెల్త్ క్రీడలు ఒకప్పటి బ్రిటీష్ పాలనలో ఉన్న దేశాలకు ప్రత్యేకించినవి. ఒలింపిక్స్ విశ్వ క్రీడలు. ఏషియన్ గేమ్స్ గా వ్యవహరించే ఆసియా క్రీడలు ఆసియా ఖండంలోని దేశాలకు సంబంధించినవి. కాగా, వీటిలో క్రికెట్ కు చాన్స్ లేదు. 1998 కామన్వెల్త్ క్రీడల్లో తప్ప ఇప్పటివరకు పురుషుల క్రికెట్ లేదు. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టినప్పటికీ మహిళా జట్లకే అవకాశం ఇచ్చారు. ఇక వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఒలింపిక్స్ లో ఇంకా క్రికెట్ కు చాన్సే లేదు.

ఈసారి చైనాలో..

2010 (గ్వాంగ్జూ), 2014 (ఇంచియాన్) ఆసియా క్రీడల్లో క్రికెట్ కు స్థానం కల్పించారు. 2018 ఆసియా కప్ లో మాత్రం క్రికెట్ లేదు. కాగా,చైనా వేదికగా వచ్చే నెల 23 నుంచి ఆసియా క్రీడలు జరగనున్నాయి. దీంట్లో క్రికెట్ కూడా ఉంది. సరిగ్గా నెల రోజుల్లో ప్రారంభం కానున్న టోర్నీకి అన్ని దేశాలు 15 మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాయి. అలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా వెల్లడించింది. అయితే, ఇక్కడే విశేషం దాగుంది. ఆ జట్టుకు ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఖాసిం అక్రమ్ సారథ్యం వహించనున్నాడు. అక్టోబరు 8 వరకు జరిగే ఆసియా క్రీడల్లో అతడు పాక్ జట్టును నడిపిస్తాడు.

20 ఏళ్లు.. అండర్ 19 కెప్టెన్..

అక్రమ్ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడకుండా పాకిస్థాన్ వంటి జట్టుకు కెప్టెన్ ఎలా అయ్యాడు..? అంటే అతడేమీ ఆషామాషీ క్రికెటర్ కాదు. 20 ఏళ్ల ఖాసీం.. దేశీవాళీ క్రికెట్ లో మెరుగ్గా రాణించాడు. సెంట్రల్ పంజాబ్ కు ఆడే అతడు.. 20 మ్యాచ్ లలో 27 వికెట్లు తీయడంతో పాటు 960 పరుగులు సాధించాడు. లిస్ట్ -ఏ క్రికెట్ లో 45 మ్యాచ్ లు ఆడి 35.27 సగటుతో 1305 పరుగులు చేశాడు. అంతేకాదు.. ఖాసీం.. 2021-22 అండర్ 19 ప్రపంచ కప్ లో పాక్ జట్టు కెప్టెన్. అతడి నాయకత్వ లక్షణాలను చూసే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకున్నా కెప్టెన్సీ ఇచ్చారు.

ఇక అండర్ 19 ప్రపంచ కప్ లో కెప్టెన్ గానే కాక వ్యక్తిగతంగానూ మంచి ప్రదర్శన చేశాడు. వర్ధమాన జట్ల (ఎమర్జింగ్ టీమ్స్) ఆసియా కప్ -23లో పాక్ విజేతగా నిలవడంలో ఖాసీంది కీలక పాత్ర. ఇటీవల శ్రీలంక, ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ –ఎ జట్టు తరపున అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ఆసియా క్రీడల జట్టు పగ్గాలు దక్కాయి. కాగా, అరాఫత్ మిన్హాస్, మీర్జా తాహిర్ బేగ్ , సుఫియాన్ ముఖీం, రోహైల్ నజీర్, ఓమైర్ బిన్ యూసుఫ్, మొహమ్మద్ అఖ్లాక్ వంటి వారికి తొలిసారి జాతీయ జట్టులోకి పిలుపు దక్కింది. అయితే, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, షానవాజ్ దహానీ, మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాదిర్ వంటి సీనియర్లకూ చోటుదక్కింది.

టీమిండియా కెప్టెన్ ఎవరో తెలుసా?

ఆసియా క్రీడలకు భారత్ సైతం ద్వితీయ శ్రేణి జట్టునే పంపుతోంది. దీనికి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్. అంతర్జాతీయ స్థాయిలో 11 టి20లు, 2 వన్డేలు ఆడిన రుతురాజ్ ను తిలక్ వర్మ, జైశ్వాల్, దూబె, రాహుల్ త్రిపాఠి వంటి యువకులతో కూడిన జట్టుకు సారథిగా ఎంపిక చేశారు. మిగతా జట్లు కూడా ఇలానే ద్వితీయ శ్రేణి, యువకులతో కూడిన ఆటగాళ్లకు ఆసియా క్రీడలకు పంపనున్నాయి. దీనికి పెద్ద కారణమే ఉంది. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనుంది. దీనికి ముందుగా ఈ నెల ఆఖరు నుంచి ఆసియా కప్ జరగనుంది. అందుకనే ఆసియా క్రీడలకు జట్లన్నీ ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను ఎంపిక చేశాయి.