బాక్సింగ్ డే టెస్టు.. ‘కంగారూ’ దూరింది.. తోక మిగిలింది..
101 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ కు దిగిన కంగారూలను టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారనే చెప్పాలి.
By: Tupaki Desk | 29 Dec 2024 12:14 PM GMT‘ఏనుగు దూరింది.. కానీ, తోకే మిగిలింది’.. అత్యంత క్లిష్టమైన సమస్య దాదాపు కొలిక్కివచ్చినట్లే వచ్చి.. చివరలో మిగిలిపోతే చెప్పుకొనే తెలుగు సామెత ఇది. దీనికి సరిగ్గా బోర్డర్-గావస్కర్ సిరీస్ లో భాగంగా మెల్ బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్టుకు (బాక్సింగ్ డే టెస్టు) వర్తింపజేస్తే ‘కంగారూ దూరింది.. తోక మిగిలింది’ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో వెనుకబడిన భారత జట్టు.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అసమాన సెంచరీతో బలంగా పుంజుకుంది. ఆస్ట్రేలియా కంటే అప్పటికీ తొలి ఇన్నింగ్స్ లో 101 పరుగులు వెనుకబడింది.
రెండో ఇన్నింగ్స్ లో బెంబేలెత్తించి..
101 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ కు దిగిన కంగారూలను టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారనే చెప్పాలి. 91 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు. కానీ, వన్ డౌన్ బ్యాటర్ లబుషేన్ (70), కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (41) ఏడో వికెట్ కు 57 పరుగు జోడించారు. ఈ తర్వాత వచ్చిన స్పిన్నర్ నాథన్ లయన్ (41 బ్యాటింగ్) మరింతగా విసిగించాడు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది.
300 పైగా టార్గెట్ కష్టమే..
ఆస్ట్రేలియాలోనే కాదు ఏ దేశంలోనైనా నాలుగో ఇన్నింగ్స్ లో 300 పైగా టార్గెట్ ఛేదించడం అంటే చాలా కష్టమే. ఆస్ట్రేలియా ఇప్పటికే 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. సోమవారం ఆటకు చివరి రోజు. మిగిలిన ఆ ఒక్క వికెట్ ను వెంటనే తీసినా.. 335 పరుగుల టార్గెట్ ఎదురవుతుంది.
సీనియర్లద్దరికీ సవాల్..
బాక్సింగ్ డే టెస్టులో భారత్ గెలుపు పక్కన పెడితే.. డ్రా చేసుకుంటే చాలు. స్వదేశంలో స్టార్క్, కమ్మిన్స్, బొలాండ్ లను ఎదుర్కొంటూ 330 పరుగులు చేయడం అంటే అసాధ్యమే. అయితే, టీమ్ ఇండియా గెలుపే లక్ష్యంగా ఆడితే వికెట్లు పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక సీనియర్ బ్యాటర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు సోమవారం అత్యంత కీలకం. కుర్రాడు జైశ్వాల్, మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ విఫలమైతే రోహిత్, కోహ్లినే జట్టును గట్టెక్కించాల్సి ఉంటుంది. ఈ ఇన్నింగ్స్ లోనూ విఫలమైతే వీరికి కష్టకాలమే అని చెప్పాలి.
మనోడు ఏం చేస్తాడో..?
ఆస్ట్రేలియాలో అనామకుడిగా అడుగుపెట్టినప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తూ బాక్సింగ్ డే టెస్టులో ఏకంగా సెంచరీ కొట్టాడు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో అతడు మళ్లీ బ్యాటింగ్ కు దిగితే ఏం చేస్తాడో చూడాలి.