Begin typing your search above and press return to search.

75 రోజులు భారత్ లోనే ఆ క్రికెట్ జట్టు.. అత్యంత అరుదు

టి20లు, వన్డేలు, టెస్టులు.. మూడు ఫార్మాట్లతో అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ కిక్కిరిస్తున్ రోజులివి. వీటికితోడు ప్రపంచ వ్యాప్తంగా లీగ్ లు

By:  Tupaki Desk   |   28 Sep 2023 3:30 PM GMT
75 రోజులు భారత్ లోనే ఆ క్రికెట్ జట్టు.. అత్యంత అరుదు
X

టి20లు, వన్డేలు, టెస్టులు.. మూడు ఫార్మాట్లతో అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ కిక్కిరిస్తున్ రోజులివి. వీటికితోడు ప్రపంచ వ్యాప్తంగా లీగ్ లు. భారత్ లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ దాదాపు రెండు నెలలు జరుగుతుంది. ఇక కరీబియన్ అని, బంగ్లా అని, పాక్ అని ఎక్కడంటే అక్కడ లీగ్ లు. దీంతోనే సగటు క్రికెటర్ కు సరిపోతుంది. చాలామంది ఆటగాళ్లు అలసిపోయి.. జాతీయ జట్ల నుంచి విరామం కోరుతున్నారు. కొందరైతే డబ్బులు ఎక్కువగా వచ్చే లీగ్ ల కోసం జాతీయ జట్లకు వీడ్కోలు పలికారు కూడా.

భారత్ కు క్రికెట్ పండుగే పండుగ

మొన్నటివరకు ఆసియా కప్.. నిన్నటివరకు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. ఇప్పుడు ఏసియన్ గేమ్స్.. సరిగ్గా వారం రోజుల్లో భారత్ ఏకైక వేదికగా వన్డే ప్రపంచ కప్ మహా సమరం. దీన్నిబట్టే భారత క్రికెట్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో తెలిసిపోతోంది. కాగా, టీమిండియా మూడు వేర్వేరు జట్లుగా ఎంపికయ్యేంతమంది ఆటగాళ్లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. లాంటి సౌలభ్యం అందరికీ ఉండదు. ఎందుకంటే భారత్, పాక్ మినహా క్రికెట్ ఆడే ప్రధాన దేశాల్లో దేంట్లోనూ జనాభా 50 కోట్లకు మించి లేదు.

ఆస్ట్రేలియా ఆసాంతం ఇక్కడే

ప్రపంచ క్రికెట్ లో బలమైన జట్టు ఆస్ట్రేలియా. బుధవారం ఆ జట్టు భారత్ తో మూడో వన్డే ఆడింది. ఈ సిరీస్ కోసం ఈ నెల 20న భారత్ కు వచ్చింది. అంతకుముందు దక్షిణాఫ్రికాతో ఏకంగా ఐదు వన్డేల సిరీస్ ఆడింది. అటునుంచి భారత్ లో కాలుపెట్టింది. మరోవైపు అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ కప్ నకు సన్నాహక మ్యాచ్ లు ఆడనుంది. శనివారం నెదర్లాండ్స్ తో ఒక మ్యాచ్, హైదరాబాద్ వేదికగా మంగళవారం పాకిస్థాన్ తో ఒక సన్నాహక మ్యాచ్ లో తలపడుతుంది.

ఆస్ట్రేలియా సెప్టెంబరు మొదట్లోనే దక్షిణాఫ్రికా వెళ్లింది. అటునుంచి భారత్ కు వచ్చింది. మూడు వన్డేల సిరీస్ లో తలపడింది. ప్రపంచ కప్ తర్వాత భారత్ తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కూడా ఆడనుంది. ఆ క్రమంలో నవంబరు 3న విశాఖపట్నంలో మొదటి టి20ని, డిసెంబరు 3న హైదరాబాద్ ఉప్పల్ చివరి టి20లో పాల్గొంటుంది. అంటే.. సెప్టెంబరు తొలినాళ్లలో మొదలైన ఆస్ట్రేలియా విదేశీ పర్యటన డిసెంబరు మొదటివారంతో ముగియనుంది.

భారత్ లో 75 రోజులు..

వన్డే సిరీస్, ప్రపంచ కప్, టి20 సిరీస్..వీటిలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా 75 రోజుల పాటు భారత్ లోనే ఉండనుంది. ఓ విధంగా ఇది రికార్డే అనుకోవచ్చు. ఓ అగ్రశ్రేణి జట్టు ఇన్ని రోజులు ఒక విదేశంలో ఉండడం అరుదేనని చెప్పవచ్చు. అంతేగాక దక్షిణాఫ్రికా టూర్ తో కలుపుకొని ఆసీస్ ఆటగాళ్లు మూడు నెలలు స్వదేశానికి దూరంగా ఉండనున్నారన్నమాట. కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్లో.. మానసికంగా దీనిని వారు ఎలా అధిగమిస్తారో చూడాలి.