బాల్ ట్యాంపరింగ్.. టీమ్ ఇండియా ఆటగాళ్లపై తీవ్ర ఆరోపణలు
యువ భారత ఆటగాళ్లపై ఆస్ట్రేలియా అంపైర్ క్రెయిగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్ చేశారన్నాడు.
By: Tupaki Desk | 3 Nov 2024 8:30 AM GMTఫిక్సింగ్ తర్వాత క్రికెట్ లో అత్యంత నేరం బాల్ ట్యాంపరింగ్ అనే చెప్పాలి. ఆరేళ్ల కిందట దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసిన ఈ తప్పునకు వారు కెరీర్ నే మూల్యంగా చెల్లించుకున్నారు. ఇప్పటి రోజుల్లో ట్యాంపరింగ్ వంటి మూర్ఖపు చర్యలకు ఎవరూ పాల్పడడం లేదు. కానీ.. ఏకంగా భారత ఆటగాళ్లపైనే ఈ ఆరోపణలు వచ్చాయి. అది కూడా ఆస్ట్రేలియా పర్యటనలో కావడం గమనార్హం.
ఇంతకూ ఏం జరిగింది..?
ఈ నెలలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఐదు టెస్టుల సిరీస్ లో ఆడనుంది. 32 ఏళ్ల తర్వాత ఐదు మ్యాచ్ ల సుదీర్ఘ సిరీస్ ఆడడం ఇప్పుడే. అయితే, దీనికి సన్నాహకంగా భారత్ ఏ జట్టుతో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడుతుంది. ఇందుకోసం భారత్ ఏ జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా వెళ్లింది. ఆ దేశ ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు జరిగింది. నాలుగో రోజు ఆదివారం 225 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 3 వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. కాగా, ఈ మ్యాచ్ లోనే బంతిపై రుద్దినట్లు కనిపించడంతో
యువ భారత ఆటగాళ్లపై ఆస్ట్రేలియా అంపైర్ క్రెయిగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్ చేశారన్నాడు.
అంపైర్ నోటి దురుసు.. కిషన్ గట్టి సమాధానం
అంపైర్ కు దీటుగా..
అంపైర్ వ్యాఖ్యలపై భారత ఏ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ఘాటుగా స్పందించాడు. మ్యాచ్ లో బంతిని మారుస్తూ అంపైర్ తీసుకున్న నిర్ణయాన్ని కిషన్ తప్పుబట్టాడు. ఈ పరిణామంతో మైదానంలోనే అంపైర్‌పై కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. అయితే, అటు అంపైర్ క్రెయిగ్, ఇటు కిషన్ పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలు స్టంప్స్ మైక్స్ లో రికార్డయ్యాయి. ఇక బంతిని మార్చడంపై భారత ఆటగాళ్లు ప్రశ్నిస్తున్న సమయంలో అంపైర్ స్పందిస్తూ.. 'పోయి ఆడండి. ఇక్కడేమీ చర్చలు జరగడం లేదు'' అని క్రెయిగ్ అన్నట్లు రికార్డైంది. కిషన్ కూడా 'మేం ఈ బంతితోనే ఆడాలా? మీ నిర్ణయం అత్యంత మూర్ఖత్వం' అంటూ తిప్పికొట్టాడు. అయితే, ఆ తర్వాతే అసలు ఆరోపణ చేశాడు క్రెయిగ్.
'మీ వల్లే బంతి పాడైంది. దానిని స్క్రాచ్ చేసింది నువ్వే (ఇషాన్ ను ఉద్దేశించి). అందుకే బంతిని మార్చాం. మీ కారణంగానే బంతి మార్పు జరిగింది' అంటూ అంపైర్ ఆరోపించాడు.
ట్యాంపరింగ్ నిజమైతే..
ఆస్ట్రేలియా పర్యటన అంటేనే అనేక వివాదాలు తలెత్తుతుంటాయి. అలాంటిది భారత ఎ జట్టు టూర్ లోనే ఆరోపణలు వచ్చాయి. ట్యాంపరింగ్ ఆరోపణలు నిజమైతే భారత ఏ ఆటగాళ్లపై వేటు పడే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైతే క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన లేదు.