4 విభాగాల్లో ఛాంప్.. కంగారూల అరుదైన రికార్డు.. మిగతా జట్లకు కష్టమే
క్రికెట్ అంటే వాళ్లదే రూలింగ్.. రెండు దశాబ్దాల కిందట అయితే ఆ జట్టు ఆటగాళ్లు మైదానంలో చూపే దూకుడుతోనే ప్రత్యర్థులు మానసికంగా ఇబ్బందిపడేవారు.
By: Tupaki Desk | 12 Feb 2024 1:30 PM GMTక్రికెట్ అంటే వాళ్లదే రూలింగ్.. రెండు దశాబ్దాల కిందట అయితే ఆ జట్టు ఆటగాళ్లు మైదానంలో చూపే దూకుడుతోనే ప్రత్యర్థులు మానసికంగా ఇబ్బందిపడేవారు. ఇక బంతితో, బ్యాట్ తో మెరుపు ఫీల్డింగ్ తో దూకుడైన ఆటకు వారు పెట్టింది పేరు. ఇటీవలి కాలంలో కాస్త వెనుకబడినా ఘనంగా పుంజుకున్నారు ఆ జట్టు ఆటగాళ్లు. వివాదాలు అన్నీ సమసిపోవడం, ఆటగాళ్లు గాడినపడడంతో ప్రపంచ చాంపియన్ గానూ బలంగా తిరిగొచ్చారు.
మొదట ఇది..
ఐదేళ్ల కిందట ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రధాన బ్యాటర్లు వార్నర్, స్మిత్ పై నిషేధం.. పేసర్లు స్టార్క్, కమ్మిన్స్ లో నిలకడ లోపం ఆ జట్టును వేధించింది. ఇలాంటి సమయంలో టిమ్ పైన్ లాంటి ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వక తప్పలేదు. ఆ సంధి సమయంలో ఎలాగోలా జట్టు గట్టెక్కింది. ఇప్పడు ఒకప్పటి ఆసీస్ జట్టు స్థాయిలో మెరుపులు మెరిపిస్తోంది. ఈ క్రమంలో 2021లో టి20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది ఆస్ట్రేలియా. పొట్టి ఫార్మాట్ లో వారికి ఇదే తొలి ప్రపంచ కప్. అప్పటినుంచి కంగారూలకు ఎదురేలేకుండా పోతోంది.
రెండోది ఇది..
ఆటగాళ్లందరూ ఫామ్ అందుకోవడంతో 2021 నుంచి ఆసీస్ మరింతగా పుంజుకుంది. ఇదే సమయంలో టిమ్ పైన్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు కమ్మిన్స్ కు రావడం జట్టుకు మేలు చేసింది. మేటి పేసర్ అయిన కమ్మిన్స్ జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. సారథ్యం భారం లేకపోవడంతో అటు బ్యాట్స్ మెన్ కూడా స్వేచ్ఛగా ఆడేందుకు వీలుచిక్కింది. ఈ క్రమంలోనే టెస్టు సిరీస్ లను నెగ్గతూ 2023 ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్ చేరింది. ఇంగ్లండ్ లో జరిగిన ఫైనల్లో భారత్ ను ఓడించి తమ పాత పట్టును చాటుకున్నారు.
మూడోది ఇది..
భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే ప్రపంచ కప్ ప్రారంభంలో ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్ లు ఓడింది. ఇందులో ఒకటి భారత్ చేతిలో. దీంతోనే కంగారూల పని అయిపోయింది అనే అభిప్రాయం ఏర్పడింది. కానీ, ఆ తర్వాత కాస్త ఇబ్బంది ఎదురైనా ఒక్క మ్యాచ్ లోనూ ఓడకుండా.. ఫైనల్ లో భారత్ ను ఓడించి మరీ టైటిల్ కొట్టేసింది కంగారూ జట్టు. వాస్తవానికి ఆ టోర్నీలో టీమిండియా అజేయంగా ఫైనల్ చేరింది. సొంతగడ్డపై ఫైనల్ ఆడింది. అయినా ఆసీస్ ఆటగాళ్లు తమదైన శైలిలో మ్యాచ్ ను భారత్ నుంచి లాగేసుకున్నారు.
నాలుగోది ఇది..
అండర్-19 ప్రపంచ కప్.. 35 ఏళ్లుగా జరుగుతున్న ఈ టోర్నీని ఇప్పటివరకు భారత్ ఐదుసార్లు గెలుచుకుంది. 1988, 2010లో తప్ప ఆస్ట్రేలియా మరెప్పుడూ గెలవలేదు. ఈ రెండు జట్లు ఎదురుపడితే భారత్ దే విజయం అనుకుంటారు. కానీ, చివరకు ఏం జరిగిందో అందరూ చూశారు. 14 ఏళ్ల తర్వాత అండర్ 19 టైటిల్ కరువును తీర్చుతూ ఆస్ట్రేలియా విజేతగా ఆవిర్భవించింది. సీనియర్ల టోర్నీలో భారత్ అజేయంగా ఫైనల్ చేరి ఆసీస్ చేతిలో భంగపడింది. జూనియర్ల టోర్నీలోనూ అదే సీన్.
ఇదీ రికార్డు
టెస్టు, వన్డే, టి20, అండర్ 19 ఇలా అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని విభాగాల్లోనూ చాంపియన్ గా నిలిచిన ఏకైక జట్టు ఆస్ట్రేలియానే. భారత్ సహా మరే దేశానికీ ఈ రికార్డు సాధ్యం కాలేదు. అంతేకాదు.. అండర్-19, వన్డే, టెస్టుల్లో ఏకకాలంలో ఆస్ట్రేలియానే చాంపియన్. కాగా, 2022 టి20 ప్రపంచ కప్ మిస్ అయింది కానీ.. లేదంటే ఏక కాలంలో నాలుగింటిలోనూ ఒకే సమయంలో ప్రపంచ విజేతగా ఉన్న అత్యంత అరుదైన రికార్డు కంగారూలకు లభించేది. ఇప్పటికైనా ఆసీస్ దే ప్రపంచ రికార్డు. భవిష్యత్ లో మరే జట్టూ దీనిని అధిగమించలేదేమో?