Begin typing your search above and press return to search.

9/10.. ఫామ్ లేమి.. రన్ రేట్.. కూర్పు.. కంగారూలకు కష్టమే

ప్రపంచ కప్ ను అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టు ఇప్పుడు అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది

By:  Tupaki Desk   |   13 Oct 2023 10:33 AM GMT
9/10.. ఫామ్ లేమి.. రన్ రేట్.. కూర్పు.. కంగారూలకు కష్టమే
X

ప్రపంచ కప్ ను అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టు ఇప్పుడు అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమితో ఆ జట్టుకు చావోరేవో అనే పరిస్థితులు తలెత్తాయి. కేవలం ఓటమి మాత్రమే అయితే పెద్దగా బాధపడాల్సిన పరిస్థితి లేదు. కానీ, ఓడిన తీరే చాలా ఇబ్బందికరంగా ఉంది. దీంతో ప్రపంచ కప్ లో ఆ జట్టు ముందంజ వేయాలంటే ఆ జట్టు ఇకనుంచి చాలా శ్రమించాల్సి ఉంది.

వన్డే ప్రపంచ కప్ ను అత్యధిక సార్లు గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు మంచి అంచనాలతోనే భారత్ లో ప్రపంచ కప్ నకు వచ్చింది. కానీ, వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమితో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. తొలుత భారత్ తో జరిగిన మ్యాచ్ లో పట్టు సాధించినట్లే కనిపించినా.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ల అద్భుత బ్యాటింగ్ తో వెనుకబడిపోయింది. దక్షిణాఫ్రికాతో గురువారం నాటి మ్యాచ్ లో పుంజుకుంటుందని భావిస్తే మరింత ఘోరంగా ఓడింది.

పదిలో ఏడు ఓటములు..

ప్రపంచ కప్ నకు ముందు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాలో పర్యటించింది. మొదటి రెండు వన్డేలను అలవోకగా గెలిచినా.. వరుసగా మూడు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయింది. ఆ వెంటనే భారత్ కు వచ్చి వన్డే సిరీస్ ఆడి 2-1తో పరాజయం పాలైంది. భారత్ తో ప్రాక్టీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే, ప్రపంచ కప్ లో తొలి రెండు మ్యాచ్ లలోనూ ఓటమి ఎదుర్కొనడంతో ఆ జట్టు గత పది అంతర్జాతీయ మ్యాచ్ లలో ఏడింటిలో ఓడిందన్నమాట.

రన్ రేట్ లేదు

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఆస్ట్రేలియా ప్రదర్శన పేలవం. మొదట బౌలింగ్ లో ధారాళంగా (311) పరుగులిచ్చిన కంగారూలు బ్యాటింగ్ లో పూర్తిగా తేలిపోయారు. 134 పరుగుల భారీ తేడాతో పరాజయం ఎదుర్కొన్నారు. వారి ఇన్నింగ్స్ 40.5 ఓవర్లే సాగింది. దీన్నిబట్టే ఆసీస్ ఇఫ్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో స్పష్టమవుతోంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ ఇప్పుడు -1.846 అంటే నమ్ముతారా? దీంతోపాటు మొత్తం పది జట్లు పాల్గొంటున్న టోర్నీలో నెదర్లాండ్స్ తర్వాత తొమ్మిదో స్థానంలో ఉంది.

ఎన్నడూ లేనంతగా

ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా చాలా బలహీనంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. కూర్పు. దూకుడుగా ఆడుతూ ఓపెనర్ గా నిలకడగా రాణిస్తున్న ట్రావిస్ హెడ్ గాయపడ్డాడు. పూర్తిగా గాయం తగ్గకున్నప్పటికీ.. అతడిని జట్టుతో పాటు తీసుకొచ్చారు. దీంతో మొత్తం జట్టు కూర్పే దెబ్బతిన్నది. ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ను ఓపెనర్ గా పంపాల్సి వస్తోంది. మొన్నటివరకు మంచి ఫామ్ లో ఉన్న అతడు.. కీలక సమయంలో విఫలమవుతున్నాడు. బౌలింగ్ లో కెప్టెన్ కమ్మిన్స్ ప్రభావం చూపలేకపోతున్నాడు. సీనియర్ ఓపెనర్ వార్నర్ రాణిస్తున్నా అది సరిపోవడం లేదు. స్మిత్ పెద్ద స్కోర్లు చేయడం లేదు. కేవలం లబుషేన్ మాత్రమే పరుగులు చేస్తున్నాడు. మరో ప్రధాన లోపం ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ వైఫల్యం. బంతితో ఫర్వాలేదని అనిపిస్తున్నా.. బ్యాట్ తో పరుగులు చేయడం లేదు. పేస్ ఆల్ రౌండర్లు స్టొయినిస్, గ్రీన్ లదీ ఇదే కథ.

ఇక ప్రతి మ్యాచ్ కీలకమే

ఆస్ట్రేలియా మరో ఏడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వాటిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లున్నాయి. ఈ రెండింటిలో కనీసం ఒకదానిపైన అయినా నెగ్గాలి. మరోవైపు మిగతా ఐదు మ్యాచ్ లలో విజయం తప్పనిసరి. అప్పటికీ 12 పాయింట్లే ఖాతాలో ఉంటాయి. కాగా, ప్రపంచ కప్ లో ఒక్కో జట్టు 9 మ్యాచ్ లు ఆడుతున్న సంగతి తెలిసిందే. అంటే.. 18 పాయింట్లు. వీటిలో టాప్-4 జట్లు సెమీస్ కు చేరతాయి. 14 పాయింట్లు అయినా సాధిస్తేనే సెమీస్ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆసీస్ కు ప్రతి మ్యాచ్ చావోరేవోనే..?