Begin typing your search above and press return to search.

9 మందితో ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్.. సెలక్టర్, హెడ్ కోచ్ కూడా మైదానంలోకి

ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్, స్టార్క్ (కేకేఆర్), గ్రీన్, మ్యాక్స్ వెల్ (బెంగళూరు), స్టోయినిస్ (లఖ్ నవూ సూపర్ జెయింట్స్) ఇంకా భారత్ నుంచి ఇంకా అమెరికా చేరలేదు.

By:  Tupaki Desk   |   30 May 2024 2:00 PM GMT
9 మందితో ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్.. సెలక్టర్, హెడ్ కోచ్ కూడా మైదానంలోకి
X

అమెరికా, కరీబియన్ దీవులు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న, జూన్ 2 నుంచి జరగున్న టి20 ప్రపంచ కప్ నకు ప్రస్తుతం అన్ని జట్లూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. వివిధ జట్లతో మ్యాచ్ లు ఆడుతున్నాయి. టీమిండియా జూన్ 1న బంగ్లాదేశ్ తో సన్నాహక మ్యాచ్ లో పాల్గొననుంది. అయితే, ఇప్పటికే అమెరికా చేరిన కొన్ని జట్లు ఒకటీ, రెండు మ్యాచ్ లు కూడా ఆడేశాయి. అయితే, ఓ టీమ్ కు మాత్రం విచిత్రమైన అనుభూతి ఎదురైంది. మైదానంలోకి దిగడానికి కనీసం 11 మంది కూడా లేరు. ఇదేదో చిన్న జట్టు కాదు. ప్రపంచ టాప్ టీమ్ కావడం గమనార్హం.

భారత్ లోనే ఆరుగురు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గత ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆస్ట్రేలియా పేసర్లు స్టార్క్ (కోల్ కతా నైట్ రైడర్స్), ప్యాట్ కమ్మిన్స్ (సన్ రైజర్స్ హైదరాబాద్) ఉన్న జట్లు ఫైనల్ కు చేరాయి. వీరేకాక ప్లేఆఫ్స్ ఆడిన గ్లెన్ మ్యాక్స్ వెల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) తదితర ఆరుగురు ఆటగాళ్లూ భారత్ లోనే ఉండిపోయారు. వీరంతా 15 మంది ప్రపంచ కప్ ఆస్ట్రేలియా జట్టులో సభ్యులు. దీంతో రెండు రోజుల కిందట నమీబియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు 9 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉన్నారు.

హెడ్ కోచ్, సెలక్టరూ గ్రౌండ్ లోకి నమీబియాతో ప్రాక్టీస్ మ్యాచ్ లో చేసేదేం లేక ఆస్ట్రేలియా ఓ దశలో నలుగురు సబ్ స్టిట్యూట్ లతో బరిలో దిగింది. వీరు హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్, అసిస్టెంట్ కోచ్ లు బ్రాడ్ హడ్జ్, ఆండ్రూ బొరొవెక్ (ఫీల్డింగ్ కోచ్), జాతీయ సెలక్టర్ జార్జ్ బెయిలీ కావడం గమనార్హం. ఆట మొదలైనపుడు బొరెవెక్, బెయిలీ ఫస్ట్ చాయిస్ సబ్ స్టిట్యూట్ లుగా ఉన్నారు.

హెడ్, స్టార్క్, కమ్మిన్స్ అంతా భారత్ లోనే సన్ రైజర్స్ తరఫున ఇటీవల ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్, స్టార్క్ (కేకేఆర్), గ్రీన్, మ్యాక్స్ వెల్ (బెంగళూరు), స్టోయినిస్ (లఖ్ నవూ సూపర్ జెయింట్స్) ఇంకా భారత్ నుంచి ఇంకా అమెరికా చేరలేదు. కాగా, ఆస్ట్రేలియా గురువారం వెస్టిండీస్ తో వామప్ మ్యాచ్ ఆడనుంది. మిచెల్ మార్ష్ సారథ్యంలో కంగారూ జట్టు ఈసారి ప్రపంచ కప్ వేటను మొదలుపెట్టనుంది.

నమీబియాతో మ్యాచ్ లో తొలుత బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా ప్రత్యర్థిని 20 ఓవర్లలో 119/9తో కట్టడి చేసింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 21 బంతుల్లో 54 నాటౌట్ రాణించడంతో 10 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది.