పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూం లో దబిడి దిబిడి!
కెప్టెన్ రియాక్షన్ అలా ఉంటే... మరోపక్క ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మేనేజ్‌మెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
By: Tupaki Desk | 16 Sep 2023 5:03 PM GMTఆసియా కప్ - 2023 ను గెలిచి ప్రపంచ కప్ ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావించిన పాకిస్థాన్ ఆశలకు శ్రీలంక బ్రేక్ వేసింది. సూపర్ - 4లో కీలకమైన పోరులో పాకిస్థాన్ ను ఓడించి శ్రీలంక ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో డ్రెస్సింగ్ రూం లో కెప్టెన్ బాబర్ ఒక మీటింగ్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఈ మీటింగ్ కాస్తా రసా బాసగా మారింది!
అవును... ఆసియా కప్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి నెలకొన్న తరుణంలో పాక్ పై సొంత మాజీ క్రికెటర్ లనుంచి తివ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఇదే సమయంలో డ్రెస్సింగ్ రూం లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సహచర ఆటగాళ్లతో సీరియస్ గా సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా... జట్టు సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇందులో భాగంగా... ఆటగాళ్లు బాధ్యతాయుతంగా ఆడటం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ సమయంలో అలా అందరినీ ఒకే గాటిన కట్టడంపట్ల అసహనం వ్యక్తం చేశాడు. బాగా ఆడనివారిని తిట్టడం సరే... బాగా ఆడినవారిని మెచ్చుకోండి అని పాక్ పేసర్ షాహీన్ అఫ్రీది బదులిచ్చాడు.
దీంతో మరింత సీరియస్ అయిన కెప్టెన్ బాబర్ ఆజం... ఎవరు ఎలా ఆడుతున్నారో తనకు తెలుసు, ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ రియాక్ట్ అయ్యాడు. దీంతో వ్యవహారం ముదురుతుండటంతో మహ్మద్ రిజ్వాన్ ఎంటరయ్యి సముదాయించాడు.
కెప్టెన్ రియాక్షన్ అలా ఉంటే... మరోపక్క ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మేనేజ్‌మెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాతకాలంనాటి ఆలోచనాధోరణితో వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించాడు. శ్రీలంకతో మ్యాచ్ కు తుది జట్టు ఎంపిక నాసిరకంగా ఉందని వ్యాఖ్యానించాడు. ఉత్తమ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా.. వరుసగా విఫలమవుతున్న వారితోనే ఆడించారని విమర్శించాడు.