పాక్ కి కొత్త కెప్టెన్స్ వీరే... బాబర్ ఆజాం తెలివైన నిర్ణయం?
అవును... పాకిస్థాన్ క్రికెట్ టీం కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బాబర్ ఆజం ఆన్ లైన్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు.
By: Tupaki Desk | 16 Nov 2023 7:41 AM GMT2023 వన్ డే ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ లలోనూ 4 మ్యాచ్ లు మాత్రమే గెలిచి 5 మ్యాచ్ లలో ఓడిపోయింది. టీం ఇండియాతో మ్యాచ్ ముందువరకూ స్ట్రాంగ్ గా కనిపించిన పాక్ జట్టు.. ఆ తర్వాత కోలుకోలేక, తేరుకోలేక ఇబ్బందులు పడింది. -0.19 నెట్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచింది. దీంతో, ఇంటా బయటా పాక్ జట్టు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది.
ఇందులో భాగంగా పాక్ ఆటగాళ్లను ఒక పక్క ఆదేశ క్రికెట్ అభిమానులు ఆన్ లైన్ వేదికగా వాయించి వదులుతుంటే.. మరోపక్క పాక్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. పాక్ జట్టుకు దేశంపైనా, క్రికెట్ పైనా గౌరవం, ప్రేమ, చిత్తశుద్ధి లేవని ఒకరంటే... కనీసం ఫిట్ నెస్ కూడా లేదని ఇంకొకరు ఫైరయ్యారు. మరి ముఖ్యంగా బాబర్ ఆజం కెప్టెన్సీపై అటు ట్రోలర్స్, ఇటు మాజీలూ రెచ్చిపోయారు.
ఈ నేపథ్యంలో ప్రధానంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సమయలో బోర్డ్ కీలక నిర్ణయం తీసుకోబోతుందనే కథనాలు వచ్చాయి. ఇందులో భాగంగా ప్రధానంగా కెప్టెన్ ని తప్పించవచ్చనే కథనాలు బలంగా వినిపించాయి. ఈ సమయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగమో.. లేక, నిజంగానే వరల్డ్ కప్ లో పాక్ టీం ఫెర్ఫార్మెన్స్ కి తన నిర్ణయాలు కూడా కారణమనే నమ్మకమో తెలియదు కానీ... కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు.
అవును... పాకిస్థాన్ క్రికెట్ టీం కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బాబర్ ఆజం ఆన్ లైన్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. ఇందులో భాగంగా... టెస్ట్, వన్ డే, టి20 ఫార్మాట్లలో కెప్టెన్సీ వదులుకుంటున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అయితే ఆటగాడిగా మాత్రం అన్ని ఫార్మేట్లలోనూ కంటిన్యూ అవుతున్నట్లు తెలిపాడు.
బాబర్ ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోవడం కూడా పాక్ అభిమానులకు మింగుడుపడటం లేదు. 2019లో పాక్ జట్టుకు నాయకత్వం వహించాలని పీసీబీ నుంచి పిలుపువచ్చిందని, ఆ క్షణం నుంచి ఇప్పటి దాకా మైదానం లోపల, వెలుపల చాలా ఎత్తుపల్లాలను చూశానని చెప్పాడు.
ఇదే సమయంలో... పాకిస్తాన్ ప్రతిష్టను కాపాడటమే లక్ష్యం అని మనస్ఫూర్తిగా అనుకున్నానని, అందుకు శాయశక్తులా కృషి చేశానని చెప్పుకొచ్చిన ఆజాం... తాను వన్డేలలో నంబర్ 1 స్థానానికి చేరుకోవడంలో తోటి ఆటగాళ్లు, కోచ్, ఇతర జట్టు మేనేజ్ మెంట్ సమిష్టి కృషి ఉందని అన్నాడు. ఈ సందర్భంగా పాక్ క్రికెట్ అభిమానులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు చెప్పాడు.
ఇలా ప్రపంచకప్ లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్ ఆజాం... జట్టు సారథ్యాన్ని వదిలిపెట్టాడు. ఇందులో భాగంగా... అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో... టెస్టు జట్టుకు షాన్ మసూద్ ను, టీ20లకు షహీన్ షా అఫ్రిదిని కెప్టెన్లుగా నియమించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్.