Begin typing your search above and press return to search.

బాలెన్ డి ఓర్.. ఆ ఫుట్ బాల్ దిగ్గజాల మధ్య "ఓ బంతి''

క్రీడల్లో అయినా.. రాజకీయాల్లో అయినా.. సమ కాలీకుల మధ్య పోలిక సహజం.. సమ ఉజ్జీల మధ్య సమరం సహజం.. ఇప్పుడిలాంటిదే ప్రపంచమంతటా ఆదరణ పొందిన ఫుట్ బాల్ లో జరుగుతోంది.

By:  Tupaki Desk   |   5 Nov 2023 6:23 AM GMT
బాలెన్ డి ఓర్.. ఆ ఫుట్ బాల్ దిగ్గజాల మధ్య ఓ బంతి
X

క్రీడల్లో అయినా.. రాజకీయాల్లో అయినా.. సమ కాలీకుల మధ్య పోలిక సహజం.. సమ ఉజ్జీల మధ్య సమరం సహజం.. ఇప్పుడిలాంటిదే ప్రపంచమంతటా ఆదరణ పొందిన ఫుట్ బాల్ లో జరుగుతోంది. ఆ ఇద్దరు దిగ్గజాల్లో ఎవరు గొప్ప..? ఎవరు మొనగాడు..? అనే చర్చ రేగుతోంది. ఇందుకు ఇటీవల ప్రకటించిన ఓ అత్యున్నత పురస్కారం మరింత మంట రాజేసింది. దీనికి తెరపడడం ఎలా అనేది సంశయంగా మారింది.

20 ఏళ్లుగా వారిద్దరే..

క్రికెట్ లో బ్రయాన్ లారా-సచిన్ టెండూల్కర్, టెన్నిస్ లో రోజర్ ఫెదరర్-రఫెల్ నాదల్ సమకాలీకులు. ఓ దశలో వీరిలో ఎవరు గొప్పనో తేల్చుకోలేని స్థితిలో ఉండేవారు అభిమానులు. ఇలానే ఫుట్ బాల్ లో 20 ఏళ్లుగా అర్జెంటీనా స్టార్ లయోనల్ మెస్సీ, పోర్చుగల్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో మధ్య నువ్వానేనా అనే సమరం సాగుతోంది. వాస్తవానికి నైపుణ్యంలో, ఫిట్ నెస్ లో ఇద్దరూ ఇద్దరే. ఇందుకు వారు సాధించిన రికార్డులు, గోల్సే సాక్ష్యం. అయితే, ఇద్దరిలో ఎవరు ది బెస్ట్ అనేది మాత్రం చర్చనీయాంశమే. ఇప్పుడు కెరీర్ చరమాంకంలో ఉండగా.. ఆ చర్చ మరోసారి తీవ్రంగా సాగుతోంది. అందుకు కారణంగా ఇటీవల ప్రకటించిన ‘బాలెన్ డి ఓర్’ పురస్కారం.

అటు 8.. ఇటు 5

ఇటీవల రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి బాలెన్ డి ఓర్ పురస్కారాన్ని అందుకున్నాడు మెస్సీ. ఏటా ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌ బాలర్ ఎవరో తేల్చే పురస్కారం ఇది. దీన్ని పొందడాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు ఫుట్‌ బాలర్లు. అంతర్జాతీయ ప్రదర్శనతో పాటు క్లబ్ ఆటను కూడా బాలెన్ డి ఓర్ పురస్కారానికి ప్రామాణికంగా తీసుకోవడం ప్రత్యేకత. మరెవరికీ సాధ్యం కాని రీతిలో దీన్ని 8 సార్లు గెలుచుకున్నాడు మెస్సీ. వాస్తవానికి 2017 వరకు మెస్సీ, రొనాల్డో చెరో అయిదేసి సార్లు బాలెన్ డి ఓర్ ను సొంతం చేసుకున్నారు. కానీ, రొనాల్డో అక్కడే ఆగిపోయాడు. అవార్డుల్లోనే కాదు ఆటలోనూ 2018 ప్రపంచ కప్ వరకు ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. ఐదారేళ్లుగా మాత్రం మెస్సీ ముందుకెళ్లిపోయాదు. మరో మూడు బాలెన్ డి ఓర్ పురస్కారాలు గెలుచుకున్నాడు.

టాప్ 30లోనే లేడు..

బాలెన్ డి ఓర్ కు పరిగణించిన టాప్-10లో కాదు కదా.. షార్ట్ లిస్ట్ చేసిన టాప్-30 లోనూ రొనాల్డో లేడు. దీన్నిబట్టే మెస్సీ అతడికంటే ఎంత ముందుకెళ్లాడో తెలుస్తోంది. మరోవైపు ఈ ఏడాది క్లబ్ ‌ఫుట్‌ బాల్‌లో మెస్సీ 17 గోల్స్ సాధిస్తే.. రొనాల్డో 11 కొట్టాడు. ఎర్లింగ్ హాలండ్ 52 గోల్స్ చేవాడు. అంతర్జాతీయ ప్రదర్శన ఆధారంగా మెస్సీని బాలెన్ డి ఓర్ విజేతగా ప్రకటించారు. ఇక ఇప్పటికే 38 ఏళ్లు దాటిన రొనాల్డో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు విషయంలో మెస్సీని అధిగమించే అవకాశమే కనిపించడం లేదు. దీంతో అర్జెంటీనా స్టార్ ‘మోడర్న్ ఆల్ టైం గ్రేట్’ కిరీటాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.

జోరు తగ్గినా.. రొనాల్డో రొనాల్డోనే..

జట్టుకు ప్రపంచ కప్ అందివ్వకపోవచ్చు.. తనలో జోరు తగ్గి ఉండొచ్చు.. కానీ, రొనాల్డోను మాత్రం తక్కువ చేసి చూడలేం.. అతడి నైపుణ్యాన్ని వంక పెట్టలేం. అంతర్జాతీయ స్థాయిలో కంటే క్లబ్‌ ఫుట్‌ బాల్‌లో అతడిది తిరుగులేని ప్రదర్శన. అందులోనూ మెస్సీ కంటే రొనాల్డో అంటేనే మ్యాచ్ కు క్రేజ్. అయితే, అంతర్జాతీయ మ్యాచ్ లకు వచ్చేసరికి మెస్సీదే మాయ. దీనికి ఒక విషయం చెప్పాలి. అర్జెంటీనా దశాబ్దాలుగా ప్రపంచ ఫుట్ బాల్ లో పెద్ద జట్టు. డిగో మారడోనా వంటి దిగ్గజాన్ని అందించిన దేశం అది. ఆ జట్టు కూడా మెరికల్లాంటి ఆటగాళ్లతో బలంగా ఉండేది. కానీ, పోర్చుగల్ అలా కాదు. అంతెందుకు..? రొనాల్డో తప్ప పోర్చుగల్ లో మరొక స్టార్ ప్లేయర్ లేడు. అసలు రొనాల్డో లేకుంటే పోర్చుగల్ గురించి ఎవరికీ తెలియదు.

మెస్సీకి జట్టే బలం.. రొనాల్డో జట్టుకే బలం

ఒక్కమాటలో చెప్పాలంటే.. మెస్సీకి అర్జెంటీనా జట్టు పెద్ద బలం. అదే పోర్చుగల్ జట్టుకు రొనాల్డోనే బలం. సొంత ప్రతిభకు తోడు తన జట్టు అండగా ఉండడంతో మెస్సీ ప్రపంచ స్థాయికి ఎదిగాడు. అదే రొనాల్డో.. పోర్చుగల్ ను మోసుకుంటూ తాను ఎదిగాడు. ఇద్దరిలో ఎవరినీ తక్కువ చేయలేం. మెస్సీ ఆడినా ఆడకున్నా అర్జెంటీనాకు ఓ స్థాయి ఉంది. అదే రొనాల్డో లేకుంటే పోర్చుగల్ పేరుకు మాత్రమే జట్టు. కనీసం నాకౌట్ చేరడమూ కష్టమే.

కొసమెరుపు: మెస్సీ, రొనాల్డోల్లో ఎవరు గొప్ప అనేది కాలమే నిర్ణయించాలి. అయితే, గత ఏడాది ఇద్దరూ తమ కెరీర్ లో చివరిది అనదగ్గ ప్రపంచ కప్ ఆడారు. మెస్సీ హోరాహోరీగా సాగిన ఫైనల్లో అర్జెంటీనాను విజేతగా నిలిపాడు. పోర్చుగల్ మాత్రం నాకౌట్ దశలో రొనాల్డో సేవలనే వద్దనుకుంది. కప్ కొట్టడంతో మెస్సీ ఖ్యాతి బాగా పెరిగింది. రొనాల్డోకు అతడికి మధ్య తేడా పెరిగింది. ఇక కొన్నేళ్లుగా క్లబ్ ఫుట్‌బా ల్‌లోనూ మెస్సీ ఆధిపత్యం సాగుతోంది. ప్రపంచ కప్, అత్యధికంగా ఎనిమిది బాలెన్ డి ఓర్ పురస్కారాలతో అతడు ఓ మెట్టు పైకెక్కాడు.