Begin typing your search above and press return to search.

మే 18.. విపరీతంగా వైరల్.. నం.7 అడ్డు పడుతుందేమో?

శనివారం.. మే 18.. అన్ని రోజుల్లాగానే ఇదీ ఒక రోజు.. ఒక తేదీనే కదా..? ఇందులో విశేషం ఏముంది? అనుకుంటున్నారా? కానీ, చాలా ఉంది.

By:  Tupaki Desk   |   18 May 2024 9:19 AM GMT
మే 18.. విపరీతంగా వైరల్.. నం.7 అడ్డు పడుతుందేమో?
X

శనివారం.. మే 18.. అన్ని రోజుల్లాగానే ఇదీ ఒక రోజు.. ఒక తేదీనే కదా..? ఇందులో విశేషం ఏముంది? అనుకుంటున్నారా? కానీ, చాలా ఉంది. ‘‘1 ప్లస్ 8 కలిపితే 9.. చాలామంది లక్కీ నంబర్’’.. ఇదే కదా మీరు చెప్పే విశేషం అనుకుంటున్నారా..? కానే కాదు. వారాంతంలో వినోదం.. రంజింపజేసే క్రికెట్ మ్యాచ్.. అది కూడా టి20.. అన్నిటికి మించి ఇద్దరు సూపర్ స్టార్ క్రికెటర్లు పోటీ పడుతున్నారు. అందుకే ఈ మే 18కి అత్యంత ప్రత్యేకత.

బెంగళూరా? చెన్నైనా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సాధారణంగా అయితే పట్టింపు లేనిది కావాలి. కానీ, చెన్నై 14 పాయింట్లతో, బెంగళూరు 12 పాయింట్లతో ఉండి ప్లేఆఫ్స్ నకు చివరి అవకాశంగా పోటీ పడుతున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇక స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీకి మరింత ప్రత్యేకంగా నిలవనుంది.

బెంగళూరుకు 16.. 17.. 18..

16 సీజన్లలో ఒక్కసారీ విజేతగా నిలవలేకపోయిన బెంగళూరు ఈసారి 17వ సీజన్ లోనూ పడుతూ లేస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో మే ‘18’న 18వ నంబరు జెర్సీకి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇది విరాట్ కోహ్లి జెర్సీ నంబరు. దీంతో ఉన్న అనుబంధాన్ని అతడు ఎన్నోసార్లు పంచుకున్నాడు. ఇప్పుడు ప్లేఆఫ్స్‌ సందర్భంగా మరోసారి ఈ నంబరు తెరపైకి వచ్చింది.

ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్‌ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్‌ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్ చేరాయి. మరి నాలుగో జట్టు ఏమిటనేది శనివారం తేలనుంది. అది చెన్నైనా, బెంగళూరునా? అనేది తేలేందుకు మే 18న ముహూర్తం కుదిరింది.

అన్నీ 18తో ముడిపడే..

చెన్నైపై ఆర్సీబీ గెలిచినా.. ఫ్లే ఆఫ్స్‌ చేరాలంటే చాలా లెక్కలున్నాయి. బెంగళూరు మొదట బ్యాటింగ్‌ చేస్తే ‘18’ పరుగుల తేడాతో, రెండోసారి ఆడితే ‘18’.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి. ఇక 2013 నుంచి ఐపీఎల్‌ లో బెంగళూరు మే 18న ఆడిన మ్యాచ్ ల్లో ఒక్కటీ ఓడిపోలేదు. అంతేకాదు.. తన 18వ నంబరు జెర్సీతో మే 18న విరాట్‌ కోహ్లి రెండు శతకాలు, ఒక అర్ద శతకం బాదాడు.

మే 18న బెంగళూరుదే గెలుపు

ఇప్పటివరకు మే 18న బెంగళూరు నాలుగు మ్యాచ్‌ లు ఆడగా.. రెండుసార్లు చెన్నైతో తలపడింది. వీటిలో బెంగళూరే నెగ్గగా.. కోహ్లి రాణించాడు. మరి ఈ మే 18నే మ్యాచ్‌ జరుగుతుండడంతో ఆర్సీబీకి విజయం చేకూరుతుందా? కోహ్లి మళ్లీ రాణించి జట్టును ప్లే ఆఫ్స్ చేరుస్తాడా? లేదా అనేది చూడాలి.

కొసమెరుపు: 18వ నంబరు కోహ్లికి ఎంత ఫేమసో.. 7వ నంబరు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి అంతే. గతంలో చాలామంది ఇష్టపడని 7వ నంబరు ఇప్పుడు చాలా ఫేమస్ అయిందంటే ధోనీతోనే. మరి శనివారం మ్యాచ్ లో 18వ నంబరు జెర్సీని 7వ నంబరు అడ్డుకుంటుందా?