బంగ్లా క్రికెట్ చైర్మన్ గాయబ్.. ప్రపంచ కప్ తో పాటు ఆ జట్టు టూర్లన్నీ డౌట్
అయితే, ఇంకో కీలక పరిణామం ఏమంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ నాలుగైదు రోజుల నుంచి కనిపించడం లేదు.
By: Tupaki Desk | 8 Aug 2024 1:30 PM GMTఅల్లకల్లోల బంగ్లాదేశ్ లో క్రికెట్ పరిస్థితి ఏమిటన్నది తెలియరాకుండా ఉంది. ఇద్దరు బంగ్లా ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు అయిన వారు తాజాగా పదవిని కోల్పోయిన షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఎంపీలు. వీరిలో ఒకరు మేటి పేసర్ మొష్రఫె మొర్తజా కాగా మరొకరు షకిబుల్ హసన్. తాజా ఆందోళనల సందర్భంగా మొష్రఫె మౌనంగా ఉన్నాడు. నరైల్ లోని ఇతడి ఇంటిని ఆందోళనకారులు దహనం చేశారు. షకిబుల్ కెనడాలో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే, ఇంకో కీలక పరిణామం ఏమంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ నాలుగైదు రోజుల నుంచి కనిపించడం లేదు. ఇతడు ఈ ఏడాది మొదటి వరకు బంగ్లా క్రీడల మంత్రి కూడా. ఆందోళనకారులు ఇతడి ఇంటినీ ధ్వంసం చేశారు.
బంగ్లాదేశ్ సీనియర్ జట్టు ఈ నెల 16 నుంచి పాకిస్థాన్ తో పాకిస్థాన్ లో సిరీస్ ఆడనుంది. ఎ జట్టు మంగళవారమే బయల్దేరాల్సి ఉంది. కానీ, ఆందోళనల కారణంగా కొన్నిరోజులుగా ప్రాక్టీస్ సెషన్ కూడా జరగలేదు. ఢాకా విమానాశ్రయం మూసివేతతో ప్రయాణమూ రద్దయింది. శనివారం నుంచి జరగాల్సిన మ్యాచ్ ను 13వ తేదీకి మార్చారు. మరోవైపు లంక నుంచి తిరిగొచ్చిన బంగ్లా మహిళల జట్టు ప్రాక్టీస్ కూడా ఆగిపోయింది.
ఇక అక్టోబరు నుంచి బంగ్లాదేశ్ లో మహిళల టి20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే, ఇది రద్దయ్యే అవకాశమే ఎక్కువ. వేదికను భారత్, యూఏఈ లేదా శ్రీలంకకు మార్చే ఆలోచన చేస్తున్నారు.
ఏడాదిపైగా వ్యవధి ఉన్నా..
బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)కి ఏడాదిపైగా అంటే 2025 అక్టోబరు వరకు వ్యవధి ఉంది. కానీ, నజ్ముల్.. మాజీ ప్రధాని హసీనాకు బాగా దగ్గరివాడు. కాబట్టి కొత్త ప్రభుత్వం ఆయనను కొనసాగించదు. అసలు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. బీసీబీ డైర్టకర్ అయిన మరో వ్యక్తి అవామీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యాడు. బోర్డులోని చాలామంది డైరక్టర్లకు హసీనా పార్టీతో లింకులున్నాయి. హసీనా బంధువులు బోర్డులో ఉన్నారు. వీరిలో ఈ నెల 5 నుంచి చాలామంది ఫోన్లు స్విచ్ఛాఫ్. వీరెవరూ అందుబాటులో లేరు.
నజ్ముల్ ఎక్కడ?
బీసీబీ చైర్మన్ అయిన నజ్ముల్ హుసేన్ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ఆయన దేశం విడిచిపోయారని కూడా చెబుతున్నారు. కొందరేమో బంగ్లాదేశ్ లోనే ఉన్నాడని అంటున్నారు. కిషన్ గంజ్ లోని ఇతడి పూర్వీకుల ఇంటిని దుండగులు దహనం చేశారు. అయితే, ఆయన అందులో లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.