Begin typing your search above and press return to search.

లంక ఆలౌట్ రికార్డు.. మరెవరికీ దక్కని ఘనత

నిన్నటి మ్యాచ్ మొత్తంలో లంక యువ సంచలనం మతీశా పతిరన బౌలింగే హైలైట్. అతడు మొత్తం నాలుగు వికెట్లతో బంగ్లాను దెబ్బతీశాడు

By:  Tupaki Desk   |   1 Sep 2023 7:51 AM GMT
లంక ఆలౌట్ రికార్డు.. మరెవరికీ దక్కని ఘనత
X

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ జట్లంటే నాలుగే. అవి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్. ఇవికాక న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక తర్వాతి స్థానాల్లో ఉంటాయి. బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ ది ఆ తర్వాతి స్థానం. ఇక వెస్టిండీస్ సంగతి సరేసరి. రెండేసి సార్లు వన్డే, టి20 చాంపియన్ గా నిలిచిన ఆ జట్టు ఈసారి వన్డే ప్రపంచ కప్ నకు అర్హతే సాధించలేకపోయింది. జింబాబ్వే కిందామీద పడుతూ వస్తోంది. కాగా, ప్రపంచ కప్ సమీపిస్తున్న కొద్దీ జట్లు సన్నాహాలు ముమ్మరం చేశాయి. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా, ఇంగ్లండ్-న్యూజిలాండ్ టి20లు ఆడుతున్నాయి. మరోవైపు ఆసియా జట్లు ఆసియా కప్ పేరిట మినీ ప్రపంచ కప్ సమరంలో తలపడుతున్నాయి. కాగా, ఈ సారి ఆసియా కప్ నకు పాకిస్థాన్ పూర్తిగా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండింది. భద్రతా కారణాల రీత్యా భారత్ వెళ్లనని స్పష్టం చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. చివరకు ఆసియా కప్ ను బంగ్లాదేశ్, శ్రీలంకతో సంయుక్తంగా నిర్వహిస్తోంది.

బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో నేపాల్ ను పాకిస్థాన్ ఓ ఆటాడుకుంది. పాకిస్థాన్ 350 పైగా పరుగులు చేసి శుభారంభం చేసింది. అయితే, గురువారం శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా లంక-బంగ్లాదేశ్ తలపడ్డాయి. స్లో పిచ్ కారణంగా మ్యాచ్ సాదాసీదాగా సాగింది. చివరకు 5 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. తొలుత బంగ్లా.. 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. నజ్ముల్ హొసేన్‌ శాంటో(89) మినహా ఇతర బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

చెన్నై చిన్నోడి మెరుపులు..

నిన్నటి మ్యాచ్ మొత్తంలో లంక యువ సంచలనం మతీశా పతిరన బౌలింగే హైలైట్. అతడు మొత్తం నాలుగు వికెట్లతో బంగ్లాను దెబ్బతీశాడు. లంక బౌలింగ్ దిగ్గజం మలింగను పోలిన శైలితో బంతులేసే పతిరన.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ధోనీ నాయకత్వంలో ఆడడం అతడికి బాగా మేలు చేసింది. మొన్నటివరకు లంక జట్టులో అతడు శాశ్వత సభ్యుడు కాదు. అయితే, ఈ సీజన్ ఐపీఎల్ తర్వాత పతిరన మెరుగైన బౌలర్ గా నిలిచాడు. దీంతోనే లంక జాతీయ జట్టులోకి పిలుపొచ్చింది. కాగా, గురువారం బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలిచింది. చరిత్ అసలంక (92 బంతుల్లో 62 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సమరవిక్రమ (77 బంతుల్లో 54; 6 సిక్స్‌లు) రాణించారు.

ఆలౌట్ రికార్డు..

ఆసియా కప్ లో శనివారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీనికీ పల్లకెలె మైదానమే వేదిక. అయితే, గురువారం మ్యాచ్ జరిగినదాన్ని బట్టి చూస్తే స్లో పిచ్ దాయాది జట్లకు సవాల్ విసరనుంది. కాగా, లంకతో మ్యాచ్ లో బంగ్లా పేలవ ప్రదర్శన కనబర్చింది. చాలా ఓవర్లు ఉండగానే ఆలౌటైంది. గత ఆసియా కప్ లో లంకను నిలువరించిన ఆ జట్టు ఈసారి తేలిపోయింది. ఈ క్రమంలోనే శ్రీలంక ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బంగ్గాదేశ్ ను ఆలౌట్ చేయడం ద్వారా ఈ ఘనతను తమ పేరిట లిఖించుకుంది. లంక వరుసగా 11 సార్లు ప్రత్యర్ధి జట్టును ఆలౌట్ చేసింది. అంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పేరిట ఉంది. ఈ జట్లు వరుసగా 10 సార్లు ప్రత్యర్ధి జట్టును ఆలౌట్‌ చేశాయి.