Begin typing your search above and press return to search.

సంక్షోభం వేళ బంగ్లా సంచలనం.. స్వాతంత్ర్య సమరం సాగించిన దేశంపైనే

1947లో అవిభాజ్య భారత దేశం రెండు ముక్కలుగా విడిపోయింది.. అందులో తూర్పు పాకిస్థాన్ తో కలిసి పాకిస్థాన్ ఏర్పడింది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 11:30 AM GMT
సంక్షోభం వేళ బంగ్లా సంచలనం.. స్వాతంత్ర్య సమరం సాగించిన దేశంపైనే
X

1947లో అవిభాజ్య భారత దేశం రెండు ముక్కలుగా విడిపోయింది.. అందులో తూర్పు పాకిస్థాన్ తో కలిసి పాకిస్థాన్ ఏర్పడింది. ఆ తూర్పు పాకిస్థాన్ చివరకు 1970ల నాటికి పాకిస్థాన్ పాలన వద్దని.. తమకూ స్వాతంత్ర్యం కావాలంటూ పెద్దఎత్తున ఉద్యమించింది. చివరకు బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది. ఇదంతా తెలిసిన కథే. ఇటీవలే బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో కూడా అందరూ చూశారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఏకంగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా పదవి దిగిపోయేందుకు కారణమైంది. ఆమె భారత్ లో ప్రవాసం ఉంటున్నారు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రల్లో పాకిస్థాన్ హస్తం కూడా ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ జట్టు చరిత్రకెక్కే రీతిలో విజయం సాధించింది.

ఎచ్చుకు పోయి రొచ్చు..

2 టెస్టుల సిరీస్ కోసం కనీసం జట్టు ప్రాక్టీస్ కూడా చేసుకోలేని స్థితిలో పాకిస్థాన్ కు వచ్చింది బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ అయితే హసీనా పార్టీ (అవామీ లీగ్) ఎంపీ. అతడు కెనడాలో లీగ్ ఆడుతూ ఉండగా స్వదేశంలో ఘర్షణలు చెలరేగాయి. నేరుగా పాకిస్థాన్ టూర్ కు వచ్చేశాడు షకిబ్. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ పెను సంచలనం రేపింది. పాకిస్థాన్‌ కు భారీ షాకిచ్చింది. టెస్టుల్లో తొలిసారి ఆ జట్టును అది కూడా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడించింది. రావల్పిండిలో జరిగిన ఈ టెస్టులో మరో రికార్డునూ సాధించింది. అదేమంటే.. సొంతగడ్డపై పాకిస్థాన్‌ ను పది వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టు బంగ్లాదేశ్ మాత్రమే. కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ ను 448/6 వద్ద డిక్లేర్ చేసింది. వాస్తవానికి ఇక్కడే పాకిస్థాన్ ఎచ్చులకు పోయింది. స్టార్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ (171నాటౌట్) క్రీజులో ఉండగా, అతడి డబుల్ సెంచరీనీ కాదని, మూడు రోజులపైగా ఆట ఉండగా డిక్లేర్ చేసి తానేదో గొప్ప అని చాటాలనుకుంది. కానీ, బంగ్లాదేశ్ మాత్రం వేరే విధమైన ఫలితం చూపించింది. స్టార్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం (191; 341 బంతుల్లో) సూపర్ ఇన్నింగ్స్ కు తోడు.. షాద్మాన్ ఇస్లాం (93), మోమినుల్ హక్ (50), లిటన్ దాస్‌ (56), మెహదీ హసన్ (77) అర్ధ శతకాలతో ఏకంగా 565 పరుగులు సాధించింది.

తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగుల ఆధిక్యం సమర్పించుకున్న పాకిస్థాన్.. రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే ఆలౌటైంది. 55.5 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. రిజ్వాన్ (51) మళ్లీ రాణించినా మిగతావారు ఫెయిలయ్యారు. ఇక 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా 6.3 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. బంగ్లా స్పిన్నర్లు మెహదీ హసన్‌ మిరాజ్‌ (4/21), షకీబ్ అల్ హసన్‌ (3/44) పాకిస్థాన్ ను పరాజయంలోకి నెట్టారు. ఈ నెల 30 నుంచి రావల్పిండిలోనే పాక్ బంగ్లా రెండో టెస్టు ఆడతాయి.

కొసమెరుపు: ప్రస్తుతం పాకిస్థాన్ ఉన్న స్థితిలో చూస్తుంటే బంగ్లా ఆ జట్టుపై టెస్టు సిరీస్ గెలిచినా ఆశ్చర్యం లేదు. రెండో టెస్టును డ్రా చేసుకున్నా, వర్షం కారణంగా ఇబ్బంది తలెత్తినా.. బంగ్లా 1-0తో సిరీస్ ను గెలుచుకుంటుంది. అదే జరిగితే మరో చరిత్రే. ఇక పాక్ తో టెస్టులో క్రీజులో ఉండగా హత్య కేసు నమోదైన ఆల్ రౌండర్ షకిబ్ తొలి టెస్టులో మూడు వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు.