Begin typing your search above and press return to search.

నో గిల్.. హార్దిక్ కు షాక్.. షమీ రీ ఎంట్రీ.. అక్షర్ కు ప్రమోషన్

ఒక్క జట్టు ఎంపికలో ఎన్నో విషయాలు.. మరెన్నో మార్పులు.. టి20 ప్రపంచ చాంపియన్ జట్టులో ఇన్ని అనూహ్యాలా..? ఇంగ్లండ్ తో ఈ నెల 22 నుంచి జరగనున్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టును గమనిస్తే

By:  Tupaki Desk   |   12 Jan 2025 5:30 PM GMT
నో గిల్.. హార్దిక్ కు షాక్.. షమీ రీ ఎంట్రీ.. అక్షర్ కు ప్రమోషన్
X

ఒక్క జట్టు ఎంపికలో ఎన్నో విషయాలు.. మరెన్నో మార్పులు.. టి20 ప్రపంచ చాంపియన్ జట్టులో ఇన్ని అనూహ్యాలా..? ఇంగ్లండ్ తో ఈ నెల 22 నుంచి జరగనున్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టును గమనిస్తే అనేక సంచలనాలు కనిపిస్తాయి. 360 డిగ్రీ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల జట్టులో పలు మార్పులు కనిపించాయి.

సరిగ్గా 14 నెలలు.. వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ జరిగి. స్టార్ పేసర్ మొ హమ్మద్ షమీకి అదే అంతర్జాతీయంగా చివరి మ్యాచ్. దాని తర్వాత మోకాలి గాయానికి గురైన షమీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. రెండు నెలల కిందటే దేశవాళీ క్రికెట్ లోకి తిరిగొచ్చాడు. ఇటీవలి బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేస్తారని భావించినా అలా జరగలేదు.ఇప్పుడు మాత్రం ఇంగ్లండ్ తో టి20 సిరీస్ కు తీసుకుని ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి షమీ టి20ల్లో రెగ్యులర్ కాదు. అయినా తీసుకున్నారంటూ.. బుమ్రా లేకుండా చాంపియన్స్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్) ఆడాల్సి వస్తే షమీని సంసిద్ధంగా ఉంచే ఆలోచన అనుకోవాలి.

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని.. వైస్ కెప్టెన్సీ ఇచ్చి మరీ గత ఏడాది జూలైలో శ్రీలంకతో టి20 సిరీస్ ఆడించిన యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్ కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ షాకిచ్చింది. ఇంగ్లండ్ తో మూడు టి20ల సిరీస్ కు అతడిని ఎంపిక చేయలేదు. దీంతో గిల్ ను వన్డే, టెస్టులకు పరిమితం చేస్తారా? అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ పెద్దగా ఆకట్టుకోని సంగతి తెలిసిందే.

గత ఏడాది టి20 ప్రపంచ కప్ ఫైనల్లో మంచి ఇన్నింగ్స్ ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను ఇంగ్లండ్ తో టి20లకు అనూహ్యంగా వైస్ కెప్టెన్ చేయడం గమనార్హం. గిల్ లేకుంటే హార్దిక్ కు అయినా వైస్ కెప్టెన్స్ ఇవ్వాలి. కానీ, అక్షర్ ను ఆ పదవికి ఎంపిక చేశారు. చూస్తుంటే రిటైరైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ ఫిక్స్ అయినట్లే ఉన్నాడు.

ఏడాది కిందటి వరకు టీమ్ ఇండియా కాబోయే టి20 కెప్టెన్ అంటే అందరూ హార్దిక్ పాండ్యా పేరే చెప్పారు. రోహిత్ దూరంగా ఉన్నప్పుడు హార్దిక్ ను కెప్టెన్ చేశారు కూడా. కానీ, టి20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ రిటైర్ కాగా.. హార్దిక్ కు కెప్టెన్సీ ఇవ్వకుండా సూర్య వైపు మొగ్గారు. ఇప్పుడు గిల్ ను పక్కనపెట్టినందున హార్దిక్ వైస్ కెప్టెన్సీ ఇవ్వాలి. కానీ, అక్షర్ ను ఎంచుకున్నారు.

తెలుగోళ్లకు లక్కీ చాన్స్

గత సిరీస్ లో దక్షిణాఫ్రికాపై దంచికొట్టిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ఆస్ట్రేలియా సిరీస్ లో రాణించిన ఆల్ రౌండర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి లు ఇంగ్లండ్ తో సిరీస్ కు చోటు దక్కించుకున్నారు. హైదరాబాదీ పేసర్ సిరాజ్ కు విశ్రాంతినిచ్చారు.