ఆ నలుగురు... వైట్ వాష్ తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం!
న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా ఘోర పరాజయం చవిచుసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 Nov 2024 3:48 AM GMTన్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా ఘోర పరాజయం చవిచుసిన సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెట్ అభిమానులకు అత్యంత చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది చారిత్రాత్మక ఓటమే కాదు.. బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయాలకూ కారణమైన ఓటమి అని కూడా చెప్పొచ్చు.
అవును... న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా వైట్ వాష్ ను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో "ఆ నలుగురూ" అనే చర్చ మొదలైంది. ప్రధానంగా... సీనియర్ స్టార్ బ్యాటర్స్ విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మల పెర్ఫార్మెన్స్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం దిశగా ఆలోచిస్తోందని అంటున్నారు.
అయితే.. ఆ సంచలన నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆ సీనియర్లకు మరో అవకాశం ఉందని గుర్తుచేస్తున్నారు. వాస్తవానికి కివీస్ తో సిరీస్ లో వైట్ వాష్ అవ్వడంతో రబోయే డబ్ల్యూటీసీని దృష్టిలో పెట్టుకుని.. జట్టులోని సీనియర్ ఆటగాళ్లయిన విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లను పక్కనపెట్టాలని భావిస్తున్నట్లు తెలిస్తోంది.
అయితే... బోర్డర్ - గవస్కర్ ట్రోఫీ తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతం గంభీర్, బీసీసీ పెద్దలు కలిసి.. కెప్టెన్ రోహిత్ శర్మతో అనధికారిక చర్చలు జరపనున్నారని కథనాలొస్తున్నాయి.
వాస్తవానికి ఆసిస్ తో సిరీస్ కి ఇప్పటికే జట్టును ప్రకటించడం సీనియర్స్ కి కలిసొచ్చిందనే చెప్పాలి. లేదంటే.. కివీస్ తో వైట్ వాష్ అనంతరం కచ్చితంగా బీసీసీఐ కీలక నిర్ణయాలే తీసుకునేది. అయితే... ఇప్పుడు ఆ అవకాశం లేదు. కానీ... ఇంగ్లాడ్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కు టీమిండియా అర్హత సాదింకపోతే మాత్రం సంచలన నిర్ణయాలే అని అంటున్నారు.
అదే జరిగితే ఆ నలుగురు సూపర్ సీనియర్లు యూకేలో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం విమానంలో ఉండరని కన్ ఫాం చేసుకొవచ్చని.. ఇదే సమయంలో స్వదేశంలోనూ ఆ నలుగురూ కలిసి ఇప్పటికే తమ ఫైనల్ టెస్టు ఆడేసినట్లే భావించాలని బీసీసీఐ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా.. నవంబర్ 22 నుంచి బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ 4-0తో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండానే డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ నేరుగా చేరుతుంది. ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ను లండన్ లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జూన్ 11-15 మధ్య నిర్వహించనున్నారు!