Begin typing your search above and press return to search.

బీసీసీఐ ఎదుట రెండు బౌన్సర్లు.. ఐపీఎల్ పై పెద్ద ఇంపాక్ట్ పడనుందా?

భారత దేశవాళీ క్రికెట్ కు సమయం ఆసన్నమైంది. సెప్టెంబరు 5 నుంచి దులీప్ ట్రోఫీ జరగనుంది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 11:42 AM GMT
బీసీసీఐ ఎదుట రెండు బౌన్సర్లు.. ఐపీఎల్ పై పెద్ద ఇంపాక్ట్ పడనుందా?
X

భారత దేశవాళీ క్రికెట్ కు సమయం ఆసన్నమైంది. సెప్టెంబరు 5 నుంచి దులీప్ ట్రోఫీ జరగనుంది.గతం లో జోనల్ వారీగా జరిగిన ఈ టోర్నీని ఇప్పుడు నాలుగు జట్లుగా విభజించి ఆడిస్తున్నారు. ఈ తర్వాత నుంచి వరుసగా రంజీలు, ముస్తాక్ అలీ టి20 టోర్నీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎదుట రెండు సవాళ్లు నిలిచాయి. ఇవి దేశవాళీ క్రికెట్ తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ పెద్ద ప్రభావమే చూపనున్నాయి. ఇంతకూ ఆ రెండు అంశాలు ఏమంటే..

ఒకటా.. రెండా?

అంతర్జాతీయ క్రికెట్ లో ఓవర్ కు ఒక బౌన్సర్ వేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. కాగా, భారత దేశవాళీల్లో రెండు బౌన్సర్లను అనుమతించాలనే వాదన ఉంది. దీనిపై సానుకూలత వ్యక్తం అవుతున్నప్పటికీ.. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఒకటే బౌన్సర్ ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. రెండు రకాల నిబంధనలతో వర్ధమాన ఆటగాళ్లే కాదు.. సీనియర్లూ ప్రభావితం అవుతారని పేర్కొంటున్నారు. ఇక రెండో నిబంధన ఇంపాక్ట్ ప్లేయర్. ఐపీఎల్ లో ప్రవేశపెట్టిన ఈ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని తీసివేయాలా? ఉంచాలా? అనేది స్పష్టం కావాల్సి ఉంది.

ఐపీఎల్ లో ఏం చేస్తారో?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ‘ఇంపాక్ట్’ ప్లేయర్ విధానంపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఆల్‌ రౌండర్ల సేవలను వినియోగించుకోలేక పోతున్నామని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. అయితే, అసలైన ఆల్‌ రౌండర్లకు ఇదేమీ అడ్డంకి కాదని లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ జహీర్‌ ఖాన్ తెలిపాడు. ఇలా పరస్పర భిన్న అభిప్రాయాల నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్, ఓవర్ కు రెండు బౌన్సర్లు నిబంధనపై త్వరలోనే బీసీసీఐ సమీక్షించనుంది. నవంబరులో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ జరగనుంది. ఇందులో నిరుడు రెండు బౌన్సర్ల రూల్‌ ను ప్రవేశపెట్టగా బౌలర్లు చక్కగా వినియోగించుకుని ఫలితాలు రాబట్టారు. మరో రెండు నెలల్లో టోర్నీ ఉన్నందున ఆలోగానే బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.