Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియాకు బీసీసీఐ ‘టెన్ కమాండ్ మెంట్స్’..గీత దాటితే వేటే

బీసీసీఐ నుంచి నేరుగా ప్రకటన రాకున్నా.. అది అమలు చేయనున్న పది పాయింట్లు ఇవేనని కొన్ని బయటకు వచ్చాయి.

By:  Tupaki Desk   |   17 Jan 2025 6:30 PM GMT
టీమ్ ఇండియాకు బీసీసీఐ ‘టెన్ కమాండ్ మెంట్స్’..గీత దాటితే వేటే
X

శ్రీలంతో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ఓటమి.. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో ఎన్నడూ లేనట్లు టెస్టు సిరీస్ లో క్లీన్ స్వీప్.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఓటమితో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు మిస్.. ఇదీ గత ఏడు నెలల్లో టీమ్ ఇండియా ప్రదర్శన. ఈ సిరీస్ లన్నీ హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించాక జరిగినవి కావడం గమనార్హం. అయితే, ఇక్కడ అతడి వైఫల్యం ఏమీ లేదు. అసలు కారణాలు.. సీనియర్ ఆటగాళ్ల దారుణ వైఫల్యం.. కుర్రాళ్లు ఇంకా కుదురుకోకపోవడం.. బౌలర్ల ప్రదర్శన పడిపోవడమే. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మేల్కొంది. పరిస్థితులను తక్షణమే గాడిన పెట్టేందుకు సిద్ధమైంది.

ఓ వైపు జట్టును ప్రక్షాళన చేస్తూనే ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి అమలు చేయనుంది. తాజాగా పది పాయింట్ల పాలసీని సిద్ధం చేసిందని తెలుస్తోంది. వీటిలో ముఖమైనది దేశవాళీ క్రికెట్‌ కు పెద్దపీట. ఇపై ఫిట్‌ నెస్‌.

బీసీసీఐ నుంచి నేరుగా ప్రకటన రాకున్నా.. అది అమలు చేయనున్న పది పాయింట్లు ఇవేనని కొన్ని బయటకు వచ్చాయి. వీటిని కచ్చితంగా పాటించాలని, మినహాయింపు కావాలంటే సరైన కారణంతో అనుమతి పొందాలని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. కాదూ కూడదని అతిక్రమిస్తే ఆ ఆటగాళ్లకు జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్ లోనూ నిషేధం తప్పదని తెలుస్తోంది.

ఆ పది ఇవేనా?

* సిరీస్‌ ల సమయంలో ఎలాంటి వ్యక్తిగత షూటింగ్‌ లు లేదా అడ్వర్టయిజ్ మెంట్లకు ఆటగాళ్లకు అనుమతి లేదు.

* విదేశీ పర్యటన 45 రోజులకు మించితే ఆటగాళ్లతో పాటు కుటుంబాలను రెండు వారాల పాటు అనుమతిస్తారు. తక్కువ వ్యవధి సిరీస్‌ లైతే ఈ వ్యవధి వారం రోజులే.

* ఏ సిరీస్‌ కైనా వ్యక్తిగతంగా కాకుండా జట్టుతోనే కలిసి ప్రయాణించాలి. దీంతో ఆటగాళ్ల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబంతో ప్రయాణించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి.

* జాతీయ జట్టుకు ఎంపికవాలంటే దేశవాళీల్ల ఆడాల్సిందే. కుర్రాళ్లతోపాటు సీనియర్లయినా ఇంతే. సరైన కారణం ఉంటే మినహాయింపు పొందొచ్చు.

* ఆటగాళ్లు బోర్డు అనుమతి లేకుండా వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకువెళ్లకూడదు. అనుమతి తీసుకోవాల్సిందే.

* ఇప్పటివరకు బీసీసీఐ లగేజీకి బీసీసీఐ అన్ లిమిటెడ్ గా ఫీజు చెల్లిస్తోంది. ఇకపై అది 150 కేజీల వరకు మాత్రమే పరిమితం. మించితే ఆటగాళ్లే రుసుము చెల్లించాలి.

* ప్రాక్టీస్‌ కు ప్రతి క్రికెటర్ రావాలి. సహచరులతో ఒకే బస్సులో ప్రయాణించాలి.

* బీసీసీఐ మీటింగ్‌ లు, కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలి.

* సిరీస్‌ లేదా మ్యాచ్‌ ముగిసిన వెంటనే సొంతంగా కాకుండా జట్టుతో పాటే వెళ్లాలి. అందరూ కలిసే ప్రయాణించాలి.

* స్టార్‌ క్రికెటర్లు వ్యక్తిగత రూమ్‌ లలో కాకుండా సహచరులతో రూమ్‌ను పంచుకోవాలి. ఫ్యామిలీ వచ్చినప్పుడు ప్రత్యేకంగా రూమ్ ఇస్తారు.