Begin typing your search above and press return to search.

గంభీర్ కు, టీమ్ ఇండియా ప్లేయర్లకు షాక్ ల మీద షాక్ లు

న్యూజిలాండ్ తో సొంతగడ్డపై క్లీన్ స్వీప్.. ఆపై ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ సిరీస్ లో పరాజయం..

By:  Tupaki Desk   |   14 Jan 2025 4:30 PM GMT
గంభీర్ కు, టీమ్ ఇండియా ప్లేయర్లకు షాక్ ల మీద షాక్ లు
X

న్యూజిలాండ్ తో సొంతగడ్డపై క్లీన్ స్వీప్.. ఆపై ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ సిరీస్ లో పరాజయం.. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు మిస్.. దీనికిమించి బాధించినది సీనియర్ల దారుణ వైఫల్యం.. ఇదీ టీమ్ ఇండియా పరిస్థితి. మున్ముందు చూస్తేనేమో కీలక టోర్నమెంట్లు. ఇలాగే ఉంటే కష్టమే అనే అభిప్రాయానికి వచ్చిందేమో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). దీంతో చేతిలో కత్తెర పట్టుకుని తిరుగుతోంది.

భారత క్రికెట్ పై శనివారం బీసీసీఐ సమీక్ష నిర్వహించింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గంభీర్, ప్లేయర్ల స్వేచ్ఛకు కత్తెర వేయనుంది. వాస్తవానికి వీరికి ఇప్పటివరకు బీసీసీఐ ఎవరికీ ఇవ్వనంతగా అధికారాలు, స్వేచ్ఛ ఇచ్చింది.

జట్టు ఎంపికతో పాటు సహాయక కోచ్‌ లుగా ఎవరిని తీసుకోవాలో నిర్ణయించుకునే అవకాశం కల్పించింది. అయితే, తాజా ఫలితాలతో కత్తెరకు పనిచెప్పింది.

2019 నుంచి విదేశీ టూర్ల సందర్భంగా సీనియర్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులకూ బీసీసీఐ అనుమతిచ్చింది. అయితే, ఇది ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతోందని భావిస్తోంది. ఇకమీదట విదేశీ పర్యటనలకు భార్య సహా కుటుంబసభ్యులకు ఎవరికీ అనుమతి ఇచ్చే అవకాశం లేదని సమాచారం. అంటే.. 2019కి ముందున్న నిబంధనలను మళ్లీ తేనుందట. నెలన్నర పాటు విదేశీ పర్యటన ఉంటే ఆటగాళ్ల కుటుంబసభ్యులతో ఉండేందుకు కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది.

బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ ఇలా తనకు ఇష్టమైనవారిని తీసుకునేందుకు గంభీర్‌ కు బీసీసీఐ స్వేచ్ఛ ఇచ్చింది. కానీ, ఇప్పుడు దానికీ కత్తెర వేయనుందట.

గౌరవ్ అరోరా అనే వ్యక్తి గంభీర్‌ మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ హోదాలో జట్టుతో పాటే హోటల్‌ లో ఇతడికీ బస కల్పిస్తున్నారు. ఇకపై ఆ అవకాశం లేదు. మ్యాచ్ ల సందర్భంగా స్టేడియంలోని వీఐపీ బాక్స్‌ లో కూర్చునే అవకాశం కూడా గౌరవ్ అరోరాకు ఉండదు.

జట్టు సహాయక సిబ్బంది కాలాన్ని కూడా మూడేళ్లకు కుదించనుందట. ప్రదర్శన ఆధారంగానే వీరికి మళ్లీ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

అన్నిటికి కంటే బిగ్ షాక్..

టీమ్ ఇండియా ఆటగాళ్ల విషయంలో మరో బిగ్ షాక్. 150 కేజీల లగేజీకి మించి ఉంటే దానికి చార్జీలను వారే చెల్లించాల్సి ఉంటుంది. ఇంకో బిగ్ షాక్ ఏమంటే.. ఆటతీరు ప్రకారమే ఆటగాళ్లకు చెల్లింపులు చేయనున్నారట. అంటే సరిగా ఆడకుంటే సంపాదనలో కోత వేస్తారట. ఇది క్రికెటర్లను అప్రమత్తంగా ఉంచేందుకు పనికొస్తుందని భావిస్తున్నారు. అయితే, దీనిపై బీసీసీఐ తుది నిర్ణయానికి రావాల్సి ఉంది.